Jagan Kuppam Tour : 22న కుప్పం టూర్‌కు జగన్ - గ్రాండ్ సక్సెస్‌కు వైఎస్ఆర్‌సీపీ నేతల ఏర్పాట్లు !
కుప్పం పర్యటనకు జగన్ వెళ్తున్నారు. భారీగా జనసమీకరణ చేసి బలప్రదర్శన చేయాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు నిర్ణయించుకున్నారు.
Jagan Kuppam Tour : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. కుప్పంలో గెలవాలని.. చంద్రబాబును ఓడించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల నియోజకవర్గాల వారీ సమీక్షలను కూడా కుప్పంతోనే ప్రారంభించి పార్టీ నాయకలకు భరోసా ఇచ్చారు. అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరతే పోటీ చేస్తారని .. అందులో సందేహం లేదని.. పులివెందులలానే కుప్పంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడే కుప్పానికి రూ. 66 కోట్ల విలువైన అభివృద్ధి పనుల మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ పనులకు శంకుస్థాపనలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుప్పం టూర్ ఖరారయింది.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న సీఎం జగన్
ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కుప్పం పర్యటనలో భాగంగా మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అప్పుడే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల కోసం సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్తూండటం ఇదే ప్రథమం . అందుకే వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణ చేసి... ఆదరణ తిరుగులేని విధంగా ఉందని చూపించాలనుకుంటున్నారు.
భారీ జన సమీకరణ చేసి బలప్రదర్శన చేయనున్న వైఎస్ఆర్‌సీపీ
వాస్తవంగా అక్కడ నియోజకవర్గ ఇంచార్జ్ భరతే అయినప్పటికీ అన్ని వ్యవహారాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కసుసన్నల్లో జరుగుతూ ఉంటాయి. ఆయనే వైఎస్ఆర్‌సీపీ వ్యూహాలను ఖరారు చేస్తూంటారు. ఈ సారి జగన్ పర్యటనలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి పెద్దిరెడ్డి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గాన్ని జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తెలుసు కాబట్టి జగన్ ఆలోచనలకు అనుగుణంగా పెద్దిరెడ్డి వ్యూహాలు ఖరారు చేస్తున్నారు.
కుప్పం టీడీపీ ముఖ్య నాయకులందరూ జైల్లోనే !
ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించారు. కుప్పం పర్యటనలో భాగంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు జరిగాయి. పలువురు టీడీపీ నేతలు అరెస్ట్ చేశారు.వారికి ఇప్పటికీ బెయిల్ లభించలేదు. కుప్పం నియోజకవర్గానికి చెందిన దాదాపుగా అరవై మంది టీడీపీ ముఖ్య నేతలు జైల్లోనే ఉన్నారు. సీఎం జగన్ పర్యటన జరిగేలోపు విడుదలవుతారో లేదో స్పష్టత లేదు. విడుదలవకపోయినా జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయరని అలాంటి సంప్రదాయం టీడీపీ పాటించని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నయి. సీఎం వైఎస్ జగన్ కుప్పంపై ఫోకస్ పెట్టడం.. ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో టీడీపీ జెండా మళ్లీ ఎగురేయాల్సిందేనని చంద్రబాబు పట్టుదలగా ఉన్న సమయంలో ఆ నియోజకవర్గ రాజకీయం హాట్ టాపిక్‌గా మారుతోంది.