Dharmapuri Arvind: ‘నేను అలా అనలేదు, ఈసారి కవితకు మూడో స్థానమే’- ఎంపీ ధర్మపురి అరవింద్
Dharmapuri Arvind: ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.
Dharmapuri Arvind: ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. దాంతో తెలంగాణలో రాజకీయ ప్రకంపన మొదదలైంది. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్ మరో సారి స్పందించారు. సోమవారం ఆయన తన వ్యాఖ్యలపై మీడియాకు వివరణ ఇచ్చారు. తాను ఈవీఎం అనలేదని, బటన్ అనలేదన్నారు. ఓ జర్నలిస్ట్ అన్న మాటలకు నువ్వు ఒక్కడివే ఎవరికైనా ఓటేస్తే నేనే గెలుస్తానని అన్నట్లు చెప్పారు. కొందరు తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తున్నారని మంపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కవిత నిజమాబాద్‌లో పోటీ చేస్తే ముడో స్థానంలో ఉంటందన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, కేసీఆర్ కోటి టన్నుల ధాన్యాన్ని అమ్ముకునేందుకు సిద్దం అవుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రెండున్నర వేల మంది రైసు మిల్లర్లు ఉన్నారని, వారి పొట్ట కొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెయ్యి కోట్ల టర్నోవర్, వంద కోట్ల లాభం ఉంటేనే మిల్లర్లు టెండర్లలో పాల్గొనాలని నిబంధనలు పెట్టారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా కేసీఆర్ నిర్లక్షం వల్లే రాష్ట్రంలో ధాన్యం తడిసి ముద్దయిందన్నారు. కనీసపు మద్దతు ధరకే రైస్ మిల్లర్లు ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులను, రైస్ మిల్లర్లకు కాపాడుకోవాలన్నారు. బ్లాక్ మార్కెట్లో కేటీఆర్ ఆరితేరారని విమర్శించారు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే రైస్ మిల్లర్లన్ని మూతపడుతాయన్నారు.
రైస్ మిల్లులను కాదని ధాన్యమంతా కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకునేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. సమయానికి ధాన్యం ప్రోక్యూర్ మెంట్ చేయలేక నష్టం జరిగిందని, ఫామ్ హౌజ్ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కోటి టన్నుల ధాన్యాన్ని అమ్ముకొని వచ్చే డబ్బులతో ఎన్నికలలో ఖర్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఎన్నికల ఖర్చుల కోసం రూ.40 కోట్లు ఇవ్వాలని చూస్తున్నారని విమర్శించారు. గాదెల్లో ఉన్న బియ్యాన్ని రాబందులు అమ్ముకుంటున్నాయని అన్నారు. రాబందుల కంటే గాదెల కింద పందికొక్కులు నయం అని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం కన్న పందికొక్కులు నయమని ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వివాదం ఏంటంటే
ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తా.. కారు గుర్తుకు ఓటేసినా నేనే గెలుస్తా.. హస్తం గుర్తుకు ఓటేసినా నేనే గెలుస్తా..’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ధర్మపరి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెప్పింది. బీజేపీ గెలుపుపై అనుమానం రేపుతున్నాయని ఇతర పార్టీల నాయకులు విమర్శించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
బీజేపీ నాయకులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో తప్పుడు భావన కలుగుతుందన్నారు. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అర్వింద్ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.