YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
Andhra : కార్యకర్తలకు ఇక ప్రాధాన్యత ఇస్తామని జగన్ చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని మర్చిపోయి వాలంటీర్లకు ప్రాధాన్యత ఇచ్చారన్న అసంతృప్తి వైసీపీ క్యాడర్ లో ఉంది.
YSRCP Jagan: వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాల్లో ఒకటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి అధికారంలోకి వచ్చే వరకూ పన్నెండేళ్ల పాటు తనతోనే ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డ వారందర్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మర్చిపోయారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే రెండు రోజుల కిందట నెల్లూరు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఇక కార్యకర్తలను గొప్పగా చూస్తామని .. ఈ విషయంలో తాము నేర్చుకోవాల్సింది ఉందని అంగీకరించారు.
అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లకు ప్రాధాన్యం
2014-19 మధ్య కాలంలో పార్టీకి సైనికులలా మారీ సార్వత్రిక ఎన్నికల యుద్ధాన్ని దగ్గరుండి గెలిపించిన కార్యకర్తలు.. జగన్ సీఎం అవ్వగానే కనిపించకుండా పోయారు. జగన్ ఫోకస్ అంతా సచివాలయ వ్యవస్థ మీదే ఉంది తప్ప.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త మీద లేకుండా పోయింది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కాంట్రాక్టర్లు ఇలా అందరూ... నాడు-నేడు పనుల్లో భారీగా డబ్బులు పెట్టి.. బిల్లుల కోసం తిరిగితిరిగి చివరికి పార్టీ మిమ్మల్ని వదిలేసింది అనే స్థాయిని వారిని తీసుకువచ్చింది వైసీపీ. తీరా ఎన్నికల సమయానికి నియోజకవర్గ ఇన్చార్జ్ లను మార్చి.. భారీ తప్పటడుగు వేసింది. ఇక్కడ కూడా నష్టపోయింది కార్యకర్తే. ఎందుకంటే కొత్తగా వచ్చిన సమన్వయకర్తకు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త ఎవరో తెలియదు. సమన్వయకర్త కార్యాలయం చుట్టూ తిరిగిన వారే తమ కార్యకర్తలను భావించే రాజకీయ నాయకులున్న జనరేషన్ ఇది. నియోజకవర్గానికి సమన్వయకర్తలు వస్తుంటారు పోతుంటారు.. కానీ, కార్యకర్త లోకల్ అనే విషయాన్ని అధిష్టానం గుర్తించలేదు. ఫలితంగా కార్యకర్తలంతా చెల్లా చెదురైపోయారు.
కార్యకర్తల ఆవేదనను పట్టించుకోలేదు !
ఇటీవలి కాలంలో కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా కేసుల్లో వారి ఆవేదనను అర్ధం చేసుకునే వారేరి.? వారికి భరోసా ఇచ్చే ఇన్చార్జ్లు ఏరి..? వారిని బయటకు తీసుకువచ్చే లాయర్లేరి..? ఎప్పుడు అరెస్ట్ చేస్తారో..? ఏ స్టేషన్ కు తీసుకువెళ్తారో..? ఎన్ని రోజులు తిప్పుతారో..? ఎప్పుడు కోర్టుకు తీసుకువెళ్తారో..? అనే భయంతో కుటుంబాలను, ఊర్లను వదిలి పారిపోవాల్సిన పరిస్థితి. ఆ కార్యకర్త దొరక్కపోతే వారి కుటుంబ సభ్యులను స్టేషన్ కు తీసుకువెళ్తున్న దుస్థితి. అందుకే తాను న్యాయపరంగా సాయంగా ఉంటానని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక జైల్లో పెట్టిన అధికారులతో సెల్యూట్ కొట్టిస్తానని అంటున్నారు.
ఇప్పుడు కార్యకర్తలు నమ్ముతారా ?
అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడు కూడా పట్టించుకోలేదన్న అసంతృప్తితో ఉన్న క్యాడర్ ను జగన్ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సంక్షేమం కోసం ఎదో చేస్తామని చెబుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరవాత ఏదో చేస్తామని చెప్పడం కన్నా.. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలన్న డిమాండ్ ను కొంత మంది వినిపిస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తల్ని కాపాడుకోవాడనికి కొన్ని చర్యలు తీసుకుంటే మళ్లీ క్యాడర్ యాక్టివ్ అవుతుందని లేకపోతే స్థానిక ఎన్నికల నాటికి నిర్వీర్యం అయిపోతుందని పార్టీ సానుభూతి పరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!