జీవో నెం. 1 వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
ఏపీలో రోడ్లపై ర్యాలీలు, సభలను నిషేధిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీలో రోడ్లపై ర్యాలీలు, సభలను నిషేధిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా జగన్ తీసుకున్న ఈనిర్ణయం వారి రాకను అడ్డుకునేందుకేనా..ఈ నిషేధం వెనక ఉన్న రాజకీయ కోణం ఇదేనా అన్న చర్చ మొదలైంది.
ఎప్పుడూ లేనిది ఈసారి టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన ర్యాలీలు, సభలు ప్రాణాలు తీస్తున్నాయి. గతంలోనూ ఆయన ఎన్నోసార్లు ప్రజల మధ్యకు వచ్చారు. భారీ సభలు, సమావేశాలు పెట్టారు. అయితే ఇంతకుముందు ఇలా జరగలేదు. ఈసారి మాత్రం ఊహించని విధంగా టిడిపి నిర్వహించిన సభలు, ర్యాలీలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయన్న అపవాదుని మెడలో వేసుకున్నాయి. కందుకూరు, గుంటూరుల్లో జరిగిన తొక్కిసలాటతో 11మందికి పైగా చనిపోవడంతో రాజకీయ దుమారం మొదలైంది.
జగన్ సర్కార్ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని నేతలు ఆరోపించారు. అయితే ఈ వాదనను ప్రభుత్వం ఖండిస్తోంది. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. అంతేకాదు ప్రత్యేక కారణాలతో పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకొని సభలు, ర్యాలీలు చేసుకోవచ్చని కూడా స్పష్టం చేస్తోంది.
అయితే విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వ నిర్ణయం వెనక రాజకీయ కుట్ర ఉందా అన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. త్వరలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీన్ని అడ్డుకోవడానికే జగన్ సర్కార్ ఈనిర్ణయం తీసుకుందని టిడిపి శ్రేణులు, ఆపార్టీ సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహి వాహనంలో యాత్రకి సిద్ధమవుతున్నారు.
ముందస్తు ఎన్నికలుంటాయన్న వార్తల నేపథ్యంలో విపక్షాలు యాక్టివ్ అయ్యాయి. ప్రజాసమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు టిడిపి పాదయాత్రలు, జనసేన రథయాత్రలతో ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం అత్యవసరంగా ఈ జోవోని తీసుకువచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.
రాజకీయ సభల్లో వరుసగా సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటనకు కారణాలు అన్వేషణ చేయాలి
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) January 3, 2023
ఈ తరహా సంఘటనలు జరగకుండా చేయడానికి అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు ఏమిటి?
- బిజెపి రాష్ట్రాధ్యక్షులు శ్రీ @somuveerraju గారు
(2/2)
ఇంతకుముందు ప్రజాసమస్యలపై గళమెత్తితే దాడులు చేయడం, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిందని ఇప్పుడు ప్రజల మధ్యన ఉండేందుకు ప్రయత్నిస్తుంటే ర్యాలీలు, సభలపై నిషేధం విధించి ప్రతిపక్షాల ఊసు లేకుండా చేయాలన్న కక్షతో జగన్ ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు ఈ జోవోని వ్యతిరేకిస్తూ కోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్ల టైమ్ ఉంది. అయితే ప్రతిపక్షాలన్నీ ముందస్తుగానే ఎన్నికల ప్రచారంలోకి దిగడంతో ఏ జిల్లా చూసినా..ఏ సెంటర్ చూసినా పార్టీల సభలు, ర్యాలీలు సమావేశాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ప్రజలతోపాటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం మంచిదేనన్న టాక్ వైసీపీ సానుభూతిపరులది.