BJP Janasena : బీజేపీ ఉద్యమాల్లో జనసేన - వారాహి యాత్రలో బీజేపీ ఎందుకు కనిపించడం లేదు ?
బీజేపీ ధర్నాల్లో జనసేన కార్యకర్తలు, పవన్ వారాహి యాత్రలో బీజేపీ ఎందుకు పాల్గొనడం లేదు ?
BJP Janasena : భారతీయ జనత పార్టీ పంచాయతీ నిధులను దారి మళ్లించినందుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసింది. ఈ ధర్నాల్లో అనూహ్యంగా జనసేన పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ఒంగోలు, తిరుపతి వంటి చోట్ల జనసేన నేతలు... ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల తరవాత రెండు పార్టీల మధ్య కనిపించిని గ్యాప్ వచ్చింది. ఇప్పటి వరకూ ఎప్పుడూ... బీజేపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో జనసేన... జనసేన పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో బీజేపీ పాలు పంచుకోలేదు. పొత్తులో ఉన్నామంటారు కానీ కలసి పని చేయలేదు. కానీ ఇప్పుడు జనసేనాధినేత మనసులో మార్పు వచ్చింది.
పురందేశ్వరి నియామకం తర్వాత జనసేనలో నమ్మకం పెరిగిందా ?
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నప్పుడు ఆయన వైసీపీకి అనుకూలంగా ఉంటారన్న ప్రచారం జరిగేది. అందుకే పవన్ కల్యాణ్ చాలా సార్లు తనకు బీజేపీ రాష్ట్ర నేతలతో అసలు సంబంధాలు లేవని కేంద్ర నేతలతోనే పరిచయం అని ప్రకటించారు. పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పవన్ తో ఫోన్ లో మాట్లాడతానని.. కలిసి పోరాటం చేస్తామని ఒకటి రెండు సార్లు ప్రకటించారు. ఇప్పుడు జనసేన నేతలు బీజేపీ పోరాటాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇంత కాలం లేని సహకారం ఇప్పుడే ప్రారంభం కావడంతో అంతర్గతంగా ఏదో జరిగే ఉంటుందని పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. పురందేశ్వరి వైసీపీపై పోరాటం విషయంలో రాజీ పడరని భావించడంతోనే జనసేన క్యాడర్ కు బీజేపీ ధర్నాల్లో పాల్గొనే అనుమతి ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. కారణం ఏదైనా ఇప్పటికి బీజేపీ, జనసేన ఉమ్మడి ఉద్యమాలు ప్రారంభించినట్లయింది.
పవన్ - పురందేశ్వరి చర్చలు జరుపుతారా ?
బీజేపీ , జనసేన రాష్ట్ర సమస్యలపై ఇక నుంచి ఉమ్మడిగా పోరాడే అవకాశం ఉందని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పురందేశ్వరి చేసిన ఆరోపణలకు సంబంధించి.. వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు .. అక్రమ అప్పులు.. ఆర్థిక లావాదేవీలు.. అక్రమ మద్యం వ్యాపారాలపై తీవ్ర స్థాయిలో పోరాటాలు చేయాలనుకుంటున్నారు. అక్రమాలకు ఆధారాలను కేంద్రానికి ఇచ్చి పోరాటం ద్వారా చర్యలు తీసుకునేలా చేస్తే ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో బీజపీ, జనసేన ఉమ్మడి కార్యాచారణ ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తో సమావేశం అవుతానని పురందేశ్వరి గతంలో ప్రకటించారు. అయితే పవన్ వారాహియాత్రలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర బాధ్యతలు కొత్తగా చేపట్టినందున.. పురందేశ్వరి కూడా బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత పొత్తులు.. ఎన్నికల్లో కలసి పోటీ చేయడంపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
పవన్ వారాహి యాత్రలో కనిపించని బీజేపీ శ్రేణులు !
కారణం ఏదైననప్పటికీ బీజేపీ ధర్నాలో జనసేన పార్టీ నేతలు కనిపించారు. కానీ ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తూంటే ఒక్క బీజేపీ నేత కూజా సంఘిభావం చెప్పలేదు. బీజేపీ క్యాడర్ వారాహియాత్రలో కనిపిచంచలేదు. పరస్పర సహకారం ఉండాలి కదా అనేది జనసేన నేతల వాదన. మొదటి నుంచి జనసేన ప్రజాదరణను.. బీజేపీ తన ప్రజాదరణకు చెప్పుకునేందుకు ప్రయత్నించడం వల్లనే.. రెండు పార్టీల మధ్య సమస్యలు వచ్చాయని .. బీజేపీ ఇంకా తన తీరు మార్చుకకోపోతే కష్టమన్న అభిప్రాయంతో ఉంది. ఓట్లు చీలనివ్వకూడనది పట్టుదలగా ఉన్న పవన్.. బీజేపీని కూడా తనతో పాటు కలుపుకుని వెళ్లాలనుకుంటున్నారు. కానీ బీజేపీనే.. ఒక్క వైపు మాత్రమే చూస్తోందన్న అభిప్రాయాలు ఇలాంటి పరిమామాల వల్లే చోటు చేసుకుంటున్నాయని జనసేన వర్గాలు అంటున్నాయి.