Political Bheemla: జగన్‌కు భీమ్లా పంచ్‌లేశారా ? ఈ డైలాగులు వైఎస్ఆర్‌సీకి చురుకు పుట్టిస్తాయా ?
భీమ్లా నాయక్ సినిమాలో కొన్ని డైలాగులు సీఎం జగన్, వైఎస్ఆర్‌సీపికి పంచ్‌లు వేసినట్లుగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.
భీమ్లా నాయక్ సినిమా ప్రపంచం మొత్తం సాఫీగా రిలీజ్ అయింది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప. అక్కడ పవన్ కల్యాణ్ రాజకీయాల ప్రభావం సినిమాపై పడింది. అధికారపార్టీ సినిమాకు ఎన్ని ఆటంకాలు సృష్టించాలో అన్నీ సృష్టించింది. కొంత కాలంగా పవన్ సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగానే ఉంది. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలోనూ రిపీట్ అయింది. అయితే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి పంచ్‌లేశారనే ప్రచారం ఊపందుకుంది. అందులో పవన్ డైలాగుల్ని వైఎస్ఆర్‌సీపీ పెద్దలకు అన్వయిస్తూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు.
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ ఎస్ఐగా నటించారు. రానాను ఆయనఓ కేసులో బుక్ చేస్తారు. బెయిల్ వచ్చిన సందర్భంలో కోర్టు షరతుల ప్రకారం వారానికో రోజు స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలి. ఈ సీన్‌లో రానాను ఉద్దేశించి పవన్ కల్యాణ్.. ప్రతి శుక్రవారం వచ్చి సంతకం చేసి వెళ్లరా అని కఠినమైన పదాన్ని ప్రయోగిస్తారు. ఏపీలో సహజంగానే శుక్రవారం అంటే రాజకీయం గుర్తుకు వస్తుంది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ కారణాలతో హాజరు కావడం లేదు. దీంతో శుక్రవారం డైలాగ్‌కు జగన్‌కు లింక్ పెట్టి పవన్ పంచ్ ఇచ్చారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసుకుంటున్నారు. నిజానికి అక్కడ శుక్రవారం అని పెట్టాల్సిన పని లేదు. ఏ వారమైనా పెట్టొచ్చు కానీ భీమ్లా నాయక్ మాటల రచయిత త్రివిక్రమ్ శుక్రవారమే పెట్టారు. దీంతో వారి ఉద్దేశం కూడా పంచ్ అయి ఉంటుందని భావిస్తున్నారు.
అయితే నార్మన్ డైలాగ్సే అయినా ఏపీ అధికార పార్టీకిపంచ్‌లుగా అన్వయించుకునే మరికొన్ని డైలాగ్స్ భీమ్లా నాయక్‌లో ఉన్నాయి. పీకేసినా మళ్లీ వస్తానని పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో అంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు చేసే వైఎస్ఆర్‌సీపీ నేతలు పీకేను పీకేశారని సెటైర్లు వేస్తూంటారు. దీనికికౌంటర్‌గా ఈ డైలాగ్ ఉందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఓటముల గురించి కూడా వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసే విమర్శలకు పవన్ డైలాగ్ కౌంటర్ ఇచ్చారని.. గజనీ దండయాత్రలో ఆయన్ని ఓడించిన వాళ్లను ఎవరూ గుర్తు పెట్టుకోలేదని.. కానీ గజనీని గుర్తు పెట్టుకున్నారన్నారు. పవన్ రెండు చోట్లా ఓడిపోయినా ఆయననే అదే పనిగా గుర్తు చేసుకుంటున్నారన్న అర్థంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడి్యాలో పంచ్‌లు విసురుతున్నారు.
సినిమాల్లో పంచ్ డైలాగులు సహజం. అదీ త్రివిక్రమ్ మాటలు రాస్తే పంచ్‌లు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. అయితే పవన్ రాజకీయ నాయకుడు కావడంతో ఆయన సంభాషణల్లో పంచ్‌లు రాజకీయాలకూ అన్వయించుకుంటున్నారు ఫ్యాన్స్. అందులో నిజం ఉందో లేదో రాసిన రచయితకే తెలియాలి. డైరక్ట్ అర్థం మాత్రం అది సినిమా డైలాగే.