అన్నింటికీ జగనే... వైసీపీ అసలు సమస్య అదే...!
అన్నింటికీ జగనే... వైసీపీ అసలు సమస్య అదే...!
Problem has become that everything is Jagan in YCP: ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడే సర్వం. అది సహజమే. కానీ తనకూ ఒక సైన్యం కావాలి. కేవలం ప్రత్యర్థుల మీద మాటల దాడి చేయడానికే కాదు సమయం వచ్చినప్పుడు తమ పార్టీని సమర్థవంతంగా డిఫెండ్ చేసుకోగలిగిన అనుభవజ్ఞులు కూడా ఏ పార్టీ కీ అయినా చాలా అవసరం. సరిగ్గా ఈ విషయంలోనే వైసిపి వెనకంజలో ఉంది అన్న గుసగుసలు సొంత పార్టీ నుండే వినపడుతున్నాయి.
జగన్ పై వస్తున్న ఆరోపణలకు జగనే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి !
సాధారణంగా ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ అధినేత పై విమర్శలు వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన కొంతమంది ట్రబుల్ షూటర్లు తమదైన వాగ్దాటి, విశ్లేషణ లతో వాటిని తిప్పి కొట్టడమో లేక అవతల పార్టీ వారిని నోరు మెదపకుండా చేయడమో చేస్తూ ఉంటారు. దీనివల్ల అధినేతపై ప్రెజర్ పడకుండా ఉంటుంది. అధికార ప్రతిధులు పార్టీ స్టాండ్ ని మీడియా కు చెబుతూ ఉంటారు గానీ క్లిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఇలాంటి ట్రబుల్ షూటర్లు అవసరం ఏ పార్టీకైనా చాలా ముఖ్యం. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య ఈ పాత్రను సమర్థవంతంగా పోషించేవారు. అలాగే చంద్రబాబుకు అండగా యనమల రామకృష్ణుడు, కెసిఆర్ కు హరీష్ రావు లాంటి వాళ్లు ప్రత్యర్థుల నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శలకు లెక్కలతో సహా కౌంటర్లు ఇస్తూ చాలా ముఖ్యమైన పాత్రనే పోషించే వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు సరే గానీ విపక్షంలో ఉన్నప్పుడే ఇలాంటి వాళ్ళ అవసరం అధినేతలకు చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం వైసీపీ ఈ ఒక్క విషయంలో మాత్రం వెనక పడుతోంది.
ట్రబుల్ షూటర్లు లేని వైసీపీ !
2024 ఎన్నికల్లో వైసిపి ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నుండి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. విద్యుత్ కొనుగోలు, రివర్స్ టెండరింగ్ వివరాలు ఇలా చాలా అంశాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అనేక విధాలుగా విమర్శిస్తూ ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇలాంటి వాటికి సమాధానంగా డైరెక్ట్ గా జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి సమాధానాలు చెప్పుకునే పరిస్థితి వైసేపే లో ఏర్పడింది. ఒక్కసారిగా 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీలో ఆత్మస్థైర్యం దెబ్బతిండడం సహజమే కానీ ఇలాంటి సమయంలో అధినేతకు అండగా ఉండాల్సిన ట్రబుల్ షూటర్ మాత్రం పార్టీలో మిస్ అయ్యారు. వైసిపి లో యాక్టివ్ గా ఉన్న పేర్ని నాని, గుడివాడ అమర్ లాంటి వాళ్ళు ప్రత్యర్థులపై కౌంటర్లు వేయడానికి సరిపోతున్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను వివరించే ప్రయత్నం చేయడం లేదు. సీనియర్ నేత బొత్స కు అ సత్తా ఉన్నా శాసనమండలి లో తనపై విరుచుకుపడుతున్న అధికార పార్టీ నేతలను ఎదుర్కోవడానికే సమయం సరిపోతోంది.
బుగ్గనను ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు ?
మిగిలిన వారిలో మాజీ ఆర్థిక మంత్రి, జగన్ సన్నిహితుడు అయిన బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రమే ఇలాంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగల సమర్థత ఉందనేది వైసిపి వ్యవహారాలను పరిశీలించే ఎనలిస్టుల కథనం. కానీ వైసీపీ లాంటి విప్లమాత్మకమైన నిర్ణయాలు తీసుకునే పార్టీకి అంతే స్థాయిలో తమ నిర్ణయాలను సమర్థించే డబుల్ షూటర్లు అవసరం చాలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈరోజు పార్టీలో ట్రబుల్ షూటర్లు లేకుండా పోయారు అనేది ఒక అంచనా. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి లాంటి సన్నిహితులు జగన్ కు ఉన్నా వారే అనేక వివాదాలు ఎదుర్కొంటున్నారు. దానితో ప్రస్తుతం తనపై వచ్చే ఆరోపణలకు తానే వివరణలు ఇవ్వాల్సి వస్తోంది. దానికి తోడు సెలెక్టివ్ మీడియాని మాత్రమే ఆహ్వానించడం, వారి నుండి ప్రశ్నలను తీసుకోలేకపోవడంలాంటివి కూడా మైనస్ గా మారుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్టీలో దూకుడు స్వభావం కన్నా గణాంకాలు, విధానాపరమైన అవగాహన, మీడియా సెన్స్ ఉన్న ట్రబుల్ షూటర్ల అవసరాన్ని గుర్తుపెట్టుకుని అలాంటివారిని ప్రోత్సహించాల్సిన విషయాన్ని వైసిపి గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.