YSRCP Perni Nani Vs BalaSowri : బందరులో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే - వైఎస్ఆర్‌సీపీలో మరో పంచాయతీ !
మచిలీపట్నం ఎమ్మెల్యే, ఎంపీల మధ్య వివాదం ఏర్పడటంతో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ వారిని తాడేపల్లి రావాలని ఆదేశించింది. పేర్ని నానిపై ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు చేశారు.
YSRCP Perni Nani Vs BalaSowri : వైఎస్ఆర్‌సీపీలో గ్రూపుల గోల ఎక్కువైపోతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో మచిలీపట్నం ఎంపీ, మచిలీపట్నం ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ రోడ్డున పడింది. ఎమ్మెల్యే పేర్ని నానిపై ఎంపీ వల్లభనేని బాలశౌరి తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీంతో ఇరువుర్నీ వైఎస్ఆర్‌సీపీ పెద్దలు తాడేపల్లి రావాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించారు.
పేర్ని నాని టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని ఎంపీ బాలశౌరి ఆరోపణ !
మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని ఎంపీ బాలశౌరి హఠాత్తుగా ఆరోపణలు గుప్పించారు. సొంత పార్టీ ఎంపీ మచిలీపట్నంలో తిరగకుండా అడ్టుకుంటున్నారని... టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో వారానికి ఒకసారైనా మాట్లాడకపోతే ఆయనకు నిద్రపట్టదని మచిలీపట్నంలోనే ఆరోపించారు. సుజనా చౌదరి తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారని.. ఆ ఎంపీ ముఖ్యమంత్రిని, పార్టీని, ప్రభుత్వాన్ని అవినీతిమయమని తిడితే స్పందించరని విమర్శించారు. బందరు నీ అడ్డాకాదు.. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటా. నా ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎవరేం చేస్తారో చూస్తానని హెచ్చించారు. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా. తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే రకం కాదనన్ారు. గత కొంత కాలంగా బాలశౌరికి, పేర్ని నానికి పొసగడం లేదు.
బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని పేర్ని నాని !
పేర్ని నాని బందరు రాజకీయాల్లో చాలా కాలంగా కీలకంగా ఉంటున్నారు. అయితే వల్లభనేని బాలశౌరి మాత్రం గుంటూరుకు చెందినవారు. ఆయనకు సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా ఎంపీ టిక్కెట్‌ను మచిలీపట్నంలో కేటాయించారు. ఆ విధంగా ఆయన విజయం సాధించారు. విజయంలో పేర్ని నాని కూడా కీలకంగా వ్యవహరించారు. అయితే ఎంపీగా గెలిచిన తర్వాతక బాలశౌరి పెద్దగా మచిలీపట్నంలో కనిపించలేదు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పేర్ని నాని ఏ ఒక్క కార్యక్రమానికీ ఎంపీని పిలువలేదని చెబుతున్నారు. ఈ కారణంగా మచిలీపట్నంకు రాకుండా తనను అడ్డుకుంటున్నారన్న భావనతో ఎంపీ బాలశౌరి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇద్దర్నీ తాడేపల్లికి పిలిచిన హైకమాండ్ !
మాజీ మంత్రి, ఎంపీ మధ్య విభేదాలు బయటపడటంతో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ చురుగ్గా స్పందించింది. వెంటనే ఇద్దరితోనూ మాట్లాడింది. బహిరంగ వ్యాఖ్యలు ఎవరూ చేయవద్దని ఇద్దర్నూ తాడేపల్లి రావాలని ఆదేశించింది. దీంతో వారు హైకమాండ్‌ను కలిసేందుకు వెళ్లనున్నారు. వారి మధ్య ఏర్పడిన విభేదాలను హైకమాండ్ పరిష్కరించే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్‌సీపీలో ఇటీవల ఇలాంటి గొడవలు పెరిగిపోతున్నాయి. పార్టీ ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియా ముందుకు వస్తున్నారు. వీరి పంచాయతీలను తీర్చడానికి వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ తంటాలు పడుతోంది.