Khammam Congress : ఖమ్మంలో హస్తానికి ఓవర్ లోడ్ సమస్య ! - బీఆర్ఎస్ మైనస్ కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందా ?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుసగా చేరుతున్న నేతలకు కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేయగలదా ? మూడు సీట్లు మాత్రమే జనరల్ కావడంతో అనేక సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
![Khammam Congress : ఖమ్మంలో హస్తానికి ఓవర్ లోడ్ సమస్య ! - బీఆర్ఎస్ మైనస్ కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందా ? Can the Congress adjust the seats for the successive leaders joining the joint Khammam district? Khammam Congress : ఖమ్మంలో హస్తానికి ఓవర్ లోడ్ సమస్య ! - బీఆర్ఎస్ మైనస్ కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/f1cad5d38d9d4c1f91242f411db0767c1693672123036228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Khammam Congress : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్కరిగా కారు దిగుతున్న నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరగడంతో పాటు, కొత్త తలనొప్పులూ వచ్చి పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో పది స్థానాలు ఉన్నప్పటికీ జనరల్ స్థానాలు మాత్రం కేవలం మూడు మాత్రమే. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానాలు. కీలక నేతలంతా ఈ మూడు స్థానాల కోసమే పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రేపోమాపో చేరుతారని భావిస్తున్న జలగం వెంకట్రావు, అలాగే పార్టీని విలీనం చేయాలనుకుంటున్న షర్మిల… ఇలా అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు అన్ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు.
పాలేరు సీటు కోసం పోటాపోటీ !
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పాలేరు ముందంజలో ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌లో చేరబోతున్న షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తి చూపుతున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం పాలేరు సీటుకే దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం లేదా పాలేరు నుంచి పోటీ చేయాలని పొంగులేటి అనుచరుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ‘పోయిన చోటే వెతుక్కోవాలనే’ కోణంలో తుమ్మల నాగేశ్వరరావు గత ఎన్నికల్లో ఓడిన పాలేరు నుంచే గెలిచి తన సత్తా ఏంటో చూపించుకోవాలని భావిస్తున్నారు. ఇక షర్మిల సైతం ‘మట్టి పట్టుకొని పాలేరు నుంచి పోటీ చేస్తానని’ ప్రమాణం చేసి ఉన్నారు. కాబట్టి ఆమె కూడా చేరాలన్నా.. పాలేరు సీటునే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు పోటీకొస్తే పాలేరు నుంచి బరిలో నిలవాలన్న యోచనలో పొంగులేటి ఉన్నారు.
ఇప్పటిదాకా పని చేసుకున్న నేతల అసంతృప్తి
పాలేరు , కొత్త గూడెం వంటి చోట్ల పోటీ చేయడానికి కాంగ్రెస్ నేతలు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముని కుమారుడు చరణ్ రెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, బెల్లం శ్రీనివాస్, రామసహాయం మాధవీ రెడ్డి వంటి నేతలు పని చేసుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలతో వీరందరికీ మొండిచేయి ఎదురయ్యే పరిస్థితి కనబడుతోంది. ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితేనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు దీటైన పోటీ ఇస్తారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పోటీ చేస్తే మంచిదని భావిస్తున్నారు. పాలేరులో రెడ్డి సామాజికవర్గ సీటుగా భావిస్తూ ఉంటారు.
కొత్తగూడెం లోనూ అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ !
కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశమూ చేశారు. ‘గడపగడపకు శీనన్న’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జలగం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లి సందిగ్ధత ఏర్పడుతోంది. వీరిద్దరిలో ఎవరైనా పాత కాంగ్రెస్ నేతలకు ఇక్కడ కూడా చేదు అనుభవం తప్పట్లేదు. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీపీసీసీ కార్యదర్శి ఎడవల్లి కృష్ణ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. అయినా ఇబ్బందికరమే. కాంగ్రెస్ లో ఇది అసంతృప్తికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)