BRS Meeting In AP : సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ బహిరంగసభ - "ఆంధ్రోళ్ల"కు ఏం చెబుతారు ?
ఏపీలో తన జాతీయ పార్టీ బహిరంగసభను సంక్రాంతి తర్వాత పెట్టాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అక్కడ కేసీఆర్ ఏం చెబుతారు ? ఏ పార్టీని టార్గెట్ చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
BRS Meeting In AP : టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తున్న కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలతో స్థానిక నాయకత్వాన్ని, ప్రజలను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ నుంచే తన ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పక్కా వ్యూహంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో కొత్తగా నాయకత్వాన్ని ఆకర్షించడం వేరు.. ఏపీలో తన కార్యకలాపాలను ప్రారంభించడం వేరు.. అందుకే ఏపీలో బీఆర్ఎస్ వ్యవహారంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
విజయవాడలో బహిరంగసభతో బీఆర్ఎస్ కిక్ స్టార్ట్ !?
తెలుగు రాష్ట్రాల నుంచి ఓ పార్టీ జాతీయ స్థాయిలో అడుగు పెడుతుందంటే.. ముందుగా సోదర రాష్ట్రంలో పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అక్కడ ఏ స్థాయిలో జనాలను, నాయకత్వాన్ని ఆకట్టుకుంటుందనే అనుమానాలు వ్యక్తవుతుంటాయి. అలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచే తన పొలిటికల్ అజెండాను అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ముందుగా అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా కాలంగా పిలుపులు వస్తున్నాయని కేసీఆర్ చెబుతున్నారు. చంద్రబాబునాయుడు 2018లో యాక్టివ్‌గా తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు తాము కూడా ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తర్వాత నేరుగా కాదు పరోక్షంగా వేలు పెడతామన్నారు. వైఎస్ఆర్‌సీపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు పేరు మార్చుకుని నేరుగా ఏపీలోకి అడుగు పెట్టే ఆలోచన చేస్తున్నారు.
కేసీఆర్‌తో కలిసి నడిచే నేతలెవరు ?
సంక్రాంతి తర్వాత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ సందర్భంగా తనకు ఉన్న పాత పరిచయాలతో కీలకమైన నాయకులను, న్యూట్రల్‌గా రాజకీయాలకు దూరంగా ఉన్న వారితో బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే దీనిపై చర్చలు నడుస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలతో మంతనాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ బహిరంగ సభ పెడితే బీఆర్ఎస్ విధి విధానాలను ప్రకటించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయి విషయాలు కాకుండా తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న వివాదాలను ఎలా పరిష్కరిస్తారో కూడా చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో ఏపీ రాజకీయ పార్టీలతో తన విధానాన్ని అనుబంధాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది.
టీడీపీతో వైరం.. వైఎస్ఆర్‌సీపీతో స్నేహం !
ప్రతిపక్షం టీడీపీ, కేసీఆర్‌కు అస్సలు పడదు. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టిన టీడీపీ కేసీఆర్‌ను ఓడించడానికి ట్రై చేసి విఫలమైంది. ఈ వైరం అక్కడితో అయిపోలేదు. తెలంగాణలో టీడీపీని పూర్తిగా ఫినిష్ చేశారు. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పేశారు. సమయం వచ్చినప్పుడల్లా టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. నరేంద్ర మోదీకి వంగి దండాలు పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేయాలని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సభ పెట్టి ఒక్క టీడీపీని విమర్శిస్తే కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ వైఎస్ఆర్‌సీపీతో టీఆర్ఎస్‌కు రాజకీయంగాసన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌తో వైసీపీ రాజకీయంగా కలసి నడుస్తుందో లేదో తెలియదు కానీ..ఆ సంబంధాలు మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ఎలా చూసినా... ఏపీలో బీఆర్ఎస్ టార్గెట్ టీడీపీనే అవుతుంది. కానీ అది రివర్స్‌లో సెంటిమెంట్ రగిలిస్తే గతంలో చంద్రబాబు.. కేసీఆర్‌కు సెంటిమెంట్ అస్త్రం ఇచ్చినట్లుగా ఈ సారి కేసీఆర్ చంద్రబాబుకు ఇస్తారు.