(Source: ECI/ABP News/ABP Majha)
Vishnu Shoking Talks: ఎవరినో సీఎం చేయాల్సిన అవసరం మాకు లేదు: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
BJP NEWS: ఏపీలో బీజేపీ నేతే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరినో సీఎంగా మోయాల్సిన అవసరం తమకు లేదన్నారు
Vishu Vardhan Reddy: మాట తూటా వంటిది. ఒక్కసారి బయటకు వెళ్లిందంటే తిరిగి తీసుకోలేం. అందుకే ఆచితూచి మాట్లాడాలంటారు పెద్దలు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోసారి వారు చేసే వ్యాఖ్యలు...వ్యక్తిగతంగా వారికి ఎలాంటి నష్టం చేకూర్చకున్నా పార్టీకి తీవ్ర నష్టం చేస్తాయి. ఎన్నికలవేళ కీలక వ్యక్తులు చేసే ప్రతి ప్రకటన ఎంతో ప్రభావం చూపుతాయి. అలాంటి వ్యాఖ్యలే మరోసారి చేశారు బీజేపీ(BJP) రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి(Vishnu Vardhan Reddy). రాష్ట్రంలో ఒకవైపు పొత్తుల కోసం తీవ్ర మథనం జరుగుతుండగా.....విష్ణువర్థన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
బీజేపీ నేతే సీఎం
ఏపీలో పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.తెలుగుదేశం(TDP), బీజేపీ(BJP) మధ్య పొత్తుల ఖరారు కోసం ఢిల్లీస్థాయిలో తీవ్ర మథనం జరుగుతోంది. ఇప్పటిటే బీజేపీ పెద్దలతో చంద్రబాబు(CBN) సమావేశమై చర్చించారు. సీట్ల సర్దుబాటుపై పెద్దలస్థాయిలో తర్జనభర్జనలు సాగుతుండగా...కిందిస్థాయి నేతలు మాత్రం ఎవరికి వారు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుండటం పొత్తుల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉంది. బీజేపీ నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని..ఎవరినో భుజానా మోయాల్సిన పని తమకు లేదని బీజీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎవరినో సీఎంను చేసే పని తమది కాదని.. దేశంలో అధికారంలో ఉన్న తాము ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం అవసరమా అన్నారు. గతంలో చంద్రబాబు బలమైన వ్యక్తే కావచ్చని...కానీ 2014లో ఉన్నపరిస్థితులు ఇప్పుడు లేవన్నారు.
ఎవరి అపాయింట్ కోసం ఎవరు పాకులాడుతున్నారో గమనించాలన్నారు. ఢిల్లీకి ఎవరు వెళ్తున్నారో అందరికి తెలుసన్నారు. ఏపీలో మాకు శక్తి లేకపోతే పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని విష్ణువర్థన్‌రెడ్డి(Vishnu Vardhan Reddy) విమర్శించారు. అయితే విష్ణువర్థన్‌రెడ్డి నోరుజారడం...అధిష్టానం తలంటడం మామూలే. గతంలోనూ రాజధాని మహిళా రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమకు 75 సీట్లు ఇస్తేనే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ(BJP) జాతీయ నాయకత్వం తీవ్రంగా మండిపడింది. అయినా సరే ఆయన తీరులో మార్పురాలేదు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అటు సొంతపార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిద్దుబాటు చర్యలు
విష్టువర్థన్ రెడ్డి వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని..పార్టీకి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్ ఛార్జి పాతూరి నాగభూషణం తెలిపారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి..ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్నది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. దీనిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే అధికారం రాష్ట్ర అధ్యక్షులకు కూడా లేదన్నారు. పొత్తుల గురించి అమిషా(Amithsha), నడ్డా లంటి వారే నేరుగా వెల్లడిస్తారని రాష్ట్ర నాయకత్వానికి దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలు...రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించారు. 20 అసెంబ్లీ స్థానాలు,ఐదు లోక్ సభ స్థానాల పరిధిలో బీజేపీ బలంగా ఉందని వెల్లడించినట్లు సమాచారం.
తెలుగుదేశం ఆగ్రహం
విష్టువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు సైతం మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో స్థానిక నేతలకు తెలియకపోయినా... అగ్రనాయకత్వానికి తెలుసన్నారు. వారి బలమెంత అన్నది చూసుకోకుండా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పొత్తుల ప్రాసెస్ జరుగుతున్నందున తామేమీ మాట్లడటం లేదని...లేకపోతే దీటుగానే స్పందిస్తామన్నారు. పొత్తు కుదిరితే రేపటి నుంచి కలిసి పనిచేయాల్సి ఉంటుందని...ఇలాంటి సమయంలో మీరెంతంటే మీరెంత అంటూ వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదన్నారు.