BJP Vishnu : రైతు రత్నం మృతి ప్రభుత్వ హత్యే - బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీపై టీడీపీ వైఖరేంటని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న !
రైతు రత్నం మృతిపై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. పలు అంశాలపై ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
BJP Vishnu : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం బల్క్‌డ్రగ్ ప్రాజెక్టు కేటాయించడంపై టీడీపీ వ్యతిరేకత వ్యక్తం చేయడాన్ని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే చిత్తూరు జిల్లాలో రైతు వడ్డే రత్నం మృతి ప్రభుత్వం చేసిన హత్యన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
పెట్టుబడులపై వైఎస్ఆర‌్ సీపీ, టీడీపీ రాజకీయాలు !
కరోనా తర్వాత భారత్ పుంజుకుని ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎజిగిందని కానీ ఏపీలో మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయల కారణంగా వెనక్కిపోతోందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుబడులను అడ్డుకుంటూ, పారిశ్రమలను రాకుండా చేసి పారిశ్రామికరంగాన్ని దెబ్బతీస్తున్నాయి. దేశంలో ప్రతిష్టాత్మకమైన 3 బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటుచేయనుంటే అందులో దక్షిణాదిరాష్ట్రాల నుంచి ఎపీకి మాత్రమే అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు ఉచితంగా ఇస్తుంది. పదివేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఏడాదికి రూ.50 వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాని ఈ ప్రాజెక్టు ఏర్పాటును టీడీపీ వ్యతిరేకిస్తోందన్నారు. వైఎస్ఆర్‌సీపీ నిర్ల్యక్షం వహిస్తోందన్నారు. ఈ రెండు పార్టీల కారణంగా లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణుడు ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, కేంద్రానికి, పర్యావరణశాఖకు లేఖరాస్తూ ఫిర్యాదుచేశారు. కేంద్రం సహకరించే పరిశ్రమలను ఎందుకు అడ్డుకుంటుందో టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. ఈ అంశం రెండుపార్టీల రాజకీయ అంశం కాదు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినదన్నారు. ఈ రెండు పార్టీల నాయకుల కుటుంబాలకు వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలున్నాయి. కాని రాష్ట్రంలోని నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఈ పార్టీల కారణంగా లక్ష మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగితే బీజేపీ క్షమించదన్నారు.
రైతు వడ్డే రత్నంది ప్రభుత్వ హత్యే !
రాష్ట్రంలో అధికారపక్షం నాయకులు, ప్రభుత్వ అధికారుల కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని జానితి చిత్తూరు జిల్లాలోని పెనమూరు రైతు రత్నం మరణమే సాక్ష్యమన్నారు. తన సమస్య పరిష్కారానికి తాహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగి ఆ కార్యాలయంలోనే చనిపోవడం హృదయవిదారకంగా భావిస్తున్నామని.. బీజేపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందన్నారు. ఇది అధికారులకు సిగ్టుచేటు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రిగాని, సంబంధిత మంత్రిగాని, ఉన్నతాధికారులు కాని స్పందించకపోవడం ఘోరం. రైతు రత్నంది ప్రభుత్వ హత్య. రత్నం మరణాన్ని హత్యకేసుగా నమోదుచేసి ఏకసభ్య కమిషన్‌తో విచారించి అయనను వేధించిన వారిపై కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ సంఘటనపై కేంద్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
రోడ్లను నిర్మించలేమని కేంద్రానికి ఏపీ లేఖ సిగ్గు చేటు !
రాష్ట్రంలో తాము రోడ్లను నిర్మించలేమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్వయంగా లేఖరాయడం శోచనీయమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రోడ్ల నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను భరించాలి. అయితే తన వాటా ఇబ్బకుండా కేంద్రమే నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి వైకాపా ప్రభుత్వం లేఖరాసిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైల్వేలైన్ల నిర్మాణంలో తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో అవి నిలిచిపోయాయి. ఇప్పుడు రోడ్ల వంతు వచ్చింది. ఇలాగైతే రాష్ట్రంలో మౌలికసదుపాయాలు ఏ మేరకు అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు.
ఎడ్యుకేషన్ మాఫియా ప్రభుత్వాలను నడుపుతోంది..!
ప్రైవేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలనే చట్టాన్ని అమలుచేయాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఎందుకు అమలుచేయడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని 16 వేల పాఠశాలల్లో ఒక్కోదానిలో కనీసం అయిదుగురికి ఉచితంగా సీటిచ్చినా 80 వేల మందికి మేలు జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు తమ హక్కులు గురించి మాట్లాడితే వారిని బెదిరించడానికి మీడియా సమావేశాలు పెట్టే విద్యాశాఖమంత్రి ఈ ఆదేశాల్ని అమలుచేస్తామని ఎందుకు ప్రకటించరు. పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యం ఈ ప్రభుత్వానికి లేదు. కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చేసినట్లు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఫీజులను నియంత్రించాలి. విద్యామాఫియాపై కోర్టు ఉక్కుపాదం మోపాలి. కోర్టు నిర్ణయం అమలుచేయాలి. 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పొత్తుల అంశం పార్టీల డ్రామా !
పొత్తులపై జరుగుతున్న చర్చలన్నీ టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ఆడుతున్న డ్రామాలని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీల పాలనతో విసిగి వేసారిన నాయకులు ప్రత్నామ్యాయ పార్టీగా భాజపాను ఎంచుకుని ఆ పార్టీలోకి రావాలని భావిస్తున్నారు. ప్రజలు భాజపాకు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. తమ నాయకులు పార్టీలు మారకుండా కట్టడి చేసేందుకు ఆ పార్టీలు ఆడుతున్న డ్రామా ఇదని మండిపడ్డారు.