AP BJP Plan : క్లూ లెస్‌గా ఏపీ బీజేపీ నేతలు ! హైకమాండ్ రూట్ మ్యాప్ ఇవ్వడం లేదా ?
ఏపీ బీజేపీ కి రాజకీయాల్లో ఎలా ముందడుగు వేయాలన్న స్పష్టత లేకుండా పోయింది. హైకమాండ్ నుంచి స్పష్టత లేకపోవడంతో నేతలు కూడా.. జోరు తగ్గించుకుంటున్నారు.
AP BJP Plan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పాత్ర చాలా పరిమితం. కానీ దేశం మొత్తం బీజేపీ పురోగమిస్తూంటే.. ఏపీలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. ఒక్కో సారి ప్రభుత్వంపై పోరాటం అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతారు కానీ.. అది వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. జనసేన వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ప్రకటన రాదు. ఇటీవల నుంచి బీజేపీ నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. మీడియాలో కూడా హడావుడి తగ్గించారు. ఇదేమైనా వ్యూహమా లేకపోతే.. నాయకత్వంలో స్తబ్దత ఏర్పడిందా అన్నది క్యాడర్ కు కూడా క్లారిటీ లేకుండా పోయింది.
ఎన్నికల వేడి పెరిగినా ఏపీ బీజేపీలో కనిపించని హడావుడి
ఏపీలో మందస్తు ఎన్నికలు వస్తాయో రావో కానీ.. వైసీపీ, టీడీపీ మాత్రం రంగంలోకి దిగిపోయాయి. గడప గడపకు మన ప్రభుత్వం అని వైసీపీ, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని.. టీడీపీ ప్రతీ ఇంటికి వెళ్లి తామున్నామని గుర్తు చేస్తోంది. జనసేన పార్టీ ఇలా ఇంటింటికి వెళ్లే ప్రోగ్రాం పెట్టుకోకపోయినా.. అడపాదడపా వార్తల్లో ఉండే పోరాటాలు చేస్తోంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం రాడార్‌లో చాలా పరిమితంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. యాక్టివ్ గా ఉండే యువ నేతలు కూడా పార్టీపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. దీనికి కారణమేమిటో మాత్రం స్పష్టత లేకుండా పోయింది.
జనసేనతో పొత్తు నిలుపుకునే ఆలోచన ఉందా ? లేదా ?
జనసేన పార్టీ తాను వైసీపీ ముక్త ఏపీ కోసం పని చేస్తానని ప్రకటించింది. ఎన్నికల్లో ఓట్లు చీలకుండా చూసుకుంటానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఆయన ఒకే మాట మీద ఉన్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతో కలిసే పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ వీరి వైపు ఒక్కరంటే ఒక్క జనసేన నేత కూడా మాట్లాడటం లేదు. తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటున్నారు కానీ.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని మాత్రం చెప్పడం లేదు. బీజేపీ నేతలు మాత్రమే ఏకపక్షంగా ప్రకటనలు చేస్తున్నారు. పోనీ బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు జనసేన ఆసక్తి చూపుతుందా అంటే.. అదీ లేదు. కనీసం రాజకీయ పోరాటాల్లోనూ రెండు పార్టీల నేతలు కలవడం లేదు. దీంతో.. జనసేనతో బీజేపీ పొత్తు ఉటుందంటే ఎక్కువ ఎవరూ నమ్మడం లేదు.
వర్గ విభేదాల వల్ల బీజేపీ సైలెంట్ అయిపోయిందా ?
ఏపీ బీజేపీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ సుదీర్ఘంగా పార్టీలో పాతుకుపోయిన నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు మాత్రం భీకరంగా జరుగుతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో సోము వీర్రాజును అధ్యక్షుడిగా మార్చేస్తారని ప్రచారం జరిగింది. సత్యకుమార్ ను ఏపీ బీజేపీకి అధ్యక్షుడ్ని చేయాలని కొంత మంది అసంతృప్త నేతలు లాబీయింగ్ చేశారని కూడా చెప్పుకున్నారు. అదే సమయంలో సోము వీర్రాజు పార్టీని నాశనం చేస్తున్నారని కన్నా లక్ష్మినారాయణ వంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారిపోతారన్న ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన కాపు నేతల సమావేశాల్లో పాల్గొంటున్నారు. జనసేన పార్టీ కీలక నేత నాదెండ్లతోనూ చర్చలు జరిపారు. ఇవన్నీ బీజేపీలో చర్చనీయాంశం అయ్యేవే.
ఏపీలో రూట్ మ్యాప్‌పై హైకమాండ్ స్పష్టత ఇవ్వలేకపోతోందా ?
ప్రస్తుతానికి ఏపీ బీజేపీ నేతలు క్లూ లెస్ గా ఉన్నారు. ఏపీలో రాజకీయపోరాటంపై హైకమాండ్ స్పష్టమైన సూచనలు ఇవ్వకపోవడమే దీనికి కారణం అనుకోవచ్చు. గతంలో ఎక్కువగా ఏపీలోనే తిరిగే పార్టీ వ్యవహారాల కో ఇంచార్జ్ సునీల్ ధియోధర్ పెద్దగాఏపీలో కనిపించడం లేదు. ఇతర విషయాల్లో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్న హైకమాండ్.. ఏపీలో ఏ మాత్రం చాన్సుల్లేవని డిసైడైపోయి.. పూర్తిగా పక్కన పెట్టేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా... ఏపీలో బీజేపీ పరిస్థితి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.