CBI KCR : ఆ మార్గాల్లో వస్తే సీబీఐని కేసీఆర్ కూడా అడ్డుకోలేరు - జీవో నెం.51 పవర్ ఎంత అంటే ?
జీవో నెంబర్ 51తో తెలంగాణ సర్కార్ సీబీఐని నియంత్రించగలదా ? ఆ జీవోకు అంత పవర్ ఉందా ?
CBI KCR : సీబీఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. దర్యాప్తు కోసం సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని జారీచేసింది. ఇక ఏ కేసులోనైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. జీవో 51 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలాంటి జీవో జారీ చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత సీఎం జగన్ ఎత్తేశారు. ఇప్పుడు కేసీఆర్ ఈ జీవో జారీ చేశారు. ఈ జీవో ఇక సీబీఐ తెలంగాణలో అడుగు పెట్టలేదా.. అంటే.. పూర్తి స్థాయిలో అడ్డుకునే చాన్స్ లేదని చెప్పవచ్చు.
జీవో నెం.51 ప్రకారం తెలంగాణ ప్రభుత్వ అనుమతితోనే సీబీఐ విచారణలు!
ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు, 63కుపైగా కేంద్ర చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం ఢిల్లీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు. ఇందు కోసం రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సీబీఐ తమ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయడానికి గతంలో సాధారణ సమ్మతి ఇచ్చి, తర్వాత కాలంలో వాటికి రద్దు చేసి నో ఎంట్రీ చెప్పిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఈ జీవో ప్రకారం సీబీఐకి ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో అవినీతి జరిగిందని సమాచారం అందితే... కేసు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఫలానా కేసులో ఫలానా దర్యాప్తు చేసి వివరాలు సేకరించామని, తదుపరి విచారణకు ముందుకెళ్లాలంటే అనుమతి ఇవ్వాలని ప్రతి కేసులో సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వీటన్నింటిపై సీబీఐ కేసులు నమోదు చేయాలంటే ప్రతి కేసుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.
కోర్టు అనుమతిస్తే ప్రభుత్వ అనుమతి అవసరం లేదు !
దేశ రాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు ఇందుకు ఎప్పటికప్పుడు సమ్మతి నోటిఫికేషన్‌లు ఇస్తుంటాయి. సమ్మతి నోటిఫికేషన్ ప్రకారం... ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ తనిఖీలు, దర్యాప్తులు చేయవచ్చు. జనరల్ కన్సెంట్ రద్దు చేస్తే రాష్ట్రంలో సీబీఐ కేసులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగాల్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లు తమ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సాధారణ సమ్మతి ఉత్తర్వుల్ని ఉపసంహరించుకున్నాయి. రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడం ఆపలేరు. కోర్టులు ఆదేశిస్తే... దర్యాప్తు చేయవచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు.
ఢిల్లీలో నమోదయ్యే కేసుల దర్యాప్తును రాష్ట్రాలు అడ్డుకోలేవు !
ఢిల్లీలో నమోదైన కేసుల విచారణను రాష్ట్రాల్లో చేయాల్సి వస్తే అలాంటి విచారణను ప్రస్తుతం తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు ఆపలేవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి మీద సీబీఐ ఉద్యోగాల కుంభకోణం కేసు పెట్టింది. బిహార్ కూడా ఇటీవలే జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. సీబీఐ తేజస్వి మీద కేసును ఢిల్లీలో నమోదు చేసింది కాబట్టి దర్యాప్తునకు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా సోదాలు కూడా నిర్వహించారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు కూడా అక్కడే నమోదైంది. అందుకే తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు.
సీబీఐ కోర్టుకెళ్లి జీవోలు కొట్టి వేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి !
దాణా కుంభకోణంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐని తమ రాష్ట్రాలోకి రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ ఉత్తర్వులను కొట్టివేయించడంతో లాలూ జైలుకెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేసిన వీరభద్రసింగ్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. వీరభద్ర సింగ్ సీబీఐని తమ రాష్ట్రంలోకి రావద్దంటూ జీవో ఇచ్చారు. సుప్రీంకోర్టు సదరు జీవోను కొట్టివేయడంతో వీరభద్రసింగ్ జైలుకు వెళ్లారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడా అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ ప్రారంభించింది. జార్ఖండ్‌లో సీబీఐకి అనుమతి లేదంటూ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు సదరు జీవోను రద్దు చేయడంతో సీబీఐ తనపని తాను చేసుకుపోయింది. సీఎం హోదాలో మధు కోడా అరెస్టయి జైలుకు వెళ్లారు. ఇలాంటి ఉదాహరమణలు చాలా ఉన్నాయి.
ఈడీ, ఐటీలకు విస్తృతాధికారాలు !
జనరల్ కన్సెంట్ రద్దు చేయడం ద్వారా సీబీఐకి కొన్ని పరిమితులు పెట్టగలిగినప్పటికీ.. ఇలాంటి దాడులు, అరెస్టులు చేయాలనుకుంటే ఈడీకి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అవినీతి, పెద్ద మొత్తంలో నగదు బదిలీకి సంబంధించి ఈడీ చేపడుతున్న నల్లధనం చెలామణి కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ‘‘నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని అడ్డుకోగలుగుతాయి. ఈడీ వంటి సంస్థల్ని కట్టడి చేయలేవని చెబుతున్నారు. ఐటీ కూడా అంతే.
అందుకే ఈ వివరాలన్నీ చూస్తే.. సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు.