Two States Projects War : అటు పోలవరం - ఇటు కాళేశ్వరం మునక ! తప్పెవరిది ?
గోదావరి వరదలకు కాళేశ్వరం, పోలవరం నీట మునగడంపై రాజకీయ దుమారం ప్రారంభమయింది. అధికార, ప్రతిపక్షాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
Two States Projects War : తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. దానికి తోడు ఎగువ నుంచి వరద కూడా కలిసింది. ఫలితంగా గోదావరి పరివాహకం అంతా మునిగితేలుతోంది. ఇలా మునిగిన వాటిలో ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున నీరు చేరడం ప్రభుత్వాల తప్పిదమేనని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అత్యంత కీలకమైన ప్రాజెక్టుల విషయంలోనూ ఇలా జరగడంతో సాధారణ ప్రజల్లోనూ చర్చకు కారణం అవుతోంది. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యాం నిర్మాణంలో ఆలస్యం జరగడంతో ప్రాజెక్ట్ నీటి ముంపులో చిక్కుకుంది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పంప్ హౌస్ కూడా నీటిలో మునిగింది. ప్రభుత్వాలపై విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తూండగా ...ప్రభుత్వాలు మాత్రం సమర్థించుకుంటున్నాయి.
నీట మునిగిన పోలవరం ప్రాజెక్ట్ సైట్ !
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ వివాదం ప్రారంభమయింది. దీనికి ప్రాజెక్ట్ ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను నీరు చుట్టుముట్టడమే. సాధారణంగా ప్రతి ప్రాజెక్టుకు ప్రధాన డ్యాం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మిస్తారు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలోకి నీరు రాకుండా ఆపడానికి. పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాఫర్ డ్యాం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ నిర్మాణం మెల్లగా సాగుతోంది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెంరింగ్‌లో కాంట్రాక్టర్‌ను మార్చడంతో ఒక్క సారిగా పనులు మందగించాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. నిజానికి ప్రతీ ఏటా జూలైలో వరదలు వస్తాయి. అందుకే జూలై కల్లా ఈ కాఫర్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఇప్పుడు నీరు ఎగదన్నింది.. ప్రాజెక్ట్ సైట్ ప్రాంతాన్ని ముంచెత్తింది. దీంతో అమర్చిన గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. అయితే ఇది కూడా ప్లస్ పాయింట్‌గా ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని టీడీపీ నేతలు విమర్శించారు.
జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం మునిగిందన్న టీడీపీ !
రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడకుంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేదని మునిగేది కాదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పనులు వేగంగా చే్యకపోవడం . ఎగువ కాఫర్ డ్యాంను వరదలు వచ్చేలోపు పూర్తి చేయకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమ చెబుతున్నారు. గత మూడేళ్లలో కేవలం రెండు అంటే రెండు శాతం పనులు పూర్తయ్యాయని ఆయన చెబుుతున్నారు.
A CATASTROPHE NAMED “YSRCP” has ruined Polavaram National project due to negligence in completion of crucial structures, Diaphragm wall & Cofferdam which stands damaged today, setting back the project for indefinite time. @ysjagan is liable to answer The Nation. pic.twitter.com/K9GnZ3CTRM
— Devineni Uma (@DevineniUma) July 15, 2022
గత ప్రభుత్వ తప్పుల వల్లే ఈ దుస్థితి అని వైఎస్ఆర్‌సీపీ విమర్శ !
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే పోలవరం మునిగిందని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం విమర్శిస్తోంది. టీడీపీ సర్కారు అవగాహన రాహిత్యం వల్ల గోదావరి వరదను మళ్లించే స్పిల్ వేను పూర్తి చేయకుండానే ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్ నిర్మించేసిందని చెబుతున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో కుడి, ఎడమ వైపున ఖాళీ ప్రదేశాలను వదిలేశారని.. 2019, 2020లో ఈ ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద ప్రవహించడంతో ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో రెండు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయని ప్రభుత్వం చెబుతోంది. దిగువ కాఫర్ డ్యామ్ 218 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకూ కోతకు గురైందని వాదిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఏర్పడిన సమస్యలను ఎదుర్కొంటూ ప్రస్తుత ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తోందని అంటున్నారు. వరద తగ్గగానే ఆగస్టులో మళ్లీ పనులు ప్రారంభిస్తామని జలవనరుల మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు.
పోలవరం తరహాలోనే మునిగిన తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ !
