Chiru Politics : ఏపీ సర్కార్‌పై ఊహించని దాడి - చిరంజీవి విమర్శల వెనుక పొలిటికల్ స్కెచ్ ఉందా ?
వ్యూహాత్మకంగానే చిరంజీవి రాజకీయ విమర్శలు ? చిరంజీవిని పవన్ వ్యతిరేకిగా ప్రచారం చేస్తున్న వైసీపీపవన్ కు కారణంగా చిరు సారీలు చెబుతున్నారన్న పోసాని అన్నింటికీ చెక్ పెట్టే వ్యూహమేనా ?
Chiru Politics : మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సూటిగా , సుత్త్తి లేకుండా చేసిన విమర్శలు ఏపీ అధికారపక్షాన్ని ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేశాయి. ఎందుకంటే ఇంత కాలం పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇవ్వడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎక్కువగా చిరంజీవి పేరును కూడా ఉపయోగించుకునేవారు. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు పవన్ వల్ల చిరంజీవి చాలా మందికి సారీ చెబుతున్నారని కూడా ప్రకటించేశారు. పేర్ని నాని.. జగన్ కు.. చిరంజీవికి మధ్య ఎంతో అనుబంధం ఉందని.. ప్రకటించేవారు. ఓ రకంగా ప్రభుత్వానికి .. వైసీపీకి చిరంజీవి మద్దతు దారు అన్న అభిప్రాయాన్ని బలవంతంగా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడా బుడగ పేలిపోయింది. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చురుకుపుట్టించేవిగా ఉండటంతో ఇప్పటి వరకూ తాము చిరంజీవి ఫ్యాన్స్ అన్న వారంతా ఆయనపై విరుచుకుపడటం ప్రారంభించారు.
చిరంజీవి వ్యాఖ్యల వెనుక పొలిటికల్ ప్లాన్ ఉందా ?
చిరంజీవి రాజకీయ వ్యాఖ్యలు చేసి చాలా కాలం అయింది. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చాలా సార్లు ప్రకటించారు. వైసీపీ నేరుగా రాజ్యసభ స్థానం ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారు. బీజేపీ హైకమాండ్.. ప్రధాని మోదీ స్థాయిలో చిరంజీవిని మోటివేట్ చేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ చిరంజీవి తగ్గలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానేరానని చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనికి కారణం ఇటీవల హీరోల రెమ్యూనరేషన్ల విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న రచ్చ మాత్రమే కాకుండా... రాజకీయ వ్యూహం కూడా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి రాజకీయాల్లో లేరు కానీ సందర్భం వచ్చినప్పుడల్లా తమ్ముడుకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు కూడా అదే కోణంలో ఆయన మాట్లాడి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
చిరంజీవి భుజాలపై తుపాకీ పెట్టి జనసేనను కాల్చే ప్రయత్నం నిర్వీర్యం చేశారా ?
ఏపీలో జనసేన పార్టీ గేమ్ ఛేంజర్ గా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన పార్టీని వైసీపీ చాలా తీవ్రంగా టార్గెట్ చేసింది. ఓ ప్రధాన సామాజికవర్గం పూర్తిగా వైసీపీకి దూరం జరుగుతుందన్న భావన పెరిగిపోవడంతో.. అందు కోసం చిరంజీవి తమ శ్రేయోభిలాషి అన్న ప్రస్తావన తీసుకు వస్తున్నరు. ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఘాటుగా విరుచుకుపడుతున్నారు. ఇలా విరుచుకుపడినప్పుడల్లా.. కొంత మంది వైసీపీ నేతలు చిరంజీవి ప్రస్తావన తీసుకు వచ్చి.. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారన్నట్లుగా చెబుతున్నారు. కొంత మందితో పవన్ కల్యాణ్‌కు చిరంజీవి వ్యతిరేకం అన్న స్టేట్‌మెంట్లు కూడా చేయిస్తున్నారు. అంటే చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను అభిమానించేవారి లో చీలిక తీసుకు రావడమే లక్ష్యంగా వైసీపీ చేస్తున్న వ్యూహాన్ని పసిగట్టి చిరంజీవి ఇలా కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు చిరంజీవిపైనా వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తూండటంతో.. వైసీపీ నిర్మించాలనుకున్న ప్రో వైసీపీ మెగాస్టార్ ఇమేజ్ పటాపంచలు అయిందని అంటున్నారు. చిరంజీవితో పాటు జనసైనికులు కూడా కోరుకున్నది ఇదేనని చెబుతున్నారు.
ముందు ముందు మరింత సూటిగా చిరంజీవి రాజకీయం ఉంటుందా ?
చిరంజీవి రాజకీయాలు మానేశారు. కానీ ఓ సినిమలో డైలాగ్ చెప్పినట్లుగా... ఆయన రాజకీయాలకు దూరం అయ్యాను కానీ.. రాజకీయాలు తనకు దూరం కాలేదనే డైలాగ్ ఇక్కడ అన్వయించవచ్చు. చిరంజీవికి ఈ ప్రభుత్వంలో అవమానాలు ఎదురయ్యాయి. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం వెళ్లినప్పుడు సీఎం జగన్‌తో జరిన సంభాషణ.. అక్కడ ఆయన జగన్‌ను పొగుడుతూ దండం పెట్టిన వీడియో సంచలనం అయింది. ఓ మెగాస్టార్ ను సీఎం జగన్ ఇలా అవమానించడం ఏమిటన్న ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. ఈ విషయంలో పవన్ కూడా పలుమార్లు సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో చిరంజీవి ఊహించని షాక్ ఇచ్చారని అంటున్నారు. ఇక ముందు కూడా ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.