Krishna News: బెజవాడలో పోటీపడుతున్న సొంత అన్నదమ్ములు - ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు
Krishna News; ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు.
Krishna News: తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఫలితం ఏదైనా ఉందంటే అది విజయవాడే(Vijayawada).. ఎందుకంటే ఇక్కడ పోటీపడుతున్నది సొంతం అన్నదమ్ములే కావడం విశేషం. తెలుగుదేశం(TDP) సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) వైసీపీ(YCP)లో చేరి విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలవగా... ఆయన సొంత తమ్ముడు కేశినేని శివనాథ్( చిన్ని) తెలుగుదేశం నుంచి బరిలోకి దిగారు.
అన్నదమ్ముల మధ్య ఉన్న కుటుంబ కలహాలు కాస్త పెరిగి పెద్దవై రాజకీయంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే అర్థికంగా ఇద్దరూ గట్టి అభ్యర్థులే కావడంతో... ఇక్కడ పోటీ ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో కేశినేని నాని సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.81 కోట్లు కాగా.. అప్పులు కూడా అదేస్థాయిలో ఉండటం విశేషం. ఆయన మొత్తం అప్పు రూ.75 కోట్ల వరకు ఉంది. ఆయనకు బస్సులు, మినీ బస్సులతో పాటు కార్లు చాలా ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు వాహనాల విలువ అన్నీ కలిపి రూ.13.5 కోట్ల విలువ ఉంది. తెలంగాణ(Telanagna)లోని సంగారెడ్డి జిల్లాలో 40 ఎకరాల వ్యవసాయ భూమి, నందిగామలో మరో 12 ఎకరాల పొలం ఉంది. వీటి విలువ రూ.పది కోట్లకు పైగా ఉండగా... విజయవాడలో మరో రూ.21 కోట్ల విలువైన స్థలాలు ఉన్నాయి. విజయవాడలో మరో రూ.30 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలోని ఉన్న ఇళ్ల విలువ మరో రూ.7 కోట్లు ఉంది. చరాస్తుల విలువే రూ.68 కోట్ల వరకు ఉందని నాని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు రూ.52 కోట్లు ఉంది. వివిధ ఫైనాన్స్ సంస్థలకు చెల్లించాల్సిన సొమ్ము మరో రూ.24 కోట్ల వరకు ఉంది.
కేశినాని నానిపై పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) తొలిసారి ఎన్నికల బరిలో దిగుతుండటంతో...ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు ఏవీ తెలియకపోయినా.. ఇంచుమించు ఇంతే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా(Krishna) విషయానికి వస్తే ఈసారి అత్యంత ఎక్కువ ధనప్రభావం కనిపించే నియోజకవర్గం గన్నవరమే(Gannavaram). ఎందుకంటే ఇక్కడ ఎన్నికలను అభ్యర్థులే గాక....పార్టీ అధినేతలు సైతం సీరియస్‌గా తీసుకోవడమే. తెలుగుదేశంలో గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) వైసీపీ తరఫున బరిలో దిగుతుండగా... ఆయనపై గత ఎన్నికల్లో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatrao) తెలుగుదేశంలో చేరి సీటు సంపాదించారు. ఇక్కడ ఇద్దరూ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండటంతో... డబ్బులు ఏరులై పారే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ ఆస్తుల విషయానికి వస్తే... మొత్తం ఆస్తి విలువ రూ.84 కోట్లు ఉండగా....అప్పులు రూ.23 కోట్లుగా ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, బంగారం, కార్ల విలువ అన్నీ కలిపి రూ.ఐదున్నర కోట్ల విలువ ఉంటే.. తెలంగాణ,ఏపీలో కలిపి 55 ఎకరాల పొలం, వ్యవసాయేత భూమి కలిపి రూ.80 కోట్ల విలువ ఉంది. వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పుడు ఆరున్నర కోట్లు ఉండగా.. మరో రూ.17 కోట్లు ట్యాక్స్ రూపంలో కట్టాల్సి ఉంది.
వంశీపై పోటీకి దిగిన యార్లగడ్ల వెంకట్రావుకు సైతం దాదాపు అదే స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.84 కోట్ల ఉండగా... అప్పులు రెండున్నర కోట్లు వరకు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఉన్న డబ్బు, బాండ్ల విలువ కలిపి రూ.3 కోట్లు ఉండగా... బ్యాంకుల నుంచి తీసుకున్న పర్సనల్ లోన్ మరో రూ.7 కోట్ల వరకు ఉంది. అలాగే 8 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి ఆభరణాలు విలువరూ. 4 కోట్ల వరకు ఉంటుంది. మొత్తం చరాస్తుల విలువ రూ.14 కోట్లుగా ఉంది. వ్యవసాయ భూమి 40 ఎకరాలు ఉండగా.. దీని విలువ రూ.8 కోట్లు ఉంది. వివిధ ప్లాట్ల విలువ మరో రూ.5 కోట్లు ఉండగా...కమర్షియల్ బిల్డింగ్‌ల విలువ మరో రూ.28 కోట్లు ఉంది. విజయవాడలో ఆరు ఇళ్లు, గన్నవరం ఒకటి, అమెరికాలోని టెక్సాస్‌లో మరో ఇల్లు ఉంది. వీటన్నిటి విలువ మరో 30 కోట్లు వరకు ఉంది. అలాగే వివిధ బ్యాంకుల నుంచి వెంకట్రావు తీసుకున్న అప్పు 2 కోట్ల 48 లక్షల వరకు ఉంది.
మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)కి కేవలం కోటీ 20 లక్షల ఆస్తి ఉండగా... అప్పులు రూ.15 లక్షల వరకు ఉన్నాయి. ఇక జోగి రమేశ్(Jogi Ramesh) ఆస్తి కేవలం కోటి రూపాయల లోపే ఉండగా... అప్పులు ఏమీ లేవు. విజయవాడ తూర్పు నుంచి పోటీలో ఉన్న దేవినేని అవినాష్(Devineni Avinash)కు దాదాపు రూ.40 కోట్ల ఆస్తులు ఉండగా... రూ.20 కోట్ల అప్పు ఉంది.