Jagan Delhi Tour : ఆ భేటీకి జగన్ దూరం - ఢిల్లీ వెళ్లినా గైర్హాజర్‌కే నిర్ణయం ! బీజేపీకి దూరమని సంకేతాలా ?
అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి సీఎం జగన్ హాజరు కావడం లేదు. సమావేశం అయిపోయిన తర్వాత ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు.
Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. అయితే "అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ" సమావేశంలో పాల్గొనడం లేదు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగే ఈ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. కమిటీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా పాల్గొనాల్సి ఉంది. పాల్గొంటారని కూడా అనుకున్నారు. కానీ ఆ సమావేశానికి డుమ్మా కొట్టాలన్న ఉద్దేశంతో ఆలస్యంగా ఢిల్లీ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి ముర్ముతో చంద్రబాబు భేటీ అవుతారు. సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నేతృత్వంలో జరిగే.. ఆజాదీకా మహోత్సవ్ కమిటీ భేటీలో పాల్గొననున్నారు.
"అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ" మీటింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీకి జగన్
ఈ సమావేశంలో జగన్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. ఆయన ఢిల్లీకి ఆలస్యంగా చేరుకోవాలని నిర్ణయించారు. రాత్రి 7:30 గంటలకు ఢిల్లీకి జగన్ చేరుకుంటారు. 7న రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ నిర్వహించే.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. "అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ" భేటీకి హాజరు కావడం లేదు. స్వయంగా ప్రధానమంత్రి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి జగన్ డుమ్మా కొట్టాలని అనుకోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే అది సీఎం స్థాయి నేత పాల్గొనాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ప్రతినిధులు పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీకి వైఎస్ఆర్‌సీపీ దూరం జరుగుతోందా ?
మామూలుగా అయితే ఢిల్లీలో పర్యటనలో మోదీతో సమావేశం తర్వాత ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని అనుకున్నారు. కానీ మోదీతో భేటీపై కూడా ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీలోనే ఉంటారో.. తాడేపల్లి తిరిగి వస్తారో అధికారిక సమాచారం లేదు. ఇటీవలి కాలంలో బీజేపీపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలు వైఎస్ఆర్‌సీపీ నేతల విధానాలను వ్యతిరేకిస్తున్నారు. అమరావతికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు.
మోదీతో జగన్ భేటీ ఉంటుందా ?
బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఉన్న దగ్గరి తనం ఇటీవలి కాలంలో దూరంగా మారుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ కూడా ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు చేస్తూండటం.. విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో బయట కూడా కేంద్రం తీరును ప్రశ్నిస్తూండటంతో బీజేపీతో వైఎస్ఆర్‌సీపీ దూరం జరిగే ప్రయత్నం చేస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.