(Source: ECI/ABP News/ABP Majha)
AP Parties In Telangana : "ఆంధ్రా పార్టీ"లకు ఇక లైన్ క్లియర్ అయినట్లేనా ? తెలంగాణలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ అడుగుపెడతాయా ?
తెలంగాణలో ఆంధ్రా పార్టీలు ఇక ధైర్యంగా పోటీ చేయగలవా ? కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు, జగన్ ఉపయోగించుకుంటారా?
AP Parties In Telangana : తెలంగాణ రాష్ట్ర సమితిని .. భారత్ రాష్ట్ర సమితిగా మార్చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రభావవంతంగా ఉన్న తెలంగాణ సెంటిమెంట్.. ఒక్క సారిగా వెనక్కిపోయింది. ఇక ముందు తెలంగాణ మాత్రమే ఎజెండాగా తీసుకుని చేసే రాజకీయం జరగదని అనుకోవచ్చు. స్వయంగా కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ద్వారా ఇతర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. మరి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ముఖ్యంగా ఏపీలో ఉన్న పార్టీలు తెలంగాణలో పోటీ చేయడానికి సిద్ధమవుతాయా ? ఈ విషయంలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ఏమనుకుంటున్నాయి..? ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలపై ఎందుకు స్పందించలేదు ?
తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ !
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చురుకుగా రాజకీయాలు చేసింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకకు పార్టీ నేతలంతా టీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ బలహీనపడింది. ఏపీలో పార్టీని గెలిపించుకోవడానికి చంద్రబాబునాయుడు తెలుగుదేశంపై దృష్టి సారించలేదు. దాంతో 2018 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా కదలిక లేకుండా ఉండిపోయింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ... ప్రారంభంలో తెలంగాణలో మంచి క్రేజ్ ఉండేది. జగన్ పార్టీ పెట్టిన సమయంలో తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశారు. ఆయనకు మంచి ఆదరణ లభించింది. కానీ ఉద్యమం.. రాష్ట్ర విభజన తర్వాత ఆయన పూర్తిగా తెలంగాణ రాజకీయాలకు దూరమయ్యారు. తాము తెలంగాణలో రాజకీయాల్ని పూర్తిగా వదిలేశామని కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ కూడా ప్రకటించారు.
ఆంధ్రా పార్టీలన్న ముద్ర వల్లే టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ దూరం !
తెలంగాణలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలను ఆంధ్రాపార్టీలన్న ముద్రను టీఆర్ఎస్ నేతలు వేశారు. తెలంగాణ ప్రజలకు మళ్లీ ఆంధ్రోళ్లను నెత్తిన పెట్టుకుంటారా అని టీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్‌ను పండించడం వల్లే గత ఎన్నికల్లో కేసీఆర్ రెండో సారి విజయం సాధించారన్న విశ్లేషణలు చాలా వచ్చాయి. ఆ రెండు పార్టీలు యాక్టివ్ అయితే సెంటిమెంట్ పెరిగి టీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందనే వాదన ఉంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ స్వయంగా తెలంగాణ అనే కవచాన్ని వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆంధ్రా పార్టీల్లేవు.. లోకల్ పార్టీల్లేవు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. మీరెలా మా రాష్ట్రానికి వస్తారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించలేరు. అలా ప్రశ్నిస్తే వారు పెట్టినజాతీయ పార్టీకి అర్థం లేకుండా పోతుంది.
నెమ్మదించినా పార్టీలో పదవుల్ని భర్తీ చేస్తూ వస్తున్న చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీకి ఎంత మంది నేతలు రాజీనామా చేసినా.. చంద్రబాబు పార్టీ పదవుల్ని భర్తీ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షునిగా బక్కని నరసింహులు ఉన్నారు. చంద్రబాబు తెలంగాణపై హోప్స్ వదులుకోలేదని.. మంచి అవకాశం కోసం చూస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే.. ఇప్పటి కన్నాగొప్ప అవకాశం మళ్లీ రాదు. తెలుగుదేశం పార్టీకి.. తెలంగాణ బీసీ వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. మంచిఓటు బ్యాంక్ ఉంది. వారందర్నీ మళ్లీ పార్టీ వైపు రప్పించుకోగలిగితే.. మళ్లీ బలంగా ఉనికిని చాటవచ్చని టీడీపీ నేతలంటున్నారు. ఈ అంశంపై చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయో స్పష్టత లేదు.
వైఎస్ఆర్‌సీపీ మళ్లీ యాక్టివ్ అవుతుందా ? షర్మిల పార్టీకి మద్దతిస్తుందా ?
వైఎస్ఆర్‌సీపీకి కూడా తెలంగాణలో పోటీ చేసిన 2౦14లో మంచి ఓటు బ్యాంక్ఉంది. ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు..పార్లమెంట్ స్థానం కూడా గెల్చుకుంది. అయితే ఆ తర్వాత రాజకీయాలను విరమించుకున్నారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఆ పార్టీ ఏం చేస్తుందన్నది సస్పెన్స్ గామారింది. తెలంగాణలోపోటీ చేస్తారా లేకపోతే జగన్ సోదరి పెట్టుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మద్దతిస్తారా అన్నది స్పష్టతలేదు. ఇప్పటికైతే... బీఆర్ఎస్ ఏపీలోకి రావడంపై స్పందించారు కానీ.. తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టడంపై వైసీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మొత్తంగా తెలంగాణలో ఆంధ్రా పార్టీలు అనే ఓ భావన పటాపంచలు అయింది. ఏపీలోని పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణలో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ విషయంలో ఎవరు ముందుకొస్తారు..? ఎవరు విజయం సాధిస్తారు ? అనేది ముందు ముందు తెలుస్తుంది.