Modi Dirict War With KCR : టీఆర్ఎస్‌పై తొలి సారి మోదీ డైరక్ట్ ఎటాక్ - ఇక మరింత దూకుడుగా బీజేపీ రాజకీయం !
తెలంగాణ పర్యటనలో మోదీ నేరుగా టీఆర్ఎస్, కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. గత పర్యటనల్లో ఇలా చేయలేదు. దీంతో తెలంగాణ విషయంలో బీజేపీ డైరక్ట్ వార్‌కు రంగం సిద్ధం చేసుకుందని భావిస్తున్నారు.
Modi Dirict War With KCR : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాల స్టైల్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. జూలైలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ సభ జరిగింది. అప్పట్లో కూడా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తత ఉంది. తనను మోదీ చీల్చి చెండాడుతారని.. అంతకు ముందు మీడియా సమావేశంలో కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ మోదీ మాత్రం సభలో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాకుండా ప్రసంగించారు. కానీ ఈ సారి మాత్రం నేరుగా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. అవినీతి ప్రభుత్వ కూలిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో మోదీ వార్ డిక్లేర్ చేసినట్లయిందని చెబుతున్నారు.
గతానికి భిన్నంగా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసిన మోదీ !
మోదీ తెలంగాణ పర్యటనలో ఈ సారి రాష్ట్రంలో పాగా వేసేందుకు ఫోకస్ పెట్టినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే గత పర్యటనలకు భిన్నంగా ఈ సారి మోడీ టూర్ కొనసాగింది. ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయని మోదీ.. హైదరాబాద్ కు ఎంట్రీతోనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉదయం హైదరాబాద్ కు రాగానే బేగంపేట సభలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మోడీ రామగుండం సభలో సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ క్లారిటీ ఇచ్చి అధికార, విపక్షాల విమర్శలకు చెక్ పెట్టారు. సింగరేణిపై హైదరాబాద్ నుంచి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నాని.. తన పర్యటనతో ఇవాళ కొందరికి నిద్ర కూడా పట్టదంటూ కేసీఆర్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
పూర్తిగా రాజకీయ కోణంలోనే తెలంగాణ పర్యటన !
ఏపీలో కూడా మోదీ పర్యటించారు. కానీ అక్కడ ఆయన రాజకీయాలు మాట్లాడలేదు. కానీ తెలంగాణలో అడుగు పెట్టగానే టోన్ మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ గా మోడీ టూర్ సాగింది. గతంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో ఎటువంటి రాజకీయ విమర్శలు చేయని మోడీ.. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ గా డైరెక్ట్ అటాక్ చేశారు. పేదలను దోచుకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం..వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నమంటూ హింట్ ఇచ్చారని భావిస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న తిట్ల లాంటి విమర్శలపైనా కౌంటర్ ఇచ్చారు. తనను ఎన్ని తిట్టినా భరించే శక్తి ఉందన్నారు. కానీ తెలంగాణ జోలికొస్తే మాత్రం ఊరుకోనన్నారు.
సింగరేణి విషయంలో స్పష్టత !
సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారనే ప్రచారం కొంత కాలంగా అంతర్గతంగా జరుగుతోంది. అయితే దీనిపై మోదీ క్లారిటీ ఇచ్చారు. నమ్మొద్దని చెప్పారు. సింగరేణిపై హైదరాబాద్ నుంచి కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో రాష్ట్ర వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 ఉందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పారు. బేగంపేటలో పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదని పరోక్షంగా టీఆర్ఎస్ సర్కార్ ను హెచ్చరించారు. పేదల ఎదుగుదలకు అవినీతే అడ్డని.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నా బీజేపీ కార్యకర్తలు భయపడడం లేదన్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటం కొనసాగుతోందని చెప్పారు. కొందరు తనను తిట్టడం కోసం డిక్షనరీలను వెతుకుతున్నారని ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీ.. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు.
ఎలా చూసినా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇక నుంచి డైరక్ట్ వార్ ప్రారంభమయిందని అనుకోవచ్చు.