Telangana Early Elections : తెలంగాణలో అన్ని పార్టీలూ ముందస్తుకు రెడీ ! మరి ఎన్నికల గంట కొట్టేదెవరు ?
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం రాజకీయమేనా ? నిజంగానే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారా ?
Telangana Early Elections : తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ పరస్పర సవాళ్లు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించినప్పుడు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని అమిత్ షా సవాల్ చేశారు. కేంద్రం కూడా లోక్‌సభను రద్దు చేస్తే కలిసే వెళదామని టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం అనూహ్యంగా ఎన్నికల తేదీ ఫిక్స్ చేస్తే అసెంబ్లీని రద్దు చేస్తామని సవాల్ చేశారు. దీంతో రాజకీయం వేడెక్కింది.
ముందస్తు ఆలోచనలోనే కేసీఆర్ - కానీ బీజేపీపైనే డౌట్ !
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనల్లో ఎప్పట్నుంచో ఉన్నారు. అసెంబ్లీ రద్దు చేస్తే ఎన్నికలు పెట్టరేమోనని ఇప్పటి వరకూ కేసీఆర్ డౌట్ ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఎన్నికల తేదీని ప్రకటిస్తే తానే అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం సహకరించదన్న కారణగానే ఆగిపోతున్నట్లుగా ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఎన్నికలు జరపకుండా రాష్ట్రపతి పాలన విధిస్తారన్న అనుమానం టీఆర్ఎస్ అధినేతలో ఉంది. 2018లో ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముందస్తుకు సంపూర్ణంగా సహకరించారు. అయితే ఈ సారి మాత్రం బహిరంగ యుద్ధం చేస్తున్నారు. అందుకే బీజేపీ సహకరించదని భావిస్తున్నారు. అందుకే రెచ్చగొట్టి అయినా ఎన్నికలకు పెట్టే ఉద్దేశంతో కేసీఆర్ ఇలా చేస్తున్నారని కొంత మంది విశ్లేషిస్తున్నారు.
అసెంబ్లీని రద్దు చేయకుండా ఎన్నికల తేదీ ప్రకటన ఎలా సాధ్యం ?
అయితే కేసీఆర్ ప్రకటనపై బీజేపీ సానుభూతిపరులు భిన్నమైన విశ్లేషణ చేస్తున్నారు. కేసీఆర్‌కు ముందస్తుకు వెళ్లాలని లేదని.. అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీని రద్దు చేయకుండా ఎన్నికల తేదీని ప్రకటించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నికల సంఘం రాజకీయ పరిమామాల్ని పరగిణనలోకి తీసుకోలేదు. అధికారికంగా అసెంబ్లీ గడువు ముగిసే నాటికి ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ముందస్తుగా నిర్వహించాలంటే మాత్రం అసెంబ్లీ రద్దు అవ్వాలి. ఆ తర్వాతే సన్నాహాలు ప్రారంభిస్తారు. ఈ ప్రకారం చూస్తే ఎన్నికల తేదీని ముందుగా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే లేదంటున్నారు.
బీజేపీ- టీఆర్ఎస్ వ్యూహాత్మక సవాళ్లా ?
కేసీఆర్ రాజకీయ జీవితంలో సవాళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్‌కు చేరడానికి ఇలాంటి సవాళ్లను కేసీఆర్ వినియోగించుకున్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత ఎమ్మెస్సార్ చేసిన సవాల్ ను స్వీకరించి ఉపఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి ఉద్యమంలో ఊపు తీసుకు వచ్చారు. అందుకే కేసీఆర్ ఆషామాషీగా ఇలాంటి సవాళ్లు చేయరని భావిస్తున్నారు. బీజేపీ - టీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి . దీన్ని పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక్కడ రెండు పార్టీల మధ్య ఊహించని అవగాహన ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. రెండు పార్టీలు సవాళ్లు చేసుకుని ముందస్తుకు వెళ్తే.. రెండు పార్టీల మధ్య పోటీ ఉందని జనం అనుకుంటారు. అప్పుడు జనం కూడా రెండు పార్టీల మధ్య పోరుగానే చూస్తారు. అదే జరిగితే కాంగ్రెస్ బలైపోతుంది. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ ఎన్నికల్లో జరిగింది అదేనని గుర్తు చేస్తున్నారు.
అన్ని పార్టీలూ రెడీ !
ఇతర పార్టీలు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్‌ను స్వాగతించాయి. దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని అంటున్నాయి. నిజానిని ఎన్నికల సన్నాహాలను దాదాపుగా అన్ని పార్టీలు ప్రారంభించాయి. కేసీఆర్ తన అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఈ సారి ప్రశాంత్ కిషోర్‌కు ఇచ్చేశారు. ఆయన టీం సర్వేల మీద సర్వేలు చేస్తోంది. కేసీఆర్ పరిస్థితి ఏ మాత్రం వ్యతిరేకంగా ఉందని అనుకున్నా ముందస్తుకు వెళ్లరని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితిని అధ్యయనం చేసి ఎప్పుడు మేలు జరుగుతుందనుకుంటే అప్పుడు మాత్రమే వెళ్తారని అంటున్నారు. ఈ విషయంలోకేసీఆర్ వ్యూహమే ఫైనల్ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సవాళ్లు జరుగుతున్నా… ముందస్తు ఎన్నికల చాన్స్ ఫిఫ్టీ .. ఫిఫ్టీ మాత్రమేనంటున్నారు. ఏం జరుగుతుందో ఒకటి, రెండు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.