AP Election 2024: రాయలసీమలో నాయకుల బీపీ పెంచుతున్న కొత్త ఓటర్లు
AP Election Percentage 2024 : రాయలసీమలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. గతానికి భిన్నంగా రాయలసీమ పరిధిలోని 8 జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాల్లో సగటున 80 శాతం పైగా పోలింగ్ జరిగింది.
![AP Election 2024: రాయలసీమలో నాయకుల బీపీ పెంచుతున్న కొత్త ఓటర్లు Despite The summer Heat Voting Percentage Increased at Rayalaseema in andhra pradesh elections 2024 AP Election 2024: రాయలసీమలో నాయకుల బీపీ పెంచుతున్న కొత్త ఓటర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/9c7eaa0d54fad5f858ce848f18072de71715999381650798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Assembly Election 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంగ్రామం ముగిసింది. గెలుపుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల నుంచి ఓటర్లు తరలి రావడంతో రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగింది. అయితే ఆశ్చర్యకరంగా రాయలసీమలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. గతానికి భిన్నంగా రాయలసీమ పరిధిలోని 8 జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాల్లో సగటున 80 శాతం పైగా పోలింగ్ జరిగింది. దీంతో రాయలసీమ రాజకీయం రంజుగా మారింది. 2019లో 52 స్థానాలకు గాను 49 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించిన వైసీపీ అదే లెక్కలు కొనసాగిస్తామని చెబుతుండగా, ఈ సారి వైసీపీ కంచుకోటలను బద్దలు కొడతామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
గతం కన్నా ఘనంగా..
వర్గ, ఫాక్షన్ రాజకీయాలకు నిలయమైన రాయలసీమలో నాలుగు దశాబ్దాల ఎన్నికల చరిత్రను గమనిస్తే 1983, 1994, 2004 సంవత్సరాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఏపీ రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో సగటు పోలింగ్ 75 శాతం నమోదైంది. 2019లో పోలింగ్ సగటు 80 శాతానికి చేరుకుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 74.02 శాతం, అనంతపురం జిల్లాలో 79.71 శాతం, కడప జిల్లాలో 76.83 శాతం, చిత్తూరు జిల్లాలో 78.74 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే 2019లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 77.68 శాతం, అనంతపురం జిల్లాలో 81.80, కడప జిల్లాలో 77. 21, చిత్తూరు జిల్లాలో 81.03 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.
చిత్తూరులో రికార్డు స్థాయిలో పోలింగ్
2019 ఎన్నికల్లో ఒక కోటి 18 లక్షల మంది ఓటర్లు ఉండగా 2024 ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య ఒక కోటి 28 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 10 లక్షల మంది కొత్త ఓటర్లుగా చేరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సగటున ప్రతి జిల్లాలో 80 శాతం తక్కువకాకుండా పోలింగ్ జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తిరుపతి జిల్లా పరిధిలో 78.63 శాతం, అనంతపురం 80.53, సత్యసాయి జిల్లాలో 84.82, అన్నమయ్య జిల్లాలో 77.85 శాతం, కడప జిల్లాలో 79.57 శాతం, కర్నూలు జిల్లా 76.42 శాతం, నంద్యాల జిల్లా 83.09 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రాష్ట్రంలోనే ఎక్కువగా 20.54 లక్షల ఓటర్లు కలిగిన ప్రస్తుత అనంతపురం జిల్లాలో 80 శాతంపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రస్తుత చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయిలో 87.09 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోటెత్తిన పట్టణ ఓటర్లు
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా కనిపించేది. సగటున గ్రామీణ ప్రాంతాల్లో 65 శాతం నుంచి 70 శాతం వరకు, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం నుంచి 65 శాతం వరకు పోలింగ్ జరిగేది. కానీ ఈ సారి పట్టణ ఓటర్లు గ్రామీణ ఓటర్లతో పోటీ పడి ఓట్లు వేశారు. ఉదయం తొలి రెండు గంటల్లో 20 శాతం నుంచి 25 శాతం, మధ్యాహ్నానికి 40 శాతం పోలింగ్ పూర్తయింది. సాయంత్రానికి అన్ని జిల్లాల్లో 50 శాతం పైగా చొప్పున పోలింగ్ నమోదైంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా యువకులు, వృద్ధులు, మహిళలు ఓటు వేయడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లలో బారులు తీరి కనిపించారు.
జూన్ 4న తేలనున్న భవితవ్యం
సాధారణంగా అధికార పార్టీపై వ్యతిరేకత ఎక్కువైనప్పుడు ఈ తరహాలో ఓట్ల శాతం పెరుగుతుందనే వాదన ఉంది. ఇది ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉంటుందనేది రాజకీయ పండితుల అంచనా. ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని, తమకు ఓటు వేయాలని అధికార పక్షం కోరగా, అభివృద్ధిని పట్టించుకోకుండా కక్షపూరిత చర్యలకు పాల్పడిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్షాలు కోరాయి. దీంతో ఇరు పార్టీ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. ఈ నేపథ్యంలో గణనీయంగా పెరిగిన ఓటర్ల సంఖ్య, ఆసక్తికరంగా మారింది. ఏ రాజకీయ పక్షానికి మేలు చేకూరుస్తుందనే అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్ మహాశయులు ఎవరిని గెలిపించారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.
Also Read: ఐపీఎల్‌ను డామినేట్ చేస్తున్న ఎలక్షన్ బెట్టింగ్ - సర్వేల మాయలు అందులో భాగమేనా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)