Munugode Komatireddy Factor : మునుగోడు బాధ్యత కోమటిరెడ్డికేనా ? గెలిపించుకు వస్తారా ?
మునుగోడు బాధ్యత కోమటిరెడ్డికి అప్పగించేందుకు హైకమాండ్ సిద్ధంగా ఉందా? తమ్ముడిని ఓడించి కాంగ్రెస్‌లో తానే రేవంత్ కన్నా పెద్దలీడర్నని వెంకటరెడ్డి నిరూపించుకుంటారా?
Munugode Komatireddy Factor : మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పరిమామాలకు కారణం అవుతోంది. ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా ఆ పార్టీలో ఓ రకమైన అలజడి ఖాయంగా కనిపిస్తోంది. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు. అసలు ఉపఎన్నిక వచ్చిందే సోదరుడి రాజీనామా వల్ల. ఇద్దరూ కలిసే ఈ రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియాంకా గాంధీని కలిశారు. కలిసి పని చేయమని చెప్పారని.. తాను పార్టీలోనే ఉంటానని కోమటిరెడ్డి చెబుతున్నారు.
మునుగోడు ఉపఎన్నిక బాధ్యత తీసుకోవడానికి కోమటిరెడ్డి రెడీనా !?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ జిల్లా కంచుకోట. రేవంత్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో టాప్ ఫైవ్ లీడర్ల లెక్క తీస్తే టాప్ త్రీలో ఖచ్చితంగా నల్లగొండ జిల్లాకు చెందిన వారే ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి నేతలు జిల్లా రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు. వీరిని కాదని పీసీసీ చీఫ్ స్థానంలో ఉన్నప్పటికీ ఇతర నేతలు జిల్లాలో అడుగు పెట్టలేరు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేరు. రేవంత్ రెడ్డికి కూడా ఈ పరిస్థితి బోధపడింది. రాహుల్ గాంధీ బహిరంగసభకు జన సమీకరణ సన్నాహా సమావేశాన్ని నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేస్తే చాలా మంది సీనియర్లు హాజరు కాలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకించారు కూడా. తమ జిల్లా గురించి తాము చూసుకుంటామని వారు చెబుతున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నిక భిన్నం. స్వయంగా ఆయన సోదరుడు అక్కడ పోటీ చేయబోతున్నారు. మరి మునుగోడు బాధ్యతను తీసుకుంటారా అన్నది సందేహంగా మారింది. ప్రియాంకా గాంధీ సూచించినా ఈ అంశంపై స్పష్టత ఇచ్చారో లేదో క్లారిటీ లేదు.
మునుగోడులో కోమటిరెడ్డి సిన్సియర్‌గా పని చేస్తే కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ !
సుదీర్ఘ కాలంగా నల్లగొండ రాజకీయాల్లో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రత్యేకమైన పట్టు ఉంది. మునుగోడులోనూ ఉంది. అక్కడ ప్రతీ గ్రామంలోనూ వారికి అనుచరులు ఉంటారు. కోమటిరెడ్డి బలం అంతా.. బీజేపీ వైపు వెళ్తే కాంగ్రెస్‌కు దెబ్బే. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నా కోమటిరెడ్డికే ఎక్కువ పలుకుబడి ఉంటుంది. అయితే వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పటి వరకూ రంగంలోకి దిగలేదు. మునుగోడుతో తనకేం సంబంధం అంటున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి పని చేసే ప్రశ్నే లేదంటున్నారు. తనకు జరుగుతున్న అవమానాలపై ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు చెప్పుకున్నారు. తెలంగాణ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్న ప్రియాంకా గాంధీతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఇప్పుడు కోమటిరెడ్డి మనసు మార్చుకుంటే.. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. సోదరుడ్ని ఓడించారని కోమటిరెడ్డి అనుకుంటే... అది సాధ్యమే. కానీ ఆయన అనుకుంటారా అన్నదే సందేహం.
ఉపఎన్నిక బాధ్యతలను కోమటిరెడ్డికి అప్పగిస్తారా ?
జానారెడ్డి యాక్టివ్‌గా లేకపోవడం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో.. మునుగోడు ఉపఎన్నిక బాధ్యతను ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే చండూరులో బహిరంగసభ నిర్వహించారు. తర్వాత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. హైకమాండ్ నుంచి క్లారిటీ కోసం ఆయన చూస్తున్నారు. మునుగోడు బాధ్యతను పూర్తిగా తనకే ఇస్తే.. అక్కడే ఉండి గెలుపు కోసం ప్రయత్నించాలనుకుంటున్నారు. అయితే కోమటిరెడ్డి కీలకం. అందుకే హైకమాండ్ నుంచి క్లారిటీ కోసం చూస్తున్నారు. ప్రియాంకా గాంధీతో చర్చల్లో సానుకూలత వ్యక్తం చేసి ఉంటే.. కోమటిరెడ్డికే మునుగోడు బాధ్యత అప్పగించే చాన్స్ ఉంది. తమ్ముడిని ఓడించే అవకాశాన్ని ఆయనకు ఇస్తారు. అయితే అది ఆయనపై కాంగ్రెస్ హైకమాండ్ పెట్టుకున్న నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది.
మునుగోడు బాధ్యత ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్‌లో కీలకంగా మారింది. స్థానిక బలం కోమటిరెడ్డికి కలసి వస్తోంది. ఆయన సోదరుడు బీజేపీలో చేరడం మైనస్ అవుతోంది. సోదరుడిని ఇప్పటి వరకూ విమర్శించని ఆయనకు బాధ్యతలిస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని బీజేపీ కోసం పని చేసేలా చేస్తారని కొంత మంది వాదిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డికి ఇవ్వాలని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పై తమ నిబద్ధను ఎవరూ ప్రశ్నించలేరని కోమటిరెడ్డి అంటున్నారు. మరి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి !