BRS Entry in AP : ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లేనా ? స్టీల్ ప్లాంట్ వివాదం ఉపయోగపడిందా ?
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లేనా ?స్టీల్ ప్లాంట్ వివాదం ఉపయోగపడిందా ?విజయోత్సవాల పేరుతో విశాఖలో సభ పెట్టనున్నారా?కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?
BRS Entry in AP : ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టాలనుకుంటున్న భారత్ రాష్ట్ర సమితి విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం ఓ రోడ్ మ్యాప్ ను ఇచ్చినట్లయింది. ఇలా స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేయడం.. అలా కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటించడం ఆ పార్టీకి ఊహించని విధంగా ఉపయోగపడింది. ఇలాంటి చాన్స్ దొరికితే చాలు ఎలా అల్లుకుపోవాలో బీఆర్ఎస్ నేతలకు బాగా తెలుసు. అందుకే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి అలా ప్రకటన చేయగానే.. ఇలా బీఆర్ఎస్ నేతలు విజయోత్సవాల గురించి మాట్లాడుతున్నారు. అందుకే బీఆర్ఎస్‌కు ఏపీలో ఎంట్రీకి మంచి అవకాశం దొరికిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బీఆర్ఎస్‌కు ఏపీ ఇతర రాష్ట్రాల కన్నా ప్రత్యేకం !
టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత .. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఆలోచనలకు పదును పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో అలా వెళ్లి పార్టీని విస్తరించుకోవచ్చు. కానీ ఏపీలో మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకంటే .. ఉమ్మడి ఏపీ విభజనకు కారణం బీఆర్ఎస్. విభజన సమయంలో.. ఉద్యమం సమయంలో ఏపీ విషయంలో చాలా వ్యతిరేక ప్రకటలను బీఆర్ఎస్ నాయకత్వం చేసింది. ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేలా చేసి.. తాము కూడా ఏపీ అభివృద్ధికి ప్రయత్నిస్తామని నమ్మించగలగాలి. అందు కోసం.. ముందుగా ఓ ప్రయత్నం జరగాలి. అలాంటి ప్రయత్నం స్టీల్ ప్లాంట్ వల్ల జరిగింది. అది అనూహ్యమైన సక్సెస్ అయింది. ఇప్పుడు ఏపీ కోసం బీఆర్ఎస్ ఎలా పని చేస్తుందో వారు వివరించగలిగారు. ఇప్పుడు ఏపీ ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లగమని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.
బీఆర్ఎస్ లో క్రమంగా పెరుగుతున్న చేరికలు !
బీఆర్ఎస్ ఏపీ చీఫ్ గా తోట చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన మూడు ప్రధాన పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయారు. పెద్దగా ఫాలోయింగ్ ఉన్న నేత కాదు. గొప్ప వాగ్దాటి కూడా లేదు. కానీ పార్టీకి ఓ కార్యవర్గం అంటూ ఏర్పడింది. ఇదే బేస్‌గా చేరికలు పెరుగుతున్నాయి. మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ కూడా బీఆర్ఎస్ పై ఆసక్తితో ఉన్నారని భావిస్తున్నారు. ఆయన ఇటీవలి కాలంలో స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. ఆయన కూడా చేరితే బీఆర్ఎస్ టార్గెట్ గా పెట్టుకున్న సామాజికవర్గం ఓట్లతో గట్టి పునాది వేసుకోవాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ ముందు అనేక సవాళ్లు !
మహారాష్ట్రలో కేసీఆర్ రెండు సభలు పెట్టారు. అక్కడ స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. అలా నేరుగా ఏపీలో అడుగుపెట్టలేని పరిస్థితుల్ని క్రమంగా మార్చుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ నేరుగా బీఆర్ఎస్ ఏపీలో సభలు పెట్టలేదు. కేసీఆర్, కేటీఆర్ వంటి అగ్రనేతలు పర్యటించలేదు. శుభకార్యాలు.. ఇతర కార్యక్రమాలకు వచ్చి ఉంటారు కానీ.. రాజకీయ కార్యక్రమాలకు రాలేదు. తెలంగాణలో ఇతర పార్టీల ఉనికిని ప్రశ్నించే బీఆర్ఎస్ నేతలు.. ఏపీలోకి రావడాన్ని ఆ ఇతర పార్టీలు కూడా ప్రశ్నిస్తాయి. ప్రతిఘటన కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని కేసీఆర్ ఏపీలో పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.