Alleti Maheshwar Reddy: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి - ఏలేటి మహేశ్వర రెడ్డి
Hyderabad News: డీఎస్సీ నోటిఫికేషన్, లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఏలేటి మహేశ్వర రెడ్డిడిమాండ్ చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్ మీద అనర్హత పిటిషన్ ఇస్తామన్నారు.
BJP MLA Alleti Maheshwar Reddy : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు వైద్యానికి పెద్దపీట వేస్తామన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వరంగల్‌లో కార్పొరేట్ ఆసుపత్రిని ప్రారంభించి.. కార్పొరేట్‌ను సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి రాగానే ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగుకు వెళ్లారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క బెడ్ కూడా వేయలేదు. కానీ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాకు ఆంక్షలు విధించడమే మీరు చెప్పిన ప్రజాపాలనా ? అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతపై కనికరం లేకుండా లాఠీఛార్జ్ చేయించడం అమానుషమన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు భర్తీ చేస్తారో చెప్పాలని మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వందల కోట్ల అవినీతి
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఆరు అవినీతి ఆరోపణల మీద ఆధారాలు ఇచ్చానని... ఇందులో ఏ ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సివిల్ సప్లై మంత్రి మీద చేసిన ఆరోపణలకు స్పందించని అసమర్థత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిదని అన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తూ, వందల కోట్లు అవినీతి జరుగుతున్నా.. మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఇదే మంత్రి మరో శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగే అవినీతి పై అన్ని ఆధారాలు బయట పెడతానన్నారు. తొందర్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీడియా కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని స్పష్టం చేశారు. రిటైర్డ్ జడ్జి తో కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
దానం పై అనర్హత పిటిషన్
డీఎస్సీ నోటిఫికేషన్, లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటోంది. మరి ఆ ఎమ్మెల్యేల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలో చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేద్దామని అనుకుంటే ఆయన అందుబాటులో ఉండటం లేదు.. సమయం ఇవ్వడం లేదన్నారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చరిత్రలో లేదన్నారు.
దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ ఇస్తున్నామని తెలిపారు. త్వరలో పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేస్తాం. దానం ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయన మీద స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపు కి పాల్పడిన దానం పై 90 రోజుల్లో చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.