ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్న సీఎం జగన్
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎంపికకు సంబంధించిన అంశాలపై ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
ఎమ్మెల్సీ స్థానాలను బారీగా భర్తీ చేయనున్న వేళ ఎన్నికల ముందు జరిగే కీలక పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఆశావాహులకు ఇదే ఫైనల్ అవకాశం కావటంతో ఎక్కువ మంది ఆత్రుతగా చూస్తున్నారు. జిల్లాల వారీగా, సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తూ అభ్యర్థుల ఎంపిక జరగనుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించారు. టీచర్ కోటలో రామచంద్రా రెడ్డి, పర్వత చంద్ర శేఖర్ రెడ్డి, పేర్లు ఖారారు కాగా, గ్రాడ్యుయేట్ కోటాలో సుధాకర్ , శ్యాం ప్రసాద్ రెడ్డి, వెన్నపూస రవీంద్ర రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక మిగిలింది స్థానిక సంస్థల కోటలో అభ్యర్థులపైనే అందరి దృష్టి ఉంది. తాజాగా వైసీపీలో చేరిన జయమంగళ వెంకటరమణకు స్థానిక సంస్థల కోటలో హామీ లభించిందని చెబుతున్నారు. అలాగే మొన్న కలిసిన కుడిపూడి సూర్యనారాయణకు కూడా ఖరారు అయ్యిందని అంటున్నారు.
మొత్తంగా 14 స్థానాల్లో 3 గ్రాడ్యుయేట్ 2 టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా మిగిలిన 9 స్థానిక సంస్థలు స్థానాలకు ఇద్దరు ఖరారు అయ్యారు. దీంతో మిగిలిన ఏడుగురు అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాళ్లు ఎవరేనే అంశంపై చర్చ నడుసస్తోంది. వీటిపై చాలా మంది ఆశలు పెట్టుకొని ఉన్నారు.
వీరికేనా ఛాన్స్.....
స్థానిక సంస్థలకు సంబంధించిన కోటాలో రామసుబ్బారెడ్డి, యార్లగడ్డ వెంకట్రావ్, వంకా రవీంద్ర, మర్రి రాజశేఖర్, నవీన్ నిశ్చల్, జయమంగళ వెంకటరమణ, కుడిపూడి సూర్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో యార్లగడ్డ వెంకటరావు, మర్రి రాజశేఖర్ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు, అది కూడా కృష్ణా,గుంటూరు జిల్లాలకు చెందిన వారు.
యార్ల గడ్డ వెంకటరావు, స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విభేదిస్తున్నారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి కూల్ చేయాలని చూస్తున్నారు. అటు రాజశేఖర్‌కి కూడా జిల్లాలో ఉన్న మంత్రి విడుదల రజనీకి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా రజనీ అన్ని విధాలుగా అడ్డు పడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. యార్ల గడ్డ వెంకటరావు టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. అది వాస్తవం అయితే, ఆయనకు ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఈ సారి కూడ బీసీలేనా....
ఎమ్మెల్సీ స్థానాల పంపిణిలో కూడా మరోసారి జగన్ మార్క్ ఉంటుందని కూడా పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే రాజ్యసభ వ్యవహరంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నడూలేని రీతిలో నలుగురు బీసీలకు రాజ్యసభకు పంపి జగన్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు కూడా ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ఎమ్మెల్సీల పదవులు కూడా కులాల వారీగా అధిక ప్రాధాన్యత ఉంటుందని, విధేయతతో ఉన్న వారికి కూడా అశకాశం ఇస్తారని అంటున్నారు.
కమ్మ సామాజిక వర్గంపై ఇప్పటికే పార్టీలో భిన్న అభిప్రాయం ఉంది. రెండు స్దానాలను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని ప్రతిపాదనలు రావటంతో, అక్కడే అసలు కీలక చర్చ జరుగుతుందని అంటున్నారు. జగన్ ఈ అంశాలపైనే పార్టీలోని కీలక నేతలతో సమావేశం నిర్వహించి ఫైనల్ జాబితాను ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.