KCR In Bihar : మాది మెయిన్ ఫ్రంట్ , బీజేపీ ముక్త భారత్ కోసం కలిసి పని చేస్తాం - పట్నాలో కేసీఆర్, నితీష్ ప్రకటన !
తమది ధర్డ్ ఫ్రంట్ కాదని.. మెయిన్ ఫ్రంటేనని కేసీఆర్ ప్రకటించారు. పట్నాలో నితీష్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలసి పనిచేస్తామన్నారు.
KCR In Bihar : ప్రధాని మోదీకి ఎలాంటి లక్ష్యం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. బీహార్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ .. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తో సమావేశమై రాజకీయాలపై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. నితీష్, నేను కలిసి విపక్షాలు ఏకం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ తీరు ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉందన్నారు. దేశంలో వచ్చేది థర్డ్ ఫ్రంట్ కాదు... మెయిన్ ఫ్రంట్ అని చెప్పారు. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్‌తో కూడా చర్చించామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడమే మోదీ పని !
ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని స్పష్టం చేశారు. డాలర్ తో పోలిస్తే రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుందని.. దేశ రాజధాని ఢిల్లీలోనే కరెంట్ కోతలున్నాయని.. మంచినీళ్లు లేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తుందన్న కేసీఆర్.. ధరలు పెరగడంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ఉన్న ప్రభుత్వాలను పడగొట్టడమే ప్రధాని మోడీ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మోడీ హయాంలో విదేశాలకు సారీ చెప్పాల్సిన పని ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ మత ద్వేషాలను సృష్టిస్తుందని విమర్శించారు.
బీజేపీ ముక్త్ భారత్ కోసం కలసి పని చేస్తాం !
బీజేపీ ముక్త్ భారత్ తోనే దేశాన్ని ముందుకు తీసుకుపోతామని తెలిపారు. విపక్షాలతో కలిసి బీజేపీ ముక్త్ తో భారత్ కు కృషి చేస్తామన్న కేసీఆర్.. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం.. చైనా నుంచే ఎక్కువ దిగుమతులు చేసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. ఎయిర్‌పోర్టులు, రైల్వేలు అన్నీ ప్రైవేటీకరిస్తున్నారని, ప్రతిష్టాత్మక సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయడం ఏంటని నిలదీశారు. మేకిన్ ఇండియా అనేది వట్టిమాటేనని, అన్ని వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతూనే ఉన్నాయని చెప్పారు. ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని, కానీ మరో పక్క అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.
బీజేపీని సాగనంపితేనే దేశంలో అభివృద్ధి
నితీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీస్తోందని బీజేపీపై మండిపడ్డారు. అలాంటి బీజేపీని సాగనంపితేనే భారతదేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నామని, ఆ పార్టీని వ్యతిరేకించే వారందరినీ కలుపుకొని పోతామని స్పష్టంచేశారు. మకు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల సమయంలో, విస్తృత చర్చల అనంతరం తీసుకునే నిర్ణయమని చెప్పారు.