(Source: ECI/ABP News/ABP Majha)
Andhra Politics : ఏపీలో బీజేపీతో పొత్తు టీడీపీకి మేలేనా ? వైఎస్ఆర్‌సీపీ విమర్శలు ఎందుకు ?
ఏపీలో బీజేపీ అంత పవర్ ఫుల్లా ? ఎందుకు రాజకీయ పార్టీల మధ్య తరచూ హాట్ టాపిక్ అవుతోంది.
Andhra Politics : చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడిపోతున్నారని .. ఢిల్లీలో అందుకే విన్యాసాలు చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శిస్తున్నరు. అయితే ఏపీలో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే.. పలితాలు మార్చేసే అంత బలంగా ఉందా అన్నది రాజకీయవర్గాలకు అందని లాజిక్ గా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఇంకా చెప్పాలంటే నోటాలో సగం కూడా రాలేదు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ పార్టీ పరిస్థితి ఏమన్నా మెరుగుపడిందా అంటే .. ఇంకా దిగజారిపోయిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. మరి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారు ? అలా పెట్టుకోవాలనుకుంటున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎందుకు విమర్శలు చేస్తోంది ? ఇవే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలు.
బీజేపీతో ప్రత్యేకహోదా కోసమే దూరమయ్యామంటున్న చంద్రబాబు
కారణం ఏదైనా చంద్రబాబునాయుడు బీజేపీతో శత్రుత్వం కోరుకోవడం లేదు. అందుకే మోదీ విధానాలను సమర్థిస్తున్నానని చెబుతున్నారు. కానీ ఎన్డీఏలో చేరలేదు. చేరుతామని కూడా చెప్పడం లేదు. తెలంగాణలో ఒంటరి పోటీనేనని స్పష్టం చేశారు. ఏపీ గురించి కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు. బీజేపీతో ఎలాంటి సమస్యలు లేవని ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విబేధించామని చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు మాటలు బీజేపీతో పొత్తునకు రెడీ అని కాదు కానీ ఆ పార్టీతో గొడవలేం లేవని సంకేతాలు పంపినట్లయింది. అదే సమయంలో ఇండియా కూటమి వైపు వెళ్లేది లేదని కూడా స్పష్టత ఇచ్చారు. అంటే చంద్రబాబు స్పష్టంగా.. బీజేపీ వైపే ఉన్నానని చెబుతున్నారు. కానీ ఎన్డీఏ కూటమిలో చేరే విషయం మాత్రం చెప్పడం లేదు.
వైఎస్ఆర్‌సీపీ తీవ్ర విమర్శలు దేనికి సంకేతం?
మరో వైపు చంద్రబాబు తీరుని వైఎస్ఆర్‌సీపీ తప్పు పడుతోంది. గతంలో చంద్రబాబు.. మోదీని తిట్టారని, అమిత్ షా రాళ్లేయించారని ఇప్పుడెందుకు పొగుడుతున్నారని ప్రశ్నిస్తోంది. టీడీపీ రాజకీయ వ్యూహాలను వైసీపీ ప్రశ్నించవచ్చు కానీ.. ఆ పార్టీ పొత్తుల కోసమే ప్రయత్నిస్తోందని తీర్మానించి తాము విమర్శలు చేస్తూండటంతో బీజేపీకి టీడీపీ దగ్గరవకూడదని కోరుకుంటున్న సందేశం ప్రజల్లోకి వెళ్తోంది. బీజేపీ నేతలు రాష్ట్రంలో, కేంద్రంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించినా .. కేంద్రానికి మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పెద్దగా షరతులు పెట్టకుండానే మద్దతిస్తున్నారు. దీని వల్ల వైఎస్ఆర్‌సీపీ పెద్దలకు ఏమైనా మేలు జరుగుతుందేమో కానీ. టీడీపీ, బీజేపీ దగ్గర అయితే తమకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారేమోనన్న ఆందోళనతోనే విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బీజేపీతో పొత్తుల వల్ల ఓట్ల పరంగా ప్రయోజనం ఉండదు - కానీ
నిజానికి బీజేపీతో టీడీపీ పొత్తులు పెట్టుకుంటే వైసీపీకే లాభమన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉండే మైనార్టీలు, దళిత వర్గాల ఓటర్లు ఈ సారి ప్రత్యామ్నాయంకు ఓటేయాలని అనుకున్నా మనసు మార్చుకుంటారు. ఇది ఓ రకంగ మైనస్సే. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే ఓట్ల పరంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ బీజేపీ సహకారం లభిస్తుంది. ఆ సహకారం ఎలా ఉంటుందో రాజకీయవర్గాలకు బాగా తెలుసు. అందుకే టీడీపీ బీజేపీ తో సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.. అలా సన్నిహితం కాకుండా ఉండేలా చూసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అందుకే ఏపీ రాజకీయాలు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి.
ఏపీలో బీజేపీ ఇప్పటి వరకూ ఏ పార్టీతోనూ వ్యతిరేకంగా లేదు. వైసీపీతోనూ సన్నిహితంగానే ఉంది. పైకి విమర్శలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీకి సహకారం లభిస్తోంది. టీడీపీని దూరం పెట్టడం లేదు. బీజేపీ ఓ వైపు అయినా మొగ్గితే అప్పుడు రాజకీయం మారిపోతుంది.