KCR Politics : కాంగ్రెస్ సీనియర్లపై కేసీఆర్ ఆకర్ష్ - బీఆర్ఎస్‌లో అలజడి రేపనుందా ?
బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియర్లు ?పలువురిపై మళ్లీ పెరుగుతున్న ప్రచారంకాంగ్రెస్ ను బలహీనం చేయాలని కేసీఆర్ ప్లాన్కానీ ఇప్పటికే ఉన్న నేతలు సర్దుకుంటారా ?సీనియర్లు చేరితే బీఆర్ఎస్ లో అలజడి తప్పదా ?
KCR Politics :రాజకీయాల్లో తాము బలపడటం కన్నా ఒక్కో సారి ప్రత్యర్థిని బలహీనపర్చడం గొప్ప వ్యూహం అవుతుంది. కానీ ప్రత్యర్థిపై ఇలాంటి ప్లాన్ అమలు చేసే ముందుకు తమకు ఎఫెక్ట్ అవుతుందేమో పరిశీలించకపోతే... తమ వ్యూహం తమకే బూమరాంగ్ అవుతుంది. పార్టీల్లో చేరికల ద్వారా ఇతర పార్టీల్ని బలహీనం చేయాలని అన్ని పార్టీలు అనుకుంటాయి. కానీ ఆ చేరికలు తమ పార్టీలో కలకలం రేపుతాయని ఆలోచించరు. అలాంటి పరిస్థితి ఎన్నికలకు ముందు తీవ్రం అవుతుంది . ప్రస్తుతం బీఆర్ఎస్ గతంలో జరిగిన చేరికలతో ఇబ్బంది పడుతూంటే.. ప్రస్తుతం మరికొంత మంది సీనియర్లను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటారన్న చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ సీనియర్లు బీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం
టీ పీసీసీ చీఫ్ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత చాలా మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి నేరుగానే హైకమాండ్ పై కూడా విమర్శలు చేశారు. తర్వాత అందరూ సర్దుకున్నారు. ఇటీవల ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. కానీ అనూహ్యంగా సైలెంట్ గా ఉన్న నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ఉత్తమ్ కమార్ రెడ్డి, జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతారని దాదాపుగా అన్ని పార్టీల నేతలూ నమ్ముతున్నారు. దానికి ముహుర్తం దగ్గర పడిందని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ టిక్కెట్ ను ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉత్తమ్ , ఆయన భార్య రిజర్వ్ చేసుకున్నారని.. జంప్ కొట్టడానికి కారణాలు వెదుక్కుంటున్నారని రాజకీయవర్గాలు నమ్ముతున్నాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా అదే చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్లు బీఆర్ఎస్‌లో చేరితే బలమేనా ?
ఇక జగ్గారెడ్డి ఉత్తమ్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూంంటారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి ఆయనకు ఉక్కపోతగానే ఉంది. ఓ సారి తాను కాంగ్రెస్ పార్టీ సభ్యుడి కాదని కూడా చెప్పుకున్నారు. ఇక జగ్గారెడ్డిని చేర్చుకుని కొత్తగా తెచ్చుకునే బలం ఏమిటన్న వాదన ఉంది. అక్కడ చింతా ప్రభాకర్ కీలక నేతగా ఉన్నారు. పార్టీకోసం కష్టపడి పని చేసిన వారు ఉన్నారు. వారిని కాదని.. వారికి వ్యతిరేకంగా పని చేసిన జగ్గారెడ్డిని రాత్రికి రాత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా అనే వాదన వినిపిస్తోంది. మరికొంత మంది సీనియర్ నేతల్ని కూడా చేర్చుకుంటారని భావిస్తున్నారు. అయితే కేసీఆర్ వారి వల్ల అదనపు లాభం వస్తుందని ఆశించడం లేదని.. కాంగ్రెస్ పార్టీని నైతికంగా... బ లమైన దెబ్బకొట్టాలని అనుకుంటున్నారని అందుకే పార్టీలోకి తీసుకుంటున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్‌కు బలం లేక కాదు.. కాంగ్రెస్‌ను బలహీన పర్చాలనే !
కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద మైనస్ సీనియర్ నేతలేనని ఆ పార్టీ క్యాడర్ అనుకుంటూ ఉంటారు. క్షేత్ర స్థాయిలో.. నియోజకవర్గ స్థాయిలో కనీసం ప్రజల్లో పట్టు సాధించరు కానీ ముఖ్యమంత్రి పదవికి తామే పోటీ దారులం అన్నట్లుగా వ్యవహరిస్తూంటారని మండిపడుతూ ఉంటారు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ కు ఒక్క సీటు లేదు. ఇలాంటి సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని చేర్చుకుని ఆయనకు.. ఆయన భార్యకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల తెలంగాణ బీఆర్ఎస్ మొత్తం డిస్ట్రర్బ్ అవుతుందని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లను చేర్చుకుని కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు కానీ. వారి చేరిక వల్ల తమ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న ఆలోచన చేయడంలేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ను బలహీనం చేయడానికి అక్కడి నేతల్ని తీసుకుని ... తమ పార్టీని వర్గ పోరాటంలోకి నెట్టేసుకుంటున్నారన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వినిపిస్తోంది. అయితే కేసీఆర్ ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు కదా అనేది కీలకం.