KCR New Plan : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు లెక్కలేనన్ని సవాళ్లు - సెంటిమెంట్ తరహా అస్త్రం రెడీగా ఉందా ?
తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరును భారత్ ఎక్స్ ప్రెస్‌గా మార్చి కేసీఆర్ రూటు మార్చారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందా ?
KCR New Plan : పక్క చూపులు చూస్తే పడిపోతావురా అన్న మాటలు వింటుంటాం. కానీ పక్కచూపులతోనే పక్కా ప్లాన్ తో జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పుతానంటున్నారు దేశ్ కీ నేత కెసిఆర్. బీఆర్ ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన కెసిఆర్ పాన్ ఇండియా పవర్ ఫుల్ పొలిటిషన్ గా ఎదగడానికి ఎలాంటి ప్లాన్ తో ముందుకెళ్తున్నారన్నదే ఆసక్తికరంగా మారింది.
ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న కేసీఆర్
తెలంగాణలో చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయల్లో కీలక పాత్ర పోషించేందుకు నడక ప్రారంభించింది. నిన్నటివరకు ప్రాంతీయపార్టీకి లీడర్ గా ఉన్న కెసిఆర్ ఇక నుంచి జాతీయ నేతగా ఢిల్లీ రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతున్నారు. ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఇక ప్లాన్ ని అమలు పరచడమే తరువాయి కాషాయానికి కళ్లు బైర్లు కమ్మడం ఖాయమంటోంది గులాబీ దళం. ఢిల్లీ గద్దెపై గులాబీ జెండా రెపరెపలాడాలన్న లక్ష్యంతో జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన కెసిఆర్ రైతు రాజ్యం తెస్తామని పార్టీ ఆవిర్భావం రోజునే ప్రకటించి విధివిధాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ రేపారు. అంతేనా కర్నాటకలో తొలి అడుగు పెట్టి పార్టీని నిలబెట్టడమే కాదు కుమారస్వామిని తిరిగి సిఎం చేస్తానని ధీమాతో చెప్పారు.
పూర్తిగా బీఆర్ఎస్‌పైనే దృష్టి పెట్టనున్న కేసీఆర్
రేపు పక్క రాష్ట్రం, ఎల్లుండి ఆపక్క..ఇలా పక్క నుంచి నరుకొస్తూ మోదీ-షాలకు పక్కలో బల్లెంలా తయారవ్వాలన్నదే కెసిఆర్ లక్ష్యమంటున్నారు రాజకీయవిశ్లేషకులు. అంతేకాదు అనుకున్నది సాధించే వరకు విశ్రమించని మొండోడని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారో ఎవరికి అంతుచిక్కకుండా ప్లాన్ లు వేసిన కెసిఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ కీలక నేతగా ఎదిగేందుకు అంతకుమించిన వ్యూహంతో ముందుకెళ్తాడని భావిస్తున్నారు. ఢిల్లీలో బీఆర్ ఎస్ పార్టీ ప్రారంభోత్సవం తర్వాత కెసిఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాల్లోనే బిజీ అవుతారని పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. ఈ లోపు బీఆర్ ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పార్టీ క్యాడర్ ని సిద్ధం చేసి ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆలోచనలో కెసిఆర్ ఉన్నారట.
రైతు నినాదంతో దేశ ప్రజల మనసులు గెల్చుకునే ప్రయత్నం
కేంద్ర రాజకీయాల్లో శూన్యత ఉందన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ జాతీయ పార్టీ మరొకటి లేదు. ప్రాంతీయపార్టీలు కొన్ని జాతీయ పార్టీగా మారాలని ప్రయత్నించినా కానీ ఆ స్థాయిని అందుకోలేకపోయాయి. ఇప్పుడు దక్షిణాదిన తెలంగాణ నుంచి వస్తోన్న బీఆర్ ఎస్ పార్టీ ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ జాతీయపార్టీగా ఎదుగుతుందా అన్నది ఆసక్తికంగా మారింది. నీళ్లు, నిధులు, నిమాయకాలను ప్రశ్నిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ ఇప్పుడు రైతు నినాదంతో సహజవనరులను అందిపుచ్చుకొని భారత దేశాన్ని రైతు రాజ్యం గా మారస్తునని చెబుతున్న మాటలు ఎంతవరకు ఆచరణలోకి తెస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్‌పై ముప్పేట దాడి చేస్తున్న విపక్షాలు
కెసిఆర్ మాట నిలుపుకోడన్న విషయాన్ని స్పష్టం చేస్తూ పదేపదే విపక్షాలు దళితుడిని తెలంగాణ తొలి సిఎం చేస్తానన్న మాటలను గుర్తు చేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రజలకు చెప్పిన హామీలు ఏమయ్యాయంటూ బీఆర్ ఎస్ పార్టీ ప్రకటన రోజున విపక్షాలు ప్రశ్నించాయి. బిఆర్ ఎస్ కాదు కేసిఆర్ కు విఆర్ఎస్ ఇచ్చే రోజులు వచ్చాయని టీపీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ కేసిఆర్ తనదైన శైలి వ్యూహాంతో ఏ రకంగా తెలంగాణ ఎక్స్ ప్రెస్ ను ఢిల్లీ వరకూ ఎలా తీసుకువెళ్తారో వేచి చూడాల్సిందే.