BRS Politics : కేసీఆర్ లేకుండానే సాగిపోతున్న తెలంగాణ రాజకీయాలు - కేటీఆర్ ఇక పూర్తి స్థాయి చార్జ్ తీసుకున్నట్లేనా ?
Telangana : కేసీఆర్, కవిత రాజకీయాల నుంచి విరమించుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తిగా కేటీఆర్ మాత్రమే ఒంటరి పోరాటం చేస్తూండటంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఈ అభిప్రాయం ఏర్పడుతోంది.
Did KCR and Kavitha retire from politics : తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఫిజికల్ ప్రజెన్స్ లేకుండా కీలకమైన పరిణామాలు జరిగిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్ అప్పటి నుండి చిన్న ప్రకటన కూడా రీలీజ్ చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన పేరుపై సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభింపచేశారు. కానీ అందులో పోస్టులు పెట్టడం ఆపేశారు. అసలు రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ నేతలకూ ఆయన సలహాలు, సూచనలు ఇస్తున్న సూచనలు కూడా కనిపించడం లేదు. పూర్తిగా కేటీఆర్ మాత్రం ఒంటరిగా పార్టీని లాగుతున్నారు. మధ్యలో హరీష్ కూడా తన వంతు సాయం చేస్తున్నారు. అయితే మొత్తం కేటీఆరే కనిపిస్తున్నారు.
అదిగో ఇదిగో అనే ప్రచారమే కానీ కేసీఆర్ నో యాక్టివ్
కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారన్న ప్రచారం జరిగింది. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయని కారణంగా రైతుల్లో ఉన్న అసంతృప్తిని ఉద్యమంగా మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఒకటి రెండు రోజుల్లో టూర్ షెడ్యూల్ రెడీ అవుతుందని కూడా అన్నారు కానీ రెండు నెలలు గడుస్తున్నా ఆయన బయటకు రాలేదు. వస్తారన్న నమ్మకం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు లేదు. దీనికి కారణం కేటీఆర్ కూడా .. కేసీఆర్ వస్తారని ఉద్యమాలు చేద్దామని చెప్పడం లేదు. ఎవరైనా కేసీఆర్ వస్తే బాగుండనే సహాలిస్తున్నా వెంటనే తుంచేస్తున్నారు. కేసీఆర్ లేని లోటును తీర్చేలా తానే ప్రతీ దానికి ముందు ఉండేలా చురుకుగా వ్యవహరిస్తున్నారు.
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
అత్యంత కీలక పరిణామాల్లోనూ కేసీఆర్ స్పందించకపోవడానికి కారణం ?
తెలంగాణ రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయి. ఒక్కో అంశం హాట్ టాపిక్ అవుతోంది. మొదట రుమమాఫీ అంశంతో బీఆర్ఎస్ ఉద్యమం చేసినంత పని చేసింది. ఈ కారణంగా అందరికీ రుమమాఫీ కాలేదని.. కొంత మందికి పెండింగ్ ఉందని ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల దుమారం రేగింది. అది కేసీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విమర్శలే. అయినా స్పందించలేదు. తర్వాత గ్రూప్ వన్ వివాదం తెరపైకి వచ్చింది. అప్పటికి మూసీ వివాదం రేపిన చిచ్చు అలాగే ఉంది. మరి కొంత కాలం ఈ మూసీ వివాదం ఉంటుంది. అయినా కేసీఆర్ వైపు నుంచి కనీస స్పందనలేదు. పూర్తిగా రాజకీయాలపై కేసీఆర్ ఇప్పుడు వ్యతిరేకతతో ఉన్నారని ఆయన స్పందించడానికి కూడా సిద్ధంగా లేరని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
కేటీఆర్ సామర్థ్యానికి పరీక్ష పెడుతున్నారా?
కేటీఆర్ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అందువల్ల ఆయన రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు ఎదుర్కోలేదు. ఇప్పుడు అసలైన ప్రతిపక్ష నేతగా అనేక సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలి తిని రాటుదేలితేనే రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందన్న ఉద్దేశంతో కేటీఆర్‌కు ఫుల్ చార్జ్ ను కేసీఆర్ అప్పగించారని అంటున్నారు. ఎంతో క్లిష్టమన సందర్భంలో తప్పి.. ఇతర విషయాల్లో కనీసం సలహాలు కూడా ఇవ్వడం లేదని మొత్తం కేటీఆర్ సామర్థ్యానికి వదిలేశారని చెబుతున్నారు. కేటీఆర్ కూడా ఇప్పుడు తనను తాను నిరూపించడానికి ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నారని ..అంటున్నారు. కేసీఆర్, కవిత ఇప్పుడల్లా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే చాన్స్ లేదని అంటున్నారు.