BRS First List : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ కోసమే బీజేపీ వెయిటింగ్ - కేసీఆర్ తొందరపడతారా ?
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ కోసం బీజేపీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఎందుకో తెలుసా ?
BRS First List : భారత రాష్ట్ర సమితి తొలి జాబితా విడుదలపై గత వారం, పది రోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇదిగో జాబితా, అదిగో జాబితా అంటున్నారు కానీ.. అసలు జాబితా రిలీజ్ కావడం లేదు. కానీ ఇదే జాబితా అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అందులో తప్పనిసరిగా టిక్కెట్లు వారికే అనే నేతల పేర్లతో పాటు కాస్త డైలమాలో ఉన్న నేతల పేర్లు కూడా ఉన్నాయి. కానీ అసలు కేసీఆర్ మనసులో ఏముందో.. ఆయన ఫైనల్ చేసుకున్న లిస్టులో ఎవరి పేర్లున్నాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ ట్విస్టేమిటంటే బీఆర్ఎస్ తొలి జాబితా కోసం.. బీఆర్ఎస్ ఆశావహులే కాదు.. బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే.. చేరికల కోసం...!
టిక్కెట్ రాదని భావిస్తున్న వారి ధిక్కార స్వరాలు !
బీఆర్ఎస్ టిక్కెట్లు ఈ సారి గతంలో మాదిరిగా సిట్టింగ్‌లు అందరికీ దక్కే అవకాశం లేదు. ఎవరెరవికి టిక్కెట్ నిరాకరించబోతున్నారో మాత్రం సంకేతాలు ఇస్తున్నారు. వారు తమ బలప్రదర్శన చేయడానికి వెనుకాడటం లేదు. కనీసం పాతిక మందికి టిక్కెట్ గల్లంతు అవుతుందని చెబుతున్నారు. అలాంటి వారికి ఎలంటి సిగ్నల్స్ రాలేదు. పైగా.. పార్టీ దూరం పెడుతున్న సంకేతాలు రావడం.. టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్న వారి హడావుడి పెరగడంతో అలజడి ప్రారంభమవుతోంది. ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. వీరందరూ ప్రత్యామ్నాయంగా మరో పార్టీని చూసుకోవడం ఖాయమని అనుకోవచ్చు. రాజయ్య, ముత్తిరెడ్డి వంటి వారు అదే చేస్తున్నారు. కొంత మంది గుంభనంగా ఇతర పార్టీలతో మాట్లాడుకుంటున్నారు.
అమిత్ షా సభలో భారీ చేరికలు ఉంటాయంటున్న బీజేపీ
బీఆర్‌ఎస్ జాబితా కోసం బీజేపీ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తోంది. చాలా కాలంగా బీజేపీ చేరికల కోసం ప్రయత్నిస్తోంది. ఈ నెల 27వ తేదిన అమిత్ షా పర్యటనకు రాబోతున్నారు. ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈటల రాజేందర్ ఊహించని చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఏకంగా ఇరవై రెండు మంది నేతలు చేరబోతున్నారని స్పష్టం చేశారు. ఈటల చెప్పిన ఉద్దేశంలో ఈ ఇరవై రెండు మంది ఎవరో కాదు.. బీఆర్ఎస్ టిక్కెట్లు నిరాకరించబోయే ఎమ్మెల్యేలు. ఇప్పటికిప్పుడు జాబితాను ప్రకటిస్తే అడ్వాంటేజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈటల సంకేతాలు పంపుతున్నారు.
బీజేపీకి చాన్సిస్తారా ? జాబితా ప్రకటన కోసం షెడ్యూల్ వరకూ ఆగుతారా?
బీఆర్ఎస్‌లో నేతలు ఓవర్ లోడ్ అయ్యారు. అదే సమయంలో పోటీ చేయడానికి రెండు పార్టీలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ హైకమాండ్ ..అసంతృప్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. టిక్కెట్లు నిరాకరించే నేతల్ని ప్రగతి భవన్ కు పిలిపించి ఇప్పటికే మాట్లాడుతున్నారు. కానీ.. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది మాత్రం అంచనావేయడం కష్టం. అందుకే జాబితాలను లీకులుగానే ఉంచితే మంచిదన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ హైకమాండ్ కు నేతలు సలహాలిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు కేసీఆర్ అదే రోజు జాబితా ప్రకటించారు. కానీ ఇప్పుడు ముందు ప్రకటించాల్సిన అవసరం లేదని షెడ్యూల్ రిలీజైన రోజున ప్రకటిస్తే చాలనే వారు కూడా ఉన్నారు. షెడ్యూల్ రాకుండానే అభ్యర్థుల జాబితా ప్రకటించడం తొందరపాటు అవుతుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో మరి !