Uttam Kumar Reddy : ట్యాపింగ్ కేసులో ఎవర్నీ వదలం - ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక
Telangana News : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవర్నీ వదిలేది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Phone Tapping Case : తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ చేసిన వాళ్లను వదిలేదే లేదని, ట్యాపింగ్ వెనుక ఎంత పెద్ద నాయకులు ఉన్నా శిక్ష పడుతుందని ఉత్తమ్ హెచ్చరించారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. కూతురు ఒక కేసులో ఇరుక్కుపోయింది. గొర్రెల స్కాంలో కొందరు ఇరుక్కుపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఇరుకుతారో అని బీఆర్ఎస్ వాళ్లకు భయం పట్టుకుందని ఉత్తమ అన్నారు.
బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా అందరూ కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ పాలనను చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 సీట్లు తప్పకుండా గెలుస్తామని ఉత్తమ్ జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని స్పష్టం చేశారు.
తెలంగాణలో తాగునీరు సమస్య, కరెంట్ సమస్య లేదని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ లాగా మాకు ఫామ్ హౌజ్ లో పడుకునే అలవాటు లేదని, ప్రతీరోజూ సచివాలయానికి వస్తున్నామని చెప్పారు. ప్రతి సమస్యపై వారంపదిరోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 40వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దబాయింపు చేశారని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం జరగదని అన్నారు.
కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని.. ఆయన డిప్రెషన్, ఫస్ట్రేషన్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఒడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్‌లో మొదలైందన్నారు. పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారని.. ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) మిగలదని అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు తప్ప బీఆర్ఎస్‌లో ఎవరూ మిగలరన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ అని.. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారమన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదన్నారు.
పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పచెప్తామని బీఆర్‌ఎస్ చీఫ్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ - జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

