(Source: ECI/ABP News/ABP Majha)
KCR Vs Etela : కేసీఆర్‌పైనే పోటీ - బెంగాల్ ఫార్ములా ఖాయమన్న ఈటల !
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటికే గజ్వేల్‌లో వర్క్ ప్రారంభించానని చెబుతున్నారు.
KCR Vs Etela : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిందని తాను సీరియస్‌గా గజ్వేల్‌లో వర్క్ చేస్తున్నానని ప్రకటించారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది కూడా గజ్వేల్‌లోనేనన్నారు. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీపై అప్పటి వరకూ టీఎంసీలో ఉన్న సువేందు అధికారి బీజేపీలో చేరి పోటీ చేసి గెలిచారు. అయితే అక్కడ సువేందు అధికారి స్థానంలోకి మమతా బెనర్జీనే వెళ్లి పోటీ చేశారు. ఇక్కడ ఈటల రాజేందర్ మాత్రం తాను స్వయంగా కేసీఆర్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెబుతున్నారు. కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ చెబుతున్నారు.
వైసీపీ ప్లీనరీలో విజయమ్మ వ్యాఖ్యలకు అర్థమేంటి ! రాజీనామా వ్యూహాత్మకమేనా ?
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావంలో కాకుండా కొంత కాలం తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఈటల రాజేందర్ ఆ తర్వాత టీఆర్ఎ్‌లో నెంబర్ టూగా ఎదిగారు. అయితే 2018 ఎన్నికల తర్వాత ఆయనకు కేసీఆర్‌తో గ్యాప్ బాగా పెరిగింది. ధాన్యం కొనుగోళ్లు ఉండవని కేసీయార్ ప్రకటించిన తర్వాత విమర్శలు చేశారు. చివరికి ఆయన భూకబ్జాలకు పాల్పడ్డారని చెప్పి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. దాంతో టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు ఈటల రాజేందర్. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికల్లో హుజురాబాద్ నుంచి విజయం సాధించారు. కేసీఆర్ తనను దారుణంగా మోసం చేశారని ఆయనను ఓడించే వరకూ తన రాజకీయ పోరాటం చేస్తానని చెబుతున్నారు.
తెలంగాణ సీఎస్‌ను బదిలీ చేస్తారా ? ఏపీకి పంపాల్సిందేనని హైకోర్టులో కేంద్రం వాదనలు !
ఈటల రాజేందర్ కు ఇటీవల బీజేపీలో కీలక బాధ్యతలు లభిస్తున్నాయి. ఆయనకు చేరిక కమిటీకి చైర్మన్‌గా నియమించారు. టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు తెలంగాణ ఉద్యమకారులతోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. వారందర్నీ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగాల్ తరహాలో కేసీఆర్‌నే ఈటల గురి పెడుతున్నారన్న విషయం బయటకు రావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదని టీఆర్ఎస్ వర్గాల్లో కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ స్థానాన్ని గత రెండు సార్లు తనపై పోటీ చేసి ఓడిపోయి.. టీఆర్ఎస్‌లో చేరిన ప్రతాపరెడ్డికి ఇస్తారని చెబుతున్నారు. అయితే ఈటల రాజేందర్ తాను గజ్వేల్‌లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించడంతో .. ఒక వేళ కేసీఆర్ నియోజకవర్గం మారితే.. ఈటల కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారా అన్నదానిపై ముందు ముందు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.