AP Assembly : పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఏపీ అసెంబ్లీ - వ్యూహాత్మకమేనా ?
ఏపీలోనూ డిసెంబర్ ఎన్నికలకు రంగం సిద్ధమయిందా ? సీఎం జగన్ విదేశీ పర్యటన తర్వాత ఎలక్షన్ సీజనేనా ?
AP Assembly : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలుు మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలల్లోపు ఓ సారి అసెంబ్లీని ఖచ్చితంగా సమావేశపర్చాల్సి ఉంటంది. ఈ నిబంధన అమలు చేయడానికి అయినా అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంటుంది. అదే సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంతో డిసెంబర్ ఎన్నికల కోసం ఏపీ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా రెడీ అవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రెండో తేదీ నుంచి జగన్ విదేశీ పర్యటన
వినాయకచవిత తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను 10 రోజుల నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని భావింస్తోంది అధికార పార్టీ. సెప్టెంబరు రెండోవారంలో సమావేశాలను నిర్వహించాలని ముందుగా భావించారు. కానీ సీఎం జగన్ మొదటి వారంలో లండన్ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో సమావేశాలు సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు నిర్వహించాలని అధికార పార్టీ భావిస్తోంది. సెప్టెంబర్ 15న సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని కొంత కాలంగా ప్రచారం
రాష్ట్రంలో గడువు కన్నా ముందు ఎన్నికలు రావాలంటే అది ముఖ్యమంత్రి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పోటీ పడాలంటే ముఖ్యమంత్రి జగన్ ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. ముందుస్తుకు కావాలని వెళ్లాలి. జూలై 6న ముఖ్యమంత్రి జగన్‌మహన రెడ్డి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలతో సమావేశం అయ్యారు. ఇద్దరూ కూడా ముఖ్యమంత్రిని ముందస్తుకు వెళ్లమని చెప్పారని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. కేంద్రం వెళ్తే తాము కూడా ముందస్తుకు వెళ్తామని సీఎం జగన్ అంగీకరించారని అంటున్నారు. అందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు.
ఆరు నెలల ముందుగానే ఆర్వోలను నియమిచిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. కానీ ఏపీలోని అన్ని నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. నవంబర్ -డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలోనే వారం రోజుల క్రితం రిటర్నింగ్ అధికారులను నియమించారు. కానీ ఎప్పుడో మార్చి, ఏప్రిల్‌లో జరిగే ఎన్నికలకు అప్పుడే ఆర్వోలను ఎందుకు నియమించారనేది చాలా మందికి వస్తున్న సందేహం . ఇది ఏపీలోని ముందస్తు ఎన్నికలకు సూచిక అని కొందరు.. అలాంటిదేం లేదని ఇవన్నీ విధుల్లో భాగమేనని కొందరు చెప్పుకుంటున్నారు. ముందస్తు నిజమైనా కాకపోయినా ఎన్నికల కమిషన్ నిర్ణయం అన్నది రాజకీయ అలజడినైతే సృష్టించింది.
ఏం జరగబోతోంది..?
అసెంబ్లీని సీఎం జగన్ రద్దు చేస్తేనే అధికారికంగా ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభిస్తుంది. కానీ ఓటర్ల జాబితాపై అనుమానాలు.. ఫిర్యాదులు వెల్లువెత్తున్న సమయంలో నెల రోజుల్లో ఓటర్ల జాబితాను తప్పుల్లేకుండా మార్చేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టారు. అంటే ఓటర్ల జాబితా కూడా రెడీ అయినట్లే. రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించారు. అంటే కేంద్రం అనుకుటే.. ఏపీలోనూ జగన్ రెడీ అయినట్లేనని అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.