కాళేశ్వరం భారీ ప్రాజెక్టు గోదావరి వరద ఉధృతికి అల్లకల్లోలమైంది. నీటిని లిఫ్ట్ చేసే కన్నెపల్లి, దానికి పైనున్న అన్నారం పంపుహౌస్‌లు పూర్తిగా మునిగిపోయాయి. రెండు పంపుహౌసుల్లో కలిపి 29 బాహుబలి మోటార్లు, వాటిని ఆపరేట్ చేయాల్సిన ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్‌మెంట్, కంట్రోల్ ప్యానళ్లు, కంప్యూటర్లు, రెండు భారీ ఎయిర్ కండిషన్ సిస్టమ్‌లు, రెండు స్కాడా సిస్టమ్‌లు, సబ్ స్టేషన్లు ఇట్లా అన్నీ వరదలో కనిపించకుండాపోయాయి. దీంతో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇందుకు డిజైన్, మెయింటనెన్స్ లోపాలే ప్రధాన కారణమని రాజకీయ విమర్శలు ప్రారంభమయ్యాయి. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌లకు ప్రమాదం పొంచి ఉందని డిజైన్స్ విభాగం నిపుణులు పలుమార్లు హెచ్చరించారని కాంగ్రెస్ , బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అన్నారం పంపుహౌస్‌ను గోదావరి నది ప్రవహించే లెవల్ కన్నా దిగువన నిర్మించడంపై డిజైన్ ఎక్స్‌పర్ట్‌లు పలు సందేహాలు వ్యక్తం చేశారు. అయినా నిర్మాణాలు కొనసాగాయి.
కేసీఆర్ అవినీతి వల్లే మునిగిపోయిందన్న రేవంత్ !
కాళేశ్వరం మునిగిపోవడానికి కేసీఆర్ అవినీతి, డిజైన్ల లోపం, నిర్లక్ష్యమే కారణమని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. అనుభవం లేని ప్రతిమ లాంటి కంపెనీలకు వేలకోట్ల రూపాయల పనులు అప్పజెప్పడంతో... ఎలా పడితే అలా నిర్మించేశారని ఆరోపించారు. ఓ మాదిరిగా వర్షాలొస్తేనే కాళేశ్వరం కుప్పకూలిపోయిందన్న రేవంత్.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బలి అయిపోయిందన్నారు. మూడో టీఎంసీ సంగతి దేవుడెరుగు.. ఇంకో మూడు నాలుగేళ్లు కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. మొత్తం లిఫ్టులు, పంపులు ఎక్కడికక్కడ నీళ్లలో మునిగి జలమయమైపోయాయన్నారు. రూ.38వేల కోట్లతో చేపట్టదల్చిన ప్రాజెక్టును రీడిజైనింగుల పేరు మీద కేసీఆర్ రూ.లక్షనలభై వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఇందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనీ.. మరో లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టదలిచారన్నారు. ఇంతా చేస్తే.. కాళేశ్వరం ఇవాళ నిండుగ నీట మునిగిపోయిందని దీనంతటికి టీఆర్ఎస్ అవినీతే కారణమంటున్నారు రేవంత్. అపర భగీరథుడు, తెలంగాణలో నదులకు నడక నేర్పినోడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ నిపుణుడిని తానేనని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని బండి సంజయ్ సెటైర్ వేశారు. తన నిర్వాకంవల్ల వేల కోట్ల రూపాయలు వృధా కావడమే కాకుండా మంథని, ధర్మపురి నియోజకవర్గాలు పూర్తిగా నీటమునిగిపోయాయన్నారు.
రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం
— Revanth Reddy (@revanth_anumula) July 14, 2022
(అన్నారం పంప్ హౌస్)
నీళ్లలో నిండా మునిగింది.
తెలంగాణ ప్రజల కష్టార్జితం
కేసీఆర్ అవినీతికి బలైంది.@TelanganaCMO pic.twitter.com/i7io91eq2T
కనీవినీ ఎరుగనంతగా వచ్చిన వరదే కారణమంటున్న ప్రభుత్వం !
రెండు పంపుహౌస్‌లు నీట మునిగిన మాట నిజమేననిఅ అయితే కనీ వినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదే కారణం అని ప్రభుత్వం అంటోంది. మోటార్లు.. పంప్ హౌస్‌లు ఎక్కడైనా నదీ ఒడ్డునే కడతారని టీఆర్ఎస్ వాదిస్తోంది. అయితే నీరు తగ్గిపోయిన తర్వాత రిపేర్లతో అంతా బాగవుతుందని..విపక్షాలు చెబుతున్నంతగా ఏమీ ప్రమాదం లేదని వాదిస్తున్నారు. రెండు పంపుహౌస్‌లు మునగడానికి దారి తీసిన పరిస్థితులపైనా సమగ్రంగా స్టడీ చేస్తామని చెబుతున్నారు.
మొత్తంగా గోదావరి వరద వందేళ్లలో లేనంత వచ్చిందని ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి. అందుకే పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టులు మునిగాయని వాదిస్తున్నారు. ఎవరి వాదన నిజమైనా ప్రాజెక్టులకు మాత్రం తీవ్ర నష్టం జరిగింది.