TPCC Chief : టీపీసీసీ చీప్ నియామకంలో రేవంత్ పంతం నెగ్గినట్లే - మహేష్ కుమార్ గౌడ్‌కే కిరీటం !?
Telangana : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి మహేష్ కుమార్ గౌడ్‌కు ఖరారయినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తనకు ఏ మాత్రం అడ్డం పడని నేత టీ పీసీసీ చీఫ్ గా ఉండాని రేవంత్ కోరుకున్నారని అంటున్నారు.
Mahesh Kumar Goud New PCC Chief : తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఎవరు అన్న సస్పెన్స్‌కు తెర పడిందని అధికారిక ప్రకటన రావడమే మిగిలిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేశారని ఇప్పటికే మీడియాకు లీకులు ఇచ్చారు. మధుయాష్కీ గౌడ్ పేరును చివరి వరకూ పరిశీలన జరిపిన ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో అడిగిన చోట టిక్కెట్ ఇచ్చినా ఓడిపోయారని.. వరుసగా ఓడిపోతున్న నేను చీఫ్‌గా చేయడం మంచిది కాదన్న అభిప్రాయంతో వెక్కి తగ్గారని తెలుస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గినట్లుగా చెబుతున్నారు.
మధుయాష్కీ అయితే రేవంత్‌కు ఇబ్బందులు సృష్టించే అవకాశం
టీ పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఇబ్బందులు సృష్టించకుండా.. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండేలా కొత్త చీఫ్ ను నియమించుకోవాలని ప్రయత్నించారు. హైకామండ్ సామాజిక సమీకరణాలను పరిశీలించిన తర్వాత బీసీ వర్గానికి చాన్స్ ఇవ్వాలని డిసైడయ్యారు. ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ పేర్లు తుది వరకూ రేసులో ఉన్నాయి. మధు యాష్కీ టీ పీసీసీ చీఫ్ పదవి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన రాహల్ గాంధీకి సన్నిహితులు. ఆ వైపు నుంచి ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గినట్లుగా చెబుతున్నారు. మధుయాష్కీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉండటం వల్లే ఆయన విషయంలో రేవంత్ వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా భావిస్తున్నారు.
రేవంత్ విధేయుడు మహేష్ కుమార్ గౌడ్
మహేష్ కుమార్ గౌడ్ .. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆయన మాస్ లీడర్ గా గుర్తింపు పొందలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది కూడా లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి విధేయుడు కూడా. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా పార్టీ వ్యూహాల్ని మార్చేయగలరు. అందుకే రేవంత్.. పీసీసీ చీఫ్ గా తాను ఉన్నా.. మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా ఒక్కటేనని భావించి ఆయనకు మద్దతు పలికారని భావిస్తున్నారు.
మంత్రి పదవుల భర్తీ కూడా !
తెలంగాణ మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల భర్తీపై కూడా రేవంత్ రెడ్డి క్లారిటీకి వచ్చారని అంటున్నారు. రెండు పదవులు రెడ్డి సామాజికవర్గానికి మిగతా నాలుగు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వాలని అనుకుంటున్నారు. మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్యే లేరు. కానీ.. ఇటీవ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన అమీర్ అలీఖాన్ ఉన్నారు. ఆయనకే పదవి దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.