AP BJP : ఏపీ బీజేపీ బలపడుతోందా ? ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ?
ఉపఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరుగింది. ఇది ఆ పార్టీ బలడిందనేదానికి సంకేతమా ?
AP BJP : దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శరవేగంగా విస్తరిస్తోంది. హిందీమాట్లాడే రాష్ట్రాల్లో తిరుగులేని స్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ బలంగా ముందుకెళ్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ పాగా వేసింది. అయితే దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీకి పట్టు చిక్కడం కాస్త ఆలస్యమవుతోంది. అయితే ఇటీవలి కాలంలో దక్షిణాదిలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో అధికారంలో ఉండగా.. తెలంగాణలో ఆ దిశగా వెళ్తున్నామని కమలనాథులు గట్టిగా నమ్ముతున్నారు. తమిళనాడులో యువనాయకత్వం స్టాలిన్ సర్కార్‌పై బలంగా పోరాడుతోంది. అక్కడ అన్నాడీఎంకే వర్గపోరుతో తంటాలు పడుతోంది. దీంతో ప్రభుత్వంపై పోరాడుతోంది బీజేపీనే అన్న భావన ఏర్పడుతోంది. ఏపీలోనూ తాము బలపడుతున్నామని బీజేపీ విశ్వసిస్తోంది. ఉపఎన్నికల్లో తమ ఓట్ శాతం ఒకటి నుంచి పదిహేను శాతం వరకూ పెరగడమే దీనికి సాక్ష్యంగా చూపిస్తోంది.
ఉపఎన్నికల్లో పోటీతో ఓట్ల శాతం పెంచుకున్న బీజేపీ !
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ సభ్యుల మరణం కారణంగా ఈ ఉపఎన్నికలు జరిగాయి. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఉపఎన్నికలు జరిగాయి. అన్నింటిలోనూ బీజేపీ తమ ఓటు బ్యాంక్‌ను భారీగా పెంచుకుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో2019 ఎన్నికల్లో 16,125 ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. కానీ 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓట్లు 57,080కి పెరిగాయి. దాదాపుగా నాలుగు శాతం ఓట్లను పెంచుకుంది. అదే ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఆరు శాతం ఓట్లను కోల్పోయింది. ఇక బద్వేలు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ దాదాపుగా పదిహేను శాతం ఓట్లను తెచ్చుకుంది. సాధారణ ఎన్నికల్లో ఇది ఒకటిన్నర శాతమే. అంటే పమూడు శాతం కంటే ఎక్కువ ఓట్లను తెచ్చుకుంది. ఆత్మకూరులోనూ అంతే పదిహేను శాతం వరకూ ఓట్లను సాధించింది. సాధారణ ఎన్నికల్లో చాలా పరిమితంగా వచ్చిన ఒకటి.. ఒకటిన్నర శాతం ఓట్లతో పోలిస్తే.. ఈ రెండు, మూడేళ్లలో బీజేపీ ఓట్ల శాతం పదిహేను శాతం వరకూ పెరిగింది. ఇది తాము బలపడటమేనని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.
Atmakur Constituency
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 26, 2022
2019
BJP Polled Votes & percentage: 2314, 1.33%
2022
BJP Polled Votes & % : 19,332, 14.1%
This increase in vote % shows people want change & they're showing faith in BJP.
We'll do better in coming times under the leadership of Hon'ble PM @narendramodi ji. pic.twitter.com/b0fnicz87t
ప్రతిపక్షం పోటీ చేయకపోవడం వల్లనే వచ్చిన ఓట్లా !?
ప్రతిపక్షం పోటీ చేయకపోవడం వల్లనే బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయడం ఇష్టం లేని వారు బీజేపీకి ఓటు వేశారని కొన్ని రాజకీయవర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. అది ఓ కారణం కావొచ్చు కానీ.. బీజేపీకి ఓటు వేయడానికి వారు సముఖంగా ఉన్నారని కూడా అర్థం చేసుకోవాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షం పోటీలో లేనంత మాత్రాన ఆ పార్టీకి వేయాల్సిన వాళ్లు ఇతర పార్టీకి ఓటు వేస్తారన్న ధీయరీ ఎక్కడా లేదని గుర్తు చేస్తున్నారు. బీజేపీపై అభిమానంతోనే ఆ ఓటింగ్ జరిగిందని.. నమ్ముతున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో ప్రతిపక్షం పోటీ చేసినప్పటికీ.. ఆ పార్టీకి ఆరు శాతం ఓట్లు తగ్గి బీజేపీకి నాలుగు శాతం పెరిగాయని గుర్తు చేస్తున్నారు.
ఏపీ బీజేపీ ఇంకా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది !
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో బలపడుతోందన్నది ఎవరూ తోసిపుచ్చలేరు. ఎందుకంటే బీజేపీ ఒకప్పుడు బలమైన పార్టీ. ఏపీలోనూ మంచి ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ కానీ జాతీయ రాజకీయ ప్రయోజనల కోసం ఏపీలో పార్టీని త్యాగం చేయాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతుల విశ్లేషిస్తూ ఉంటారు. ఇప్పటికీ అదే మూడ్‌లో పార్టీ నేతలు ఉన్నారేమో కానీ.. తెలంగాణలోలా.. తమిళనాడులోలా రాజకీయ పోరాటం మాత్రం ప్రారంభం కాలేదన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. యువనాయకత్వం చేతికి పగ్గాలు ఇస్తే .. బీజేపీ పుంజుకుంటుందని.. మరింత బలంగా అధికారం కోసం రేసులోకి వచ్చే స్థాయిలో పోరాడతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికైతే ఏపీ బీజే్పీ నేతల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. భవిష్యత్‌లో బలంగా ఎదుగుతామన్న నమ్మకంతో ఉన్నారు.