Anantapur YSRCP : అనంతపురం ఎమ్మెల్యే టిక్కెట్ కోసం వైసీపీలో భారీ పోటీ - సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే జగన్ మొగ్గు చూపుతున్నారా ?
Anantapur YSRCP :అనంతపురం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సీటు కోసం భారీ పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా ఐదుగురు సీనియర్ నేతలు తమకు చాన్సివ్వాలని జగన్‌ను కోరుతున్నారు.
huge competition for YSRCP Anantapur MLA seat : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైసీపీ టిక్కెట్ కోసం సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం టిక్కెట్టు అధికారికంగా ఖరారు కాకపోవడంతో టిక్కెట్టు ఆశిస్తున్న వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అనంత వెంకటరామిరెడ్డికి టిక్కెట్టు ఖరారైనట్టు ప్రచారం నడుస్తోంది. అసమ్మతి నేతలు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు.
అనంతపురం వైసీపీలో పలువురు సీనియర్ నేతలు
గత ఎన్నికల సమయంలోనూ ఆయన ఒకవైపు, ఐదుగురు నేతలు ఒకవైపు ఉండి ప్రయత్నాలు సాగించారు. అధిష్టానం అనంత వెంకటరామిరెడ్డి వైపు మొగ్గు చూపింది. ఈసారి మార్పు చేపడితే తమకు అవకాశం కల్పించాలని చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాసులు, వైటి.శివారెడ్డి, నదీమ్ అహమ్మద్, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అటు మైనార్టీ, ఇటు బలిజ సామాజిక తరగతులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నందు వీరికి అవకాశం కల్పించాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే అనంత వెంకటరామిరెడ్డి మాత్రం పార్టీలో తనకున్న పట్టుతో సైలెంట్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే వైపు మంత్రి పెద్దిరెడ్డి
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఉంది. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, తాను చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం నగర పాలక సంస్థ పాలక వర్గంలో పట్టుపెంచుకున్నారు. తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని మేయరుగా అయ్యేటట్టు చేసుకోవడంలో ఆయన సఫలీకృతమయ్యారు. అసమ్మతి నేతలు ఆ పదవి కోసం పోటీపడినా వారికి కాకుండా తాను అనుకున్న వ్యక్తినే మేయరుగా చేసుకున్నారు. దీంతో నగరంలో ఎక్కడా ఎటువంటి సమస్యలేకుండా తానుకున్న విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారన్న చర్చ నడుస్తోంది.
మార్పు ఉండకపోవచ్చంటున్న ఎమ్మెల్యే వర్గీయులు
సీనియర్ నాయకుడిగానూ అనంత వెంకటరామిరెడ్డి పేరుంది. 1996 నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. ప్రారంభంలో ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉంటూ వచ్చారు. 2019లోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో జిల్లా రాజకీయాల్లో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఆయనకు టిక్కెట్టు మార్పు ఉండబోదని ఆ పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. ఈయనకు కొంత అసమ్మతిని ముందు నుంచి ఎదుర్కొంటూ వస్తునే ఉన్నారు. ఆ ఐదుగురు నేతలు ఈసారైనా మార్పు చేపట్టి తమలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే అధిష్టానం ఈ మార్పునకు అంగీకరిస్తుందా లేక అనంత వెంకటరామిరెడ్డికే మరోమారు అవకాశం కల్పిస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.