Pawan Kalyan : పర్యావరణాన్ని రక్షించేందుకు పవన్ పిలుపు - జగన్‌ను ఇరాకాటంలో పెట్టేలా ట్వీట్లు !
పర్యావరణం విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న పర్యావరణ విధ్వంసం వివరాలు బయటపెడదామని పిలుపునిచ్చారు.
Pawan Kalyan : పర్యావరణాన్ని పరిరక్షిస్తామని విశాఖలో సీఎం జగన్ ప్రకటించారు. అప్పటికప్పుడు ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశంపై జనసేనాధిత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన మూల సిద్దాంతాల్లో ఒకటి పర్యావరణ పరిరక్షణ అని ప్రభుత్వానికి ఇప్పటికైనా ఈ అంశంపై శ్రద్ధ కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఇప్పటికైనా పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్న మైనింగ్, ఫార్మా, సిమెంట్ , రసాయన కంపెనీల కాలుష్యాన్ని బయటకు తీద్దామని పిలుపునిచ్చారు. అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని హరిస్తున్న ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా వెలుగులోకి తెద్దామని ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.
1) రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలి (cont..)
— Pawan Kalyan (@PawanKalyan) August 27, 2022
కాలుష్య కారక పారిశ్రామిక సంస్థల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన ప్రజాభిప్రాయసేకరమను.. ప్రభుత్వం పోలీసుల్ని పెట్టి ఏకపక్షంగా నిర్వహిస్తోందని.. ఇలాంటి వాటిని కూడా వెల్లడించే సమయం వచ్చిందని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో..లేదోనని పవన్ కల్యాణ్ సందేహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ట్వీట్లు పర్యావరణం విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవిగా ఉన్నాయి. ప్రధానంగా గత మూడేళ్లుగా ఏపీలో అనేక రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయి. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ అంశాన్నే టార్గెట్ చే్సతూ.. మైనింగ్, ఫార్మా , సిమెంట్ , రసాయన పరిశ్రమల కాలుష్యం గురించి బయటకు తేవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసినట్లుగా భావిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ కాలుష్యంపై అనేక ఆరోపణలు విపక్షాలు చేస్తూ ఉంటాయి.
6) cont..మన జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి చెబుతూ రాష్ట్రంలో ఉన్న ఈ కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థలు వాటి మూలంగా కలుగుతున్న హానిని ప్రజా క్షేత్రంలో వెల్లడిద్దాం.
— Pawan Kalyan (@PawanKalyan) August 27, 2022
(పవన్ కళ్యాణ్)
అదే సమయంలో పర్యావరణ విషయంలో ఏపీ ప్రభుత్వంపై అతి పెద్ద మరక.. రుషికొండ రూపంలో ఉంది. అందమైన రుషికొండను పూర్తిగా తొలిచేసి.. అక్కడ టూరిజం ప్రాజెక్టును కడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పును సైతం పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని.. లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను కూడా తవ్వుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కాలుష్యంపై స్పందించి.. పర్యావరణంపై కీలకమైన ప్రకటనలు చేసినందున ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఇదే సరైన సమయంగా పవన్ కల్యాణ్ భావించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.