YSRCP Dissidence : జగన్ దృష్టి పెట్టారు - అందరూ సర్దుకున్నారు ! వైఎస్ఆర్‌సీపీలో తేలిపోయిన అసంతృప్తి
వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి చల్లారిపోయింది. సీఎంను కలిసిన తర్వాత అందరూ తమకు ఎలాంటి అసంతృప్తి లేదని ప్రకటించారు.
మంత్రివర్గ విస్తరణ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి ఒక్క సారిగా తేలిపోయింది. మొత్తం వ్యవహారాన్ని సీఎం జగన్ టీ కప్పులో తుఫాన్‌గా తేల్చేశారు. ఎక్కువగా ఆశలు పెట్టుకుని భంగపడిన ఎమ్మెల్యేలను సీఎం జగన్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడి సర్ది చెప్పారు. మంత్రి పదవి రాకపోయినా పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గదని వారికి హామీ ఇచ్చారు. దాంతో వారంతా.. తమకేమీ అసంతృప్తి లేదని ప్రకటించారు. అయితే అందరి కన్నా ప్రస్తుత అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేసిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితపై మాత్రం జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఆమెను కలిసేందుకు అంగీకరించడం లేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ఆర్‌సీపీలో చల్లబడిపోయిన అసంతృప్తి !
కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రకటన అనంతరపుం వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి వెల్లు వెత్తింది. సీనియర్ ఎమ్మెల్యేల అనుచరులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. చాలా మంది ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. వీరందరూ మంత్రి పదవి వస్తుందని గట్టి ఆశలు పెట్టుకున్న వారే. అందరూ మనస్థాపానికి గురయ్యారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి, సుచరిత వంటి తాజా మాజీ మంత్రులు ... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను వంటి సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఇక రాజీనామా చేస్తారేమోనన్నంతగా ప్రచారం జరిగింది. కానీ జగన్ అసంతృప్తులపై దృష్టి పెట్టారు. ఆయా నేతలతో మాట్లాడి సర్ది చెప్పేందుకు సీనియర్ నేతలను పంపించారు. వారు చర్చలు పూర్తి చేశారు. బాలినేని సహా అందరూ పిన్నెల్లి, ఉదయభాను అందరూ తమకేమీ అసంతృప్తి లేదని.. పార్టీ కోసం పని చేస్తామని ప్రకటించారు. దీంతో కథ సుఖాంతమైంది.
సుచరిత తీరుపై జగన్ ఆగ్రహం !
అందర్నీ ఏదో ఓ పదవి ఇస్తామని బుజ్జగిస్తున్నారు కానీ మాజీ హోంమంత్రి సుచరితను మాత్రం వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ లైట్ తీసుకుంది. మొదటి రోజు ఎంపీ మోపిదేవి వెంకటరమణ చర్చలు జరిపారు కానీ తర్వాత ఒక్కరంటే ఒక్కరు సుచరిత వద్దకు వెళ్లడం లేదు. సీఎం బుజ్జగిస్తారని తీసుకెళ్లడం లేదు. సుచరిత తీరుపై జగన్ అసహనంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ నిర్ణయాన్ని ధిక్కరించడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసినా చాలా మంది బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ సుచరిత మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. సుచరిత అనుచరులు.. తమకు హైకమాండ్ సుచరిత అని ప్రకటించారు. ఈ పరిణామాలతో సుచరిత అసంతృప్తిని పట్టించుకోకూడదన్న ఉద్దేశంలో వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అసంతృప్తి వ్యక్తం చేసిన వారెవరికీ ప్రత్యామ్నాయం లేదు.. !
నిజానికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదని వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఎవరికీ రాజకీయంగా ప్రత్యామ్నాయం లేదు. అందరూ వైఎస్ జగన్‌కు సన్నిహితులు మాత్రమే కాదు .. ఇతర పార్టీల్లోని ఆయా నియోజకవర్గాల నేతలతో వ్యక్తిగత వైరం కూడా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా ... సామినేని ఉదయభాను అయినా వారు వైఎస్ఆర్‌సీపీని కాదని మరో పార్టీకి వెళ్లే పరిస్థితి లేదు. అందుకే వారు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా పార్టీకే కట్టుబడి ఉంటారని అందరూ అంచనా వేశారు. దానికి తగ్గట్లుగానే వారు సర్దుకున్నారు. ఈ మొత్తం అసంతృప్తి ఎపిసోడ్‌లో హోంమంత్రి సుచరిత మాత్రమే జగన్ ఆగ్రహాన్ని చూస్తున్నారు.