దాపరికం లేదు, ఓపెన్ అయిపోతున్న నాయకులు: పార్టీలపై భారీ ఎఫెక్ట్!
ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్న నేతలు.. పార్టీల గుట్టును.. వ్యూహాలను బయట పెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నాయకులు పార్టీలు మారినా రహ స్యాలు బయట పెట్టేవారు కాదు.
AP Political leaders: లోగుట్టు పెరుమాళ్ల కెరుక! అని తెలుగు(Telugu)లో ఒక సామెత(Proverb) ఉంది. అయితే.. ఇప్పుడు పెరుమాళ్ల కన్నా ముందే.. పార్టీ నాయకులకు తెలియడంతో.. వారు.. తమ తమ పార్టీల్లో(Political parties) తమకు న్యాయం జరగదని భావించడంతో బయటకు వస్తున్న క్రమంలో ఆ `లోగుట్టు`ను కాస్తా బయట పెట్టేస్తున్నారు. ఇది.. ఆయా పార్టీలకు ఇబ్బందిగానే కాకుండా.. విశ్వసనీయతపై పెను మచ్చగా కూడా మారుతోంది. ముఖ్యంగా ఇది అధికార పార్టీ వైఎస్సార్ సీపీ(YSRCP)లోనే ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. ఇక్కడ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ(Congress party)కి కూడా పాకింది. అంతర్గతంగా పార్టీల్లో జరిగే కీలక విషయాలను కూడా నాయకులు బయట పెట్టేస్తున్నారు.
జంపింగులు కొత్తకాదు.. ఇదే!
వాస్తవానికి రాజకీయాల్లో నాయకులు(Political leaders) పార్టీలు మారడం.. జంపింగులు చేయడం సహజమే. సృష్టి ఆది నుంచి.. అన్నట్టుగా రాజకీయాల్లో ఇది కామనే. అనేక మంది ఉద్ధండ నాయకులు కూడా పార్టీలు మారిన వారు ఉన్నారు. ఉదాహరణకు హై ప్రొఫైల్ నాయకుడి విషయం చూస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ముఖ్య మంత్రిగా వ్యవహరించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి(Nallari Kirankumar reddy) కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సొంత కుంపటి పెట్టుకున్నారు. తర్వాత.. తిరిగి కాంగ్రెస్ బాట పట్టారు. మళ్లీ అక్కడ ఏమైందో తెలియదు.. బీజేపీలోకి వచ్చారు. ఇక్కడ కూడా ఉంటారన్న గ్యారెంటీ లేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే.. ఇన్ని పార్టీలు మారినా, ఆయన ఎక్కడా ఆయా పార్టీల లోగుట్లను బయటకు చెప్పలేదు.
అయితే. గతానికి ఇప్పటికీ తేడా వచ్చింది. గతంలో నాయకులు ఒక పార్టీ నుంచి మరోపార్టికి మారినప్పటికీ .. ఎక్కడా వారు గత పార్టీకి సంబంధించిన లోగుట్టును బయటకు చెప్పేవారు. తమకు తెలిసినా.. కూడా కొన్ని నియమాలు పాటించి.. వేరే వేరే విమర్శలు చేసేవారు తప్ప.. పార్టీలకు సంబంధించిన గుట్టును మాత్రం ఎక్కడా వెల్లడించేవారు కాదు. ఇక, ఎన్టీఆర్(NTR) హయాంలో అయితే.. అసలు జంపింగులను పెద్దగా ప్రోత్సహించేవారు కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్నాళ్ల వరకు జంపిగులను ఒప్పుకొనేది కాదు. సొంతపార్టీ లో ఎదగాలనే సిద్ధాంతాలను అమలు చేశారు. తర్వాత తర్వాత.. మారిన రాజకీయాలు అవసరాలు.. ట్రెండును దృష్టిలో పెట్టుకుని.. నాయకులు దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టంగా మారిపోయింది. అయితే.. ఇలా వెళ్తున్న వారు ఊరికేనే వెళ్లడం లేదు. పార్టీల లోగుట్లు తెలుసుకుని, వాటిని బయట పెడుతున్నారు. ఇది ఆయా పార్టీలకు మరింత ఇబ్బందిగా మారింది.
ఇవీ.. తాజా ఉదాహరణలు!
+ కొన్నిరోజుల కిందట బయటకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు.. అనేక విషయాలు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ.. అలాంటిదేమీ లేదని చిత్తూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే బాంబు పేల్చారు.
+ మంత్రి ముందు ఎస్సీ నేతలను కూర్చోడానికి కూడా కుర్చీలు వేయరని మరో నేత చెప్పుకొచ్చారు.
+ ఇంకో ఎమ్మెల్యే.. ఏకంగా.. మూడు రాజధానుల విషయంలో తమతో బలవంతంగా సంతకాలు చేయించారని చెప్పారు. ముడు రాజధానుల విషయంపై సీఎం జగన్ ఇంట్లోనే భేటీ జరిగిందన్నారు.
+ గుంటూరుకు చెందిన బీసీ నాయకుడు.. సెల్ఫీ వీడియోలో వైసీపీని విమర్శించారు. బీసీలకు న్యాయం అని చెప్పుకొంటున్నారని.. కానీ, ఇది నేతిబీరకాయలో నెయ్యి ఎంత నిజమే అది కూడా అంతే నిజమని.. తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన చెప్పారు.
+ సీమకు చెందిన మహిళా ఎమ్మెల్యే.. ఎస్సీలకు వైసీపీలో ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా.. అదేం లేదని..అగ్రవర్ణాల వారే నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇదికూడా కలకలం రేపింది.
+ ఇక, తాజాగా కాంగ్రెస్‌పార్టీ నుంచి తిరిగి వచ్చి వైసీపీలో చేరిన మంగళగిరి(Mangalagiri) ఎమ్మెల్యే.. ఆళ్ల రామకృష్ణా రెడ్డి(Alla Ramakrishna reddy) కూడా ఈ జాబితాలో చేరారు. కాంగ్రెస్‌పార్టీలో ఉంటే.. సీఎం జగన్‌ను తిట్టిపోయాలంటూ.. నాయకులు కోరారని సంచలన వ్యాఖ్యలతో గుట్టు బయట పెట్టారు.
కట్ చేస్తే..
వాస్తవానికి ఇవన్నీ అన్ని పార్టీల్లోనూ ఉండే లోగుట్లు. దీనికి ఎవరూ అతీతులు కాదు. కానీ, పార్టీల నుంచి బయటకు వచ్చాక.. వచ్చేస్తామని నిర్ణయించుకున్నాక నాయకులు వాటిని బయటకు చెప్పేస్తుండడం ఆయా పార్టీల విశ్వసనీయతపైనా.. కేడర్‌పైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.