Telangana BJP : తెలంగాణ బీజేపీని చక్కదిద్దడంలో హైకమాండ్ ఆలస్యం చేస్తోందా ? ఎందుకు పట్టించుకోవడం లేదు?
తెలంగాణ బీజేపీని హైకమాండ్ పట్టించుకోవడం లేదా ?అంతర్గత రచ్చ జరుగుతున్నా ఎందుకు మౌనం ?పార్టీ నేతల మధ్య కలహాలు తీర్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు ?అమిత్ షా పర్యటనతో అయినా పరిస్థితి మారుతుందా ?
Telangana BJP : తెలంగాణ బీజేపీలో పార్టీ నేతల మధ్య వర్గ పోరాటం రోజు రోజుకు పెరిగిపోతున్న సూచనలు కనపిస్తున్నాయి. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీని మించిపోతోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెబుతూంటారు. ఎందుకంటే అక్కడ ఉండే గ్రూపులు అన్ని మరి. ఇతర పార్టీలపై పోరాడటం కన్నా వారిలో వారు పోరాడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ట్రాక్‌లోకి వచ్చినట్లుగా ఉంది కానీ.. బీజేపీ మాత్రం కాంగ్రెస్ లా మారిపోయింది. పార్టీలో గ్రూపులు ఎక్కువైపోయాయి. కానీ వారందర్నీ సమన్వయం చేసేందుకు బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ప్రయత్నించడం లేదు.
తెలంగాణ బీజేపీ వర్గ పోరాటాల్లో బిజీ
తెలంగాణ బీజేపీ నేతలు గతంలో ఏదో ఓ కార్యక్రమం చేపట్టేవారు. ఇప్పుడు కొద్ది రోజులుగా వారు రోడ్లపైకి వచ్చిందే లేదు. దీనికి కారణం వారంతా వర్గ పోరాటంలో బిజీగా ఉండటమే. తెలంగాణ బీజేపీ చీఫ్ ను మార్చాలని ఓ వర్గం పట్టుబడుతోంది. ఉన్న చీఫ్ నే కొనసాగించాలని మరో వర్గం లాబీయింగ్ చేస్తోంది. రహస్య సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తాజాగా.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రెడ్డి ఫాం హౌస్ లో తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ నిర్వహించారు. విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి , బూర నరసయ్య వంటి వారు పాల్గొన్నారు. వారి ఎజెండా ఏమిటో తెలియదు కానీ.. ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు అందరూ పార్టీ మారడానికి స్కెచ్ వేసుకుంటున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతూ ఉంటుంది.
ఈటల వర్సెస్ బండి సంజయ్.. బీజేపీలో కనిపించనియుద్ధం !
ఈటల రాజేందర్ kg పగ్గాలివ్వాలలని కొందరు.. వద్దని కొందరు పోటీ పడి ఢిల్లీకి వెళ్తున్నారు. బండి సంజయ్ ను... కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని..ఈటలకు పగ్గాలిస్తారని కొంతమంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏం జరిగినప్పటికీ.. బీజేపీ ఇప్పటికి పూర్తి స్థాయిలో ఎన్నికల రేసులోకి రాలేకపోతోంది. వచ్చే వారం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో తాడో పేడో తేల్చుకోవాలనుకునే నేతల సంఖ్య పెరిగిపోయింది. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీగా .. కాంగ్రెస్ కు ఇమేజ్ మరింత పెరిగితే.. ఇక బీజేపీకి మరింత గడ్డు కాలం వస్తుంది. ఇదంతా తెలిసి కూడా బీజేపీ హైకమాండ్.. పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతోంది.
తెలంగాణ పర్యటనకు వస్తున్న అమిత్ షా లెక్కలు సరి చేస్తారా ?
తెలంగాణలో గెలుపును టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీకి ఢిల్లీ పరిణామాలు ఓ రకంగా ఇబ్బందికరంగా మారితే.. రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య అంతర్గత పోరాటం మరో సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో పార్టని దారిలో పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అమిత్ షా రెండు రోజుల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీని సెట్ రైట్ చేసి కీ ఇస్తే సరే సరి లేకపోతే.. బీజేపీ పరుగులో వెనుకబడిపోతుంది. అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితులు లేవు. గతంలో కాంగ్రెస్ నుంచి వెల్లువలా బయటకు వెళ్లిపోయేవారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూడటం లేదు. రేవంత్ నాయకత్వం ఇష్టం లేని వారు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. కానీ బీజేపీ పరిస్థితే క్లిష్టంగా మారింది.