Kadiyam Srihari: కాంగ్రెస్ గూటికి కడియం శ్రీహరి! - అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతల పిటిషన్
Brs News: బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ చర్యలు సిద్ధమైంది. ఆయనపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించింది.
![Kadiyam Srihari: కాంగ్రెస్ గూటికి కడియం శ్రీహరి! - అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతల పిటిషన్ brs leaders disqualification petition on kadiyam srihari Kadiyam Srihari: కాంగ్రెస్ గూటికి కడియం శ్రీహరి! - అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతల పిటిషన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/8379ac8c607b4be3a2d383f7fddda8581711795817977876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brs Disqualification Petition On Kadiyam Srihari: బీఆర్ఎస్ (Brs)లో కీలక నేతలు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇటీవల సీనియర్ నేత కె.కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడారు. ఇప్పటికే విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరగా, కేకే సైతం త్వరలోనే హస్తం గూటికి చేరనున్నారు. తాజాగా, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఆయన కుమార్తె కడియ కావ్య సైతం వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకొన్నారు. అయితే, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పీకర్ కు పిటిషన్ ఇచ్చేందుకు శనివారం మధ్యాహ్నం అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతల బృందం చేరుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ స్పీకర్ కు పిటిషన్ ఇవ్వాలని యత్నించారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేరని అసెంబ్లీ సిబ్బంది తెలిపారు. దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన కూడా అందుబాటులో లేరని తెలిసింది. ఈ క్రమంలో డిప్యూటీ సెక్రటరీకి పిటిషన్ ఇచ్చేందుకు సిద్ధం కాగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరిన విషయం తెలిసిందే.
కడియం శ్రీహరి ఏమన్నారంటే.?
మరోవైపు, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో.. తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మారేందుకు సిద్ధమైన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని.. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు తెలిపారు. 'బీఆర్ఎస్ నేతలు అయోమయంలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బలహీన పడింది. పార్టీ నేతల నుంచి సహకారం లభించలేదు. ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దని కావ్య అనుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని పిలుపు వచ్చింది. అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది. ఆరూరి రమేష్ వద్దంటేనే కావ్యకు టికెట్ ఇచ్చారు. నన్ను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు. కావ్యను నిండు మనసుతో అందరూ ఆశీర్వదించాలి.' అని కడియం పేర్కొన్నారు. అటు, కడియం ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతిస్తామని ఆయన అనుచరులు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ లోకి విజయలక్ష్మి
అటు, జీహెచ్ఎంసీ మేయర్ జి.విజయలక్ష్మి (Vijayalaxmi) కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో శనివారం హస్తం తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు సైతం త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.
Also Read: Nandamuri Suhasini : రేవంత్ , దీపాదాస్ మున్షిని కలిసిన నందమూరి సుహాసిని - పార్టీ మారుతున్నారా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)