వివాదమవుతున్న జోగి రమేష్ తీరు- సొంతపార్టీ నేతల్లో కూడా అసహనం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మంత్రి జోగి రమేష్ తీరుపై ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రతిపక్షాలు, అధికార పక్షంలోని నేతలు సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ఆ మంత్రి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దూకుడు కామెంట్స్ చేయటంలో అందరికి అట్రాక్ట్ చేసిన ఆయన ఇప్పుడు అదే కామెంట్స్‌తో పార్టీ నేతలకి కూడా ఇరిటేషన్ తెప్పిస్తున్నారని టాక్.
జోరు సరే జోగి....
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మంత్రి జోగి రమేష్ తీరుపై ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రతిపక్షాలు, అధికార పక్షంలోని నేతలు సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ఆయన మాటలకు అడ్డూఅదుపు లేకుండాపోవటం దీనికి కారణం అంటున్నారు. విమర్శలు, ఆరోపణలు చేసే క్రమంలో ఆయన చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి.
జోగికి మాత్రమే ఛాన్స్-అందుకే అలాంటి మాటలు
రాజధాని ప్రాంతంలోని ఆర్ ఫైవ్ జోన్‌లో పేదలకు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్‌కు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్న వేదికపై భారీగా తరలి వచ్చిన లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో జోగి రమేష్ దూకుడుగా వెళ్ళాలని భావించారు. ఈ క్రమంలో ప్రాస కోసం పాకులాడి, పవన్ పార్టీలు మార్చుతారు, తార్చుతారు అంటూ జోగి రమేష్ మాట్లాడారు. ఇదే పెద్ద సంచలనమైంది. ఇలా జోగి దూకుడుగా మాట్లాడటం సొంత పార్టీ నేతల్లోనే ఆగ్రహానికి కారణమైంది. ఇదే విషయాన్ని జోగి రమేష్‌కి కూడా చెప్పారని అంటున్నారు. జోగి చేసిన కామెంట్స్ వల్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ళ శంకుస్థాపన కార్యక్రమానికి కావాల్సినంత ప్రచారం దక్కలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
జనసేన నేతల నిరసనలు..
ముఖ్యమంత్రి సమక్షంలోనే మంత్రి జోగి రమేష్ జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు చోట్ల జనసేన నాయకులు ఆందోళనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితోపాటుగా, మంత్రి జోగి రమేష్ దిష్టిబొమ్మలను తగలపెట్టేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవటం తో మరింత వివాదానికి కారణమైంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పోటీగా నిరసనలు తెలిపారు. మంత్రి జోగి రమేష్‌కు వ్యతిరేకంగా జనసేన ఆందోళనలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ నాయకులు ఖండించారు. బీసీ మంత్రి అయిన జోగి రమేష్‌పై జనసేన నేతలు ఇష్టానుసారంగా కామెంట్స్ చేయటం ఏంటంటూ ప్రశ్నించారు.
వివాదాస్పదంగా మంత్రి తీరు..
మంత్రి జోగి రమేష్ తీరు ఇప్పుడు నియోజకవర్గంలో కూడా వివాదానికి దారి తీస్తోంది. పెడన నియోజకవర్గంలో మంత్రి కాన్వాయ్‌ను చూసి కూడా ఓ యువకుడు లేచి నిలబడలేదని అతనిపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. పోలీసులకు కూడా చెప్పి హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం నడుస్తోంది. లేచి నిలబడలేదని జిల్లా ఉద్యోగులకు కూడా జోగి రమేష్ క్లాస్ పీకారు ఓసారి. ఇలా తన పేరు వినిపించాలి కనిపించాలి అన్న ఆశతో, ముఖ్యమంత్రిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో జోగి రమేష్ చేసిన ప్రయత్నాలు వివాదాలుగా మారుతున్నాయి.