Chiru Modi Bonding : మోదీ ఆత్మీయతకు చిరంజీవి ఫిదా ! రాజకీయం మారే చాన్స్ ఉందా ?
మోదీ చూపించిన ఆత్మీయతకు చిరంజీవి ఫిదా అయ్యారు. రాజకీయంలో రానున్న మార్పులకు ఈ కార్యక్రమం పునాది కానుందా ?
Chiru Modi Bonding : అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరిగుతోందని అందరికీ అహ్వానాలు పంపామని ప్రచారం చే్శారు కానీ చివరికి బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ ప్రతినిధులు తప్ప ఎవరూ కనిపించలేదు. అయితే చిరంజీవి మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన ఏ పార్టీకి చెందిన వారు కాదు. ప్రత్యక్ష రాజకీాయల్లో లేనని గతంలోనే ప్రకటించారు. సోదరుడి పార్టీ జనసేనకు కూడా ఆయన ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతు తెలియచేయలేదు. ఆ సభలో మోదీ చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యం మాత్రం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
చిరంజీవితో ఆత్మీయంగా మాట్లాడిన మోదీ !
అల్లూరి విగ్రహావిష్కరణ సభలో మోదీని చిరంజీవి సన్మానించారు.ఈ సందర్భంగా మోదీ ఓ నిమిషం పాటు చిరంజీవితో ఆత్మీయంగా సంభాషించారు. ఈ సంభాషణ సభకు వచ్చిన వారితో పాటు టీవీల్లో చూస్తున్న వారికి కూడా ఆసక్తి కలిగించింది. బాగా పరిచయమున్న వారిలో మాట్లాడుకోవడమే దీనికి కారణం. మోదీతో చిరంజీవికి ఇంత సాన్నిహిత్యం ఉందా అని కొంత మంది ఆశ్చర్యపోయారు. కార్యక్రమం అసాంతం.. చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇతర పార్టీలకు ఆహ్వానాలు..కానీ నో ఎంట్రీ !
బీజేపీకి మిత్రపక్షమైన జనసేన కానీ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాని హాజరు కాలేదు. అలాగే టీడీపీ ప్రతినిధిగా హాజరు కావాల్సిన అచ్చెన్నాయుడు కూడా హాజరు కాలేదు. ఆహ్వానం ఉన్నా తమ దగ్గర లిస్ట్ లో లేదని జిల్లా కలెక్టర్ చెప్పడంతో ఆయన రాలేకపోయారు. లిస్ట్‌లో ఎక్కడా అచ్చెన్నాయుడు పేరు లేదు. పిలిచి అవమానించడం సరైంది కాదని అచ్చెన్నాయుడు అధికారపార్టీపై విమర్శలు చేశారు. ఈ వేడుకకు చిరంజీవిని ఎందుకు ఆహ్వానించారు అన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన కేంద్రపర్యాటక మంత్రిగా పనిచేశారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే తమ్ముడికి చెక్ పెట్టేందుకే అధికారపార్టీ అన్నయ్యని పిలిచిందన్న టాక్స్ నడుస్తున్నాయి. చిరంజీవితో ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరించడంతో ఈ వాదనలకు మరింత బలాన్నిచ్చినట్లయిందంటున్నారు.
రాజకీయ సమీకరణాలు ఉన్నాయా ?
ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం కాబట్టి చిరంజీవి కాదనలేరు. రాజకీయాల్లోనూ లేరు కాబట్టి మొహమాటలు కూడా ఉండవు. అందుకే వెళ్లారు. అయితే ఆయన వెళ్లినప్పటి నుండి రాజకీయ చర్చలు ప్రారంభమయ్యాయి. గతంలో ఓ సారి చిరంజీవి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. చిరంజీవిని బీజేపీకి రాజ్యసభకు పంపేందుకు సిద్ధంగా ఉందని కూడా చెప్పుకున్నారు. అయితే అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చలొస్తున్నాయి. అయితే ఓ సారి రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తిన్న చిరంజీవి మరోసారి మోదీ ఆత్మీయ పలకరింపులకు మనసు మార్చుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది.