No Special Status : ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయయే - జగన్ విజ్ఞప్తులు పట్టించుకోవడం లేదని తేల్చేసిన కేంద్రం !
ఏపీ ప్రత్యేకహోదాపై జగన్ విజ్ఞప్తులను తాము పట్టించుకోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయమని తెలిపింది.
No Special Status : ఏపీ సీఎం జగన్ ఎప్పుడు కలిసినా ప్రధాని మోదీని ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతూనే ఉన్నారు. ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు కూడా ఇచ్చిన వినతి పత్రంలో ప్రత్యేకహోదా ఉంది. అయితే కేంద్రం మాత్రం సీఎం జగన్ వినతుల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎప్పుడు పార్లమెంట్‌లో సమాధానం చెప్పాల్సి వచ్చినా ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని చెబుతూనే ఉంది. మరోసారి అదే ప్రకటన చేసింది.
విభజన హామీలపై పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు ప్రశ్న
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదని తెలిపారు. పన్నుల్లో వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు.15వ ఆర్థిక సంఘం కూడా అదే తరహాలో సిఫార్సులు చేసిందన్నారు. ఆ తర్వాత 41 శాతానికి సర్దుబాటు చేసిందని వెల్లడించారు.
ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అన్న కేంద్ర మంత్రి
పన్నుల్లో వాటా, లోటు నిధుల సర్ధుబాటు ద్వారా రెవెన్యూ లోటును సర్ధుబాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు, విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు.
విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు.
ఏపీలో ప్రత్యేకహోదా చుట్టూ రాజకీయాలు
ప్రత్యేకహోదా అంశంపై కేంద్రం మొదటి నుంచి ఇదే సమాధానం చెబుతోంది. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు మాత్రం ప్రత్యేకహోదా అంశాన్ని సజీవంగానే ఉంచుతున్నాయి. అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎవరు ఉన్నా మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకు వస్తామని సీఎం జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే కేంద్రానికి తమ అవసరం లేనందున డిమాండ్ చేయలేమని.. కానీ ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామన్నారు. ఇటీవ ల రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఎన్డీఏకు అవసరమైన సందర్భంలో పలువురు ప్రత్యేకహోదాను షరతుగా పెట్టాలని సూచించారు. అయితే వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు పట్టించుకోలేదు.