వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీకి సమాన దూరం- ఏపీ బీజేపీ కేడర్‌కు క్లారిటీ ఇచ్చినట్టేనా!
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం ఉంది. కేంద్రమంత్రులు, అగ్రనేతలు వచ్చి వెళ్తున్నా పార్టీలో ఆ జోష్ కనిపించలేదు. సోమువీర్రాజు తీసుకున్న నిర్ణయాలు ప్రభావం చూపలేకపోయాయి.
దేశంలో ఉన్న రాజకీయం మొత్తం ఒకలా ఉంటే ఏపీలో మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్టే.... స్టేట్ బీజేపీలో ఉంది మాత్రం టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులే అనే విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీన్ని రుజువు చేసేలానే ఉంటున్నాయి అక్కడి పార్టీల వ్యూహాలు, నేతల మాటలు.
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం ఉంది. కేంద్రమంత్రులు, అగ్రనేతలు వచ్చి వెళ్తున్నా పార్టీలో ఆ జోష్ కనిపించలేదు. సోమువీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఆయనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై నేరుగా ఫిర్యాదులు కూడా అధినాయకత్వానికి అందాయి.
సోమువీర్రాజు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని... టీడీపీని మాత్రమే తిట్టేవారిని వెనుకేసుకొస్తున్నారనే విమర్శ ఉండనే ఉంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో, ప్రజాసమస్యలపై పోరాటం చేసే దిశగా కేడర్‌ను నడిపించడంలో విఫలమయ్యారని నేతలే బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలా పార్టీలో అన్ని వర్గాల నేతలను కలుపుకొని సమర్థంగా ముందుకు తీసుకెళ్లలేకపోయారని ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.
సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి వారు వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉంటున్నారని... వెంకయ్య శిష్యులుగా పార్టీ ఉంటున్న వారు, టీడీపీ నుంచి చేరిన నేతలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని అంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రెండు ప్రాంతీయ పార్టీలుగా విడిపోయిందన్న విమర్శ పొలిటికల్ సర్కిల్‌లో ఉండనే ఉంది.
బీజేపీలో రెండు వర్గాలు ఉంటున్నా ఎటూ తేల్చుకోలేని పురందేశ్వరి లాంటి వాళ్లు మాత్రం సైలెంట్ అయిపోయారు. సమయం వచ్చినప్పుడు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని అంటారు. ఇలా పార్టీ మూడు వర్గాలుగా విడిపోయిన టైంలో అధినాయకత్వం అనూహ్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండు శిబిరాల నుంచి ఎవరినో ఒకర్ని అధ్యక్షులుగా చేస్తారనుకుంటే మూడో శిబిరం వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చింది.
సోమువీర్రాజు తర్వాత సత్యకుమారే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అవుతారని మొదటి నుంచి చర్చలు నడిచాయి. అలా చేసి ఉంటే ఆయన టీడీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారనే పుకార్లు వచ్చేవి. కానీ వాటికి ఆస్కారం ఇవ్వకుండా బీజేపీ అధినాయకత్వం చెక్ చెప్పింది. ఎవరూ ఊహించని విధంగా పురందేశ్వరిని అధ్యక్షురాలిని చేసి కేడర్‌కు స్పష్టమైన సంకేతాలు పంపించింది.
అటు వైఎస్‌ఆర్‌సీపీకి కానీ, ఇటు టీడీపీకి కానీ తాము సపోర్ట్ చేసే పరిస్థితి లేదని... ఇద్దరికీ సమాన దూరంలో ఉంటూనే పార్టీ ఎదుగుదలకు ప్రయత్నిస్తామని తేల్చేసిందని అంటున్నారు నాయకులు. ప్రస్తుతం పవన్‌తో ఉన్న పొత్తు కంటిన్యూ అవుతుందనే సంకేతాలు కూడా ఇచ్చిందని టాక్. దీన్ని ఎన్నికల వరకు ఎలా తీసుకు వెళ్తుందనే అనుమానాలు కూడా కేడర్‌లో ఉంది.
Also Read: బండిని జరిపింది ఎవరు! ఈటల, రఘునందన్ లు హ్యాపీయేనా!
Also Read: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ హైకమాండ్ వ్యూహంపై అస్పష్టత - అసలేం చేయాలనుకుంటున్నారు ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial