TS CS Somesh Kumar : తెలంగాణ సీఎస్‌ను బదిలీ చేస్తారా ? ఏపీకి పంపాల్సిందేనని హైకోర్టులో కేంద్రం వాదనలు !
చిక్కుల్లో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ . ఆయనను బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
TS CS Somesh Kumar : తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ఏపీ క్యాడర్‌కు పంపాల్సిందేనని కేంద్రం హైకోర్టులో వాదించడమే దీనికి కారణం. ఏపీ క్యాడర్‌కు కేటాయించినప్పటికీ ఆయన తెలంగాణలోనే విధులు నిర్వహిస్తూండటంపై దాఖలైన పిటిషన్ విషయంలో హైకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనన్న వాదన వినిపించింది. ఈ అంశంపై హైకోర్టులో కేంద్రం స్పష్టమైన అభిప్రాయం చెప్పింది. ఆయన ఏపీకి పంపాల్సిందేనని తెలిపింది. దీంతో ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. అయితే తీర్పు రాక ముందే ఆయనపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కేంద్రం కూడా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పినందున సోమేష్ కు షాక్ తగలడం ఖాయమని భావిస్తున్నారు. సోమేష్ కుమార్‌ను విభజన సమయంలో ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. కానీ ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తెలంగాణ సర్వీస్‌లోనే కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు తెలంగాణలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు. వాస్తవానికి సీఎస్ అయ్యేంత సీనియారిటీ ఆయనకు లేదు. తన సర్వీసు మధ్యలో రెండు సార్లు నాలుగేళ్ల పాటు సర్వీసును వదిలి ప్రైవేటు సంస్థల్లో పని చేశారు. పది మందికిపైగా సీనియర్లు ఉన్నప్పటికీ కేసీఆర్ సోమేష్‌కు చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు.
అయితే ఇటీవల ఆయన పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఆయనపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేసమయంలో
ఇటీవల సోమేశ్ కుమార్ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారని పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే సీఎస్ తీరుపై బీజేపీ కూడా అసంతృప్తిగా ఉంది. ఆయనపై కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో కేంద్రం ఆయనను ఏపీకి పంపాలనే స్పష్టమైన అభిప్రాయంతో ఉండటంతో … సోమేష్ తన క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టమని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కేసీఆర్‌కు కూడా ఇబ్బందికరమే. ఆయన ఏరికోరి వచ్చే ఎన్నికల వరకూ సోమేష్ ఉండేలా చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయనను ఏపీకి కేటాయిస్తే.. కొత్త సీఎస్‌ను కేసీఆర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 2023లో ఎన్నికలు జరిగే వరకు సోమేశ్ కుమార్ సీఎస్‌గా కొనసాగుతారని భావించినా.. ఆ అవకాశం లేదని భావిస్తున్నారు. తీర్పు రాక ముందే ఆయనను బదిలీ చేస్తారని చెబుతున్నారు.