KTR: 'కాంగ్రెస్ లోనే ఏక్ నాథ్ శిండేలు ఉన్నారు' - ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Telangana News: బీఆర్ఎస్ హయాంలో జరిగిన మంచి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లకపోవడమే ఓటమికి కారణమని.. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR Slams Cm Revanth On Nalgonda Parliamentary Meeting: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని.. నల్గొండ, ఖమ్మం హస్తం నేతలే కూలుస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నల్గొండ (Nalgonda) లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. 'బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయాం. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాం. తుంగతుర్తి, సూర్యాపేటలో కేసీఆర్ పర్యటన సందర్భంగా వచ్చిన జనంలో ఆ ఎమోషన్ చూస్తుంటే నల్గొండ జిల్లాలో ఎందుకు ఓడిపోయామో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నల్గొండలో 12లో 8 సీట్లు గెలుస్తామని అనుకున్నాం. అయితే, ఫలితాలు దానికి భిన్నంగా వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో ఆ పొరపాట్లు జరగకుండా ఆత్మవిమర్శ చేసుకుందాం.' అని కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
'ఉద్యోగాలు ఎలా ఇచ్చారు.?'
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా.. ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 'బీఆర్ఎస్ పాలనలో 1,60,283 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలో పదేళ్లలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు. మన పని చేసుకుంటూ వెళ్లిపోయాం. కానీ, చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయాం. కాంగ్రెస్ మాటలు విని మోసపోయామని 100 రోజుల్లోనే ప్రజలు గ్రహించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదు. రుణమాఫీ జరిగితే కాంగ్రెస్ కు ఓటెయ్యండి. రుణమాఫీ డబ్బులు రాకుండా మోసపోతే బీఆర్ఎస్ కు ఓటెయ్యండి' అని కేటీఆర్ అన్నారు.
'ఉద్యోగులకూ దూరమయ్యాం'
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెంచిన నేత కేసీఆర్ అని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలిచ్చామని అన్నారు. అయితే, ఒకటో తారీఖున జీతాలు వేయకపోవడం వల్ల వారు దూరమయ్యారని.. పోస్టల్ బ్యాలెట్లలో 70 - 80 శాతం మంది ఉద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పారు. 'కరోనాతో పాటు ఇతర సమస్యల వల్ల ఆర్థికంగా వెనుకబడ్డామని చెప్పడంలో విఫలమయ్యాం. అన్నదాతలకు కేసీఆర్ చేసిన మేలు ఏ నాయకుడూ చేయలేదు. రైతు బంధు, 24 గంటల విద్యుత్ అందించారు. అయినా రైతులు బీఆర్ఎస్ కు దూరమయ్యారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టాం. కాంగ్రెస్ నాయకులు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారు. బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చింది.' అని పేర్కొన్నారు.
'ఫెయిలైంది మన నాయకుడు కాదు'
'ఫెయిలైంది మన నాయకుడు కాదు. తప్పు ప్రజలది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నారు. మనమేమో ప్రజల్లోకి సంక్షేమాన్ని, చేసిన మంచిని బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. ప్రజలేమో అబద్ధాలకు మోసపోయారు. పదేళ్ల నిజం ముందు వంద రోజుల అబద్ధం ప్రజలకు ఇవాళ కనబడుతుంది. కేసీఆరే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.' అని అన్నారు.
Also Read: Uttam Kumar Reddy : ట్యాపింగ్ కేసులో ఎవర్నీ వదలం - ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక