KCR Silent Again : ముంచుకొస్తున్న ఎన్నికలు - నింపాదిగా కేసీఆర్ ! ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వ్యూహాలేంటి ?
ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బహిరంగసభలు ఎప్పుడు ?ఏపీ, ఒడిషాల్లో అధ్యక్షుల్ని ఎంపిక చేసినా దూకుడేది ?కర్ణాటకలో ఎన్నికల ప్రారంభం కాని బీఆర్ఎస్ ప్రచారం ?కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఏమిటి ?
KCR Silent Again : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరోసారి సైలెంట్ అయ్యారు. గత వారం పది రోజుల నుంచి బీఆర్ఎస్ తరపున ఎలాంటి అప్ డేట్స్ ఉండటం లేదు. ఇతర రాష్ట్రాల నేతలూ కలవడంలేదు. కేసీఆర్ కూడా ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో బహిరంగసభల ప్రస్తావన కూడా పెద్దగా ఉండటం లేదు. ఫిబ్రవరిలో వేగంగా బడ్జెట్ సమావేశాలు ముగించిన తర్వాత ఒడిషాలో బహిరంగసభ పెట్టాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ అంశంపై స్పష్టత లేదు. కేసీఆర్ నెలాఖరులో ఢిల్లీకి వెళ్తారని గతంలో బీఆర్ఎస్ వర్గాలు చెప్పినా పర్యటనపై స్పష్టత లేకుండా పోయంది.
ఇతర రాష్ట్రాల్లో ఆఫీసులు, బహిరంగసభలపై నింపాదిగా కేసీఆర్ !
సీఎం కేసీఆర్ తన పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీ నుంచి జాతీయ రాజకీయాల్లో ఓ ఊపు తీసుకురావాలనుకున్నారు. అందుకే వేగంగా బడ్జెట్ ప్రక్రియను కూడా అసెంబ్లీలో పూర్తి చేశారు. అయితే కారణం ఏమిటో స్పష్టత లేదు కానీ.. సచివాలయ ప్రారంభోత్సవాన్ని బహిరంగసభను వాయిదా వేశారు. ఎన్నికల కోడ్ అడ్డంకి అనే కారణం చెప్పారు కానీ.. అది ఏ మాత్రం నమ్మశక్యంగా లేదన్న వాదన రాజకీయవర్గాల్లో ఉంది. ఓ ప్రత్యేకమైన కారణంతోనే సభను.. సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారని అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కేసీఆర్ ను కలిసే నేతల సంఖ్య కూడా తగ్గిపోయింది. పది రోజుల కిందట చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు వచ్చి కలిశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీతో కలవడం లేదా.. తన పార్టీని వీలీనం చేయడం చేస్తారని చెప్పుకున్నారు. ఈ వియంపైనా స్పష్టత లేదు.
ఏపీ, ఒడిషాల్లో బహిరంగసభపై రాని స్పష్టత!
ఇతర రాష్ట్రాల్లో బహిరంగసభలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీకి బీఆర్ఎస్ అధ్యక్షుడ్ని ప్రకటించారు. ఒడిషాకు కూడా అధ్యక్షుడ్ని ప్రకటించారు. ఆ రెండు చోట్ల కార్యాలయాలను ప్రారంభించి భారీ బహిరంగసభలను ఏర్పాటు చేయాలనుకున్నరు. కానీ ఇంకా ఆ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఏపీలో కానీ.. ఒడిషాలో కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్ని ఖరారు చేసుకోలేదు. ఒడిషాకు రావెల కిషోర్ ను పంపి.. పార్టీ కార్యాలయాలు ఇతర పనులను చక్క బెట్టాలని పంపారు కానీ. అవి కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మరో వైపు ఏపీలో పార్టీకి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను ప్రకటించారు కానీ.. అసలు ఏం చేయాలన్న దానిపై ఆయనకు క్లూ లేకుండా పోయింది. దాంతో ఆయన ఎక్కువగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పార్టీ కార్యాలయాలను ఎంపిక చేసుకుని బహిరంగసభను వీలైనంత త్వరగా పెడితే పార్టీలో చేరికలు ఉంటాయని కొంత మంది నేతలు అంచనా వేస్తున్నరు.
కర్ణాటకలో ఎన్నికల వాతావరణం ఉన్నా సైలెంట్‌గానే బీఆర్ఎస్ !
మరో వైపు బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో జేడీఎస్‌కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పట వరకూ బీఆర్ఎస్ నేతలు ఇంకా కర్ణాటకలో రంగంలోకి దిగలేదు. అక్కడ పూర్తి స్థాయి రాజకీయ వాతావరణం ఏర్పడింది. అన్ని పార్టీలు ప్రచారాలు ప్రారంభించేశాయి. కానీ బీఆర్ఎస్ మాత్రంఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఇంకా ఎలాంటి బహిరంగసభలూ ప్లాన్ చేయలేదు. రాజకీయంగా ఒక్క సారిగా మౌనం పాటించడం.. ఆ తర్వాత తన ప్లాన్లు అమలు చేయడం కేసీఆర్ ప్రణాళికల్లో ఓ భాగం. అయితే ఇప్పుడు ఇలా మౌనం పాటించడానికి కారణం ఏమిటన్నది మాత్రం స్పష్టత లేదు. బీజేపీ, మోదీపై పోరాటం విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి చివరికి వచ్ నెలల్లోనే ఉన్నాయి. అందుకే కేసీఆర్ వ్యూహాలపై బీఆర్ఎస్‌లో ఉత్కంఠ ఏర్పడింది